3.7 C
New York
Saturday, March 7, 2026

గురజాడ మార్గం ఏది? ఆయన వారసులెవరు?

ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

‘గురజాడ అప్పారావు గారికి మేము వారసులము’  అని ఎవరైనా ప్రకటించుకోవాలంటే చాలా  ధైర్యం కావాలి. నిజాయితీ కావాలి. గురజాడ అప్పారావు ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతలలో అగ్రేసరులు. కందుకూరి, గిడుగు, గురజాడలు- ఈ ముగ్గురు ఒక త్రయం. ఆధునిక భాషా సాహిత్య నిర్మాత లయినటువంటి ముగ్గురు మహానుభావులు. వీళ్లు ఆధునిక రచయితలు. సంప్రదాయ రచయితలు కాదు. సనాతనవాదులు కాదు. వాళ్ళు అప్పటికి కొన్ని పరిమితులకు లోబడి ఉండవచ్చు. కానీ వాళ్లు నలిగిన బాటలో నడవలేదు. తమదైన కొత్తబాట వేసుకున్నారు. వాళ్ళను ఆధునిక సామాజిక వైజ్ఞానిక ఉద్యమాలు, పరిశోధనలు నడిపించాయి. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా ఎవరు పడితే వారు, ‘గురజాడ మాకు గురువు’ అనో, లేక ‘గురజాడకు మేము వారసులమ’నో తగుదునమ్మా అని ఆధునికపంక్తిలో దుప్పటి పరచుకోవడం అన్యాయం, అక్రమం అవుతాయి. గురజాడ అనుయాయులనిపించుకోవాలంటే , ఆయన సాహిత్యంలో ఆయన ప్రకటించిన ఆధునిక భావాల పట్ల మమేకం కావాలి. ఆ అభిప్రాయాలను నమ్మాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. ఆయన ఎప్పుడో ఏవో సందర్భాల కోసం రాసిన సంప్రదాయ కవితలు ఒకటో, రెండో పట్టుకుని, ‘ఆయన మా వాడు’ అని సంప్రదాయవాదులు ప్రకటించుకుంటే,అది వాళ్ళ దివాలాకోరుతనానికి నిదర్శనమే అవుతుంది. గురజాడ అప్పారావు మానవవాది, మానవతావాది. ఆయన దైవవాది కాదు.

“మనిషి చేసిన రాయిరప్పకు మహిమ కలదని సాగిమొక్కుతు 
మనుషులంటే రాయి కన్నా కనిష్టంగాను చూస్తావేల  బేలా? దేవుడెకడో దాగెనంటూ
కొండ కోనల వెతుకులాడే వేల?
మనిషి మాత్రుడి యందు లేడో కోరి అడిగిన కరిగి ఈడో ముక్తి?

ఇది గురజాడ రాసిన ‘మనిషి’ అనే కవిత. మేము గురజాడకు వారసులము అని ఎవరైనా ప్రకటించుకోవాలంటే ముందు ఈ ‘మనిషి’ అనే కవితను ఆమోదించాలి. ఆమోదించినట్టుగా ప్రకటించాలి. ఈ కవితను ఆమోదిస్తే భారతదేశంలో మతసంఘర్షణలు నశిస్తాయి. విగ్రహాల చుట్టూ అల్లుకున్న రాజకీయాలు తెరమరుక్కి పోతాయి. భారతదేశం లౌకికదేశం అవుతుంది .సారాంశంలో మతం అదృశ్యం అవుతుంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన సౌభ్రాత్రత ఈ కవిత వల్ల సిద్ధిస్తుంది. గురజాడ విగ్రహ రాజకీయ వ్యతిరేకవాది. ‘పెద్ద మసీదు’,’ మీ పేరేమిటి?’ వంటి కథలలో ఆయన మతాల బండారాన్ని బయట పెట్టాడు. ఎందుకంటే ఆయన మనిషి పక్షపాతి గనక. మతాలు ఉన్నాయి కాబట్టి భిన్నమతాలకు చెందిన ప్రజలు పరస్పర సామరస్యంతో బతకాలని ఆయన కోరుకున్నారు.

“అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్”
“మతం ఏదైతేను యేమోయి
మనసులొకటై మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయి
అంతే స్వర్గసుఖుంబులన్నవి
అవని విలసిల్లున్”

అని గురజాడ స్పష్టంగా ప్రకటించాడు. అందువల్ల మతాన్ని పక్కకు నెట్టి మనిషి వైపు వాలిన వాళ్లే గురజాడకు వారసులు అవుతారు. గురజాడ మనుషుల మధ్య భూస్వామ్య పెట్టుబడుదారీ సంబంధాలను పూర్తిగా తిరస్కరించారు.

గురజాడ మనుషుల మధ్య ప్రేమసంబంధాలను, శ్రమసంబంధాలను  కోరుకున్నారు. ఇప్పుడు మనం పెంపొందింపవలసిన ప్రేమబౌద్ధం ప్రతిపాదించిన ప్రేమ, విశ్వమానవప్రేమ అని ఆయన తన లేఖలలో  ప్రతిపాదించారు. బౌద్ధమతం పట్ల గురజాడకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆయన సాహిత్యంలో బౌద్ధం చాలా పర్యాయాలు ప్రస్తావనకు వచ్చింది. ఆయన “ఏనాడు బౌద్ధం దేశంలోనుంచి వెళ్ళగొట్టబడిందో ఆనాడే భారతదేశం మతవిషయకంగా ఆత్మహత్య చేసుకుంది” అని గంట కొట్టినట్లు ప్రకటించారు. ‘మేము గురజాడ వారసులము’ అని ప్రకటించుకునే వాళ్ళు బౌద్ధధర్మాన్ని తప్ప, మరొక మతం వైపు, ధర్మం మొగ్గు చూపకూడదు.  ఎందుకంటే బౌద్ధం మానవ ధర్మం. నిరీశ్వర ధర్మం. మిగతా మతాలన్నీ భావవాద ధర్మాలు. బౌద్ధం భౌతికధర్మం. అందుకోసం గురజాడను ఆమోదించడం అంటే భౌతికవాదాన్ని ఆమోదించడంగానే మనం భావించాలి. భౌతికవాదులు కాని వాళ్ళు ఎవరూ గురజాడ అడుగుజాడలలో నడిచేవారుగా గుర్తింపు పొందరు. గురజాడ భౌతికవాదమే తెలుగు సమాజంలో మార్క్సిస్టులను ఆకర్షించింది. దానిని అర్థం చేసుకోలేని అర్భకులు, కమ్యూనిస్టులు మోయడం వల్లనే గురజాడకు ప్రాచుర్యం వచ్చింది అని అంగలార్చారు.

భారతీయ సమాజం వర్ణసమాజం, కులసమాజం. ఇది మానవులను విభజించి పాలిస్తున్నది. విభజించి పాలించడం అన్నది వలసపాలకుల లక్షణంగా మనం ప్రచారం చేసుకుంటున్నాం. కానీ భారతీయ వర్ణధర్మంలోనే మనుషుల్ని విభజించి పాలించే లక్షణం ఉంది. మనుషుల్లో ఎక్కువ తక్కువలు నిర్ణయించే లక్షణం ఉంది. అందుకే దీనిని ‘నిచ్చెనమెట్ల సమాజం’ అని అంటారు. గురజాడ అప్పారావు కులవ్యవస్థను తిరస్కరించారు. కులనిర్మూలనను ప్రతిపాదించారు. కులనిర్మూలన జరగాలంటే కులాంతర వివాహం ఒక సాధనం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కులనిర్మూలన అనే వ్యాసంలో ప్రతిపాదించినది దీనినే. ఈ సిద్ధాంతాన్నితన కవిత్వంలో ప్రతిపాదించారు. ‘ముత్యాలసరములు’ అనే కవితలో కవి సూర్యోదయం కన్నా ముందు ఇంటికి చేరుకున్న కవి తన భార్యతో బరంపురంలో జరిగిన సహపంక్తి భోజనాలగురించి చెబుతాడు. ఆమె చాలా చిరాకు పడి, ఇలా అంటుంది. 

“కలిసి మెసవిన యంత మాత్రనె
కలుగబోదీ యైకమత్యము 
మాల మాదిగ కన్నెనెవతెనొ తగులు కొనరాదో”

అని దెప్పి పొడుస్తుంది. “ముత్యాలసరములు” కవితలో ఇలా చెప్పిన గురజాడ,  ‘లవణరాజు కల’ కవితలో కులాంతర వివాహాన్ని ప్రతిపాదించారు. కులతత్వాన్ని నిరసించారు. ‘లవణరాజు కల’లో ఒక రాజు ఒక మాల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. రాజు ఆధిపత్య వర్గానికి చెందినవాడు. వర్ణధర్మాలు సంకరం కాకుండా కాపాడడం సంప్రదాయం ప్రకారం రాజు కర్తవ్యం. అలాంటి రాజుతోనే గురజాడ ఒక దేశ సర్వోన్నత న్యాయస్థాన అధిపతితో తీర్పు ఇప్పించినట్లుగా “వర్ణధర్మమధర్మ ధర్మంబే” అని ప్రకటించారు. ఇది 1910 నాటికి తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మకమైన ప్రకటన. సనాతనులకు, సంప్రదాయవాదులకు, యథాతథవాదులకు, తిరోగమనవాదులకు, మతవాదులకు, మతోన్మాదులకు వీపు మీద కొట్టిన జాటిదెబ్బలాంటిది. ఒళ్ళు జలదరిస్తుంది. కాళ్లు వణుకుతాయి. వర్ణవ్యవస్థ భగవంతుని సృష్టి అని అనేక పురాణాలలో చెప్పించిన కవులు గురజాడ ముందు తలవంచుకుని నిలబడవలసి వస్తుంది. గురజాడ వర్ణధర్మాల మీద ‘లవణరాజు కల’లో ఏడు ఖండికలలో తీవ్రమైన విమర్శ పెట్టారు. ఒకే దెబ్బతో జంతువును చంపే వాడికి కులంలేదట, మనిషిని నిరంతరం హింస పెట్టే వాడికి కులం ఉన్నదా? అని ఆయన ప్రశ్నించారు.

“మంచి చెడ్డలు మనుషులందున
ఎంచి చూడగ రెండె కులములు 
మంచియన్నది మాల అయితే మాల నేయగుదున్”

అన్నాడు. ఇది భారతీయ సమాజంలో సకలరకాల  ఉత్పత్తులకోసం జీవితాలను అంకితం చేసే దళితజాతి తరపున ఒక ఆధిపత్యకులంలో పుట్టిన కవి, వకాల్తా పుచ్చుకొని చేసిన ప్రకటన. ఈ ప్రకటనలో డి కాస్టిఫికేషన్ అంటే అకులీకరణ అనేది కనిపిస్తుంది. అంటే ఒక ఆధిపత్య కులానికి చెందిన కవి కిందికి నెట్టబడ్డ కులాల వాళ్ళ తరఫున మాట్లాడుతూ తన ఆధిపత్య కులభావాన్ని తిరస్కరించడం. అందుకోసం ఎవరైనా మేము గురజాడకి వారసులం అని ప్రకటించుకోవాలంటే మొదట కులవ్యవస్థను, కులాధిపత్యాన్ని, కుల అహంకారాన్ని వదులుకోవాలి. కులాంతర వివాహాలు కూడా చేసుకోవాలి, జరిపించాలి. బహుశా గురజాడకు ఆ రోజుల్లో ఆ అవకాశం రాలేదేమో. ఆయన రాసుకున్న నోట్స్‌లలో ఒక అభిప్రాయం చాలా విలువైనదిగా కనిపిస్తుంది. అదేమిటంటే, ఒక దళితుడు ఎదురైనప్పుడు దళితుడు కాని వ్యక్తి అతనిని కౌగిలించుకోకపోతే అతను మనిషి కాదు అన్నారు. ఎంత విప్లవాత్మకమైన భావమో చూడండి. దీనిని ఆచరణలో పెట్టినవాడే గురజాడకు వారసుడవుతాడు. భారతీయ సమాజం చాలా ఆధునికమైపోయింది. 150 ఏళ్ల క్రితంతో పోల్చి చూస్తే భారతదేశం చాలా ఆధునికమైంది. అయితే అదంతా భౌతికంగానే. భావజాలంలో మాత్రం భూస్వామ్య వ్యవస్థలోనే ఇరుక్కుని ఉన్నది.

భారతీయ సమాజం పురుషాధిపత్య సమాజం. అన్నిటినీ మగవాడే నిర్ణయిస్తాడు. ఇంట్లో ఆడవాళ్ళకి విధాన నిర్ణయాలలో భాగస్వామ్యం ఉండదు. కన్యాశుల్క నాటకంలో అగ్నిహోత్రావధాని తన సంతానానికి పెళ్లిళ్లు నిర్ణయించిన పద్ధతిలో ఈ భూస్వామ్య పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది.

గురజాడ అప్పారావు స్త్రీ పురుష సంబంధాలలో విప్లవాత్మకమైన మార్పులను ప్రతిపాదించారు. ‘సౌదామిని’  అని ఒక నవల రాయడానికి ఆయన కొంత నోట్స్ రాసి పెట్టుకున్నారు. అందులో ఆయన చేసిన ఒక ప్రతిపాదన… ప్రతి గ్రామంలోనూ ఒక క్యాంటీన్ ఉండాలి, స్త్రీ పురుషులు సమాజంలో అనేక పనులు చేసుకుని వచ్చి గ్రామం అంతా ఆ క్యాంటీన్లో భోంచేయాలి, ప్రతి ఇంటిలోనూ ఆడవాళ్లు వంట పనులకు పరిమితం కావటం వల్ల ఉత్పత్తి తగ్గిపోయి దేశ ప్రగతి కుంటుపడుతున్నది, అందువల్ల వంటిళ్ళను ధ్వంసం చేయాలి అని ఆయన ప్రతిపాదించారు. 1985 తర్వాత స్త్రీవాదం అనేది ఒకటి మొదలైన తర్వాత ఈ వంటింటి వ్యవస్థ మీద కవయిత్రులు విమర్శలు పెట్టారు. విమల ‘వంటిల్లు’ కవిత మనందరికీ బాగా తెలిసినటువంటి కవిత. ఆ వంటిల్లు కవితలో విమల ఏ పిలుపునిచ్చారో ఆ పిలుపును గురజాడ 1915కి ముందే ఇచ్చారు. అది ఆయన ముందుచూపునకు నిదర్శనం. కుటుంబంలో పురుషాధిపత్యాన్ని గురజాడ పూర్తిగా తిరస్కరించారు. మహిళలతో మగవాళ్ళ మీద తిరుగుబాట్లు చేయించారు. వెంకమ్మ అగ్నిహోత్రావధానిని ‘నన్నడగకుండా సుబ్బికి పెళ్లి ఎందుకు నిశ్చయించావు?’ అని ప్రశ్నించింది. పూటకూళ్ళమ్మ గిరీశాన్ని కొట్టడానికి చీపురు తీసుకొని వచ్చింది. మీనాక్షి తన శరీరాన్ని వాడుకొని, ‘తాను చెడిపోయింది’ అని ప్రచారం చేస్తున్న రామప్పంతులను పెళ్లి చేసుకోమని వెంటబడి తరిమింది. అది కూడా స్మశానం వైపు తరిమింది. బుచ్చమ్మ తనతండ్రి ద్వారా తనకు జరిగిన అన్యాయం తన చెల్లెలికి జరగకూడదని గిరీశం అనే ఒక అవకాశవాదితో లేచిపోయి చెల్లి పెళ్లిని తప్పించడానికి ప్రయత్నించింది. లోకమంతా చెడిపోయింది అని నిందించే జాతికి చెందిన మధురవాణి ఈ సభ్య సమాజంలో సభ్యులైనటువంటి వైదిక నియోగి బ్రాహ్మణులందరితో పిల్లి, ఎలుకలతో ఆడుకున్నట్టుగా ఆడుకుంది. ఆ నాటకంలో చాలా మంచిపాత్ర అయిన సౌజన్యారావు పంతులును కూడా ఆమె తన మేధస్సుతో ఓడించింది.

తనను అబద్దాలు చెప్పి వంచిస్తున్న గిరీశం గుట్టును రట్టు చేసి, సౌజన్యారావు పంతులు దగ్గర ‘పాపం ఆయనను బతకనివ్వండి’ అని విజ్ఞప్తి చేసింది. అది ఆమెలోని మానవత్వం. ‘దిద్దుబాటు’ కథానికలో కమలిని చదువుకున్న అమ్మాయి. భర్త మోసం చేస్తూ ఉంటే, తన విద్య అందించిన తెలివి ద్వారా ఒక లేఖ రాసి పెట్టి భర్తను సంస్కరించుకున్నది. 

‘మీ పేరేమిటి?’ కథానికలో నాంచారమ్మ పాత్రను గురజాడ మతాన్ని స్వార్థప్రయోజనాలకు ఉపయోగించుకునే పూజారులకు భూస్వాములకు బుద్ధి చెప్పే పాత్రగా చిత్రించారు. ఇవన్నీ చూసినప్పుడు మనకు గురజాడ అప్పారావు స్త్రీ పక్షపాతి అని అర్థం అవుతుంది. ‘కన్యక’ అనే కవితలో రాజు ఆ అమ్మాయిని బలాత్కారం చేయబోతే ఆ అమ్మాయి, “నువ్వు ఈ పట్నాన్ని పరిపాలించే రాజు అయితే, నా మీద నీకు ప్రేమ ఉంటే పెళ్లి చేసుకో” అని అడిగింది. ఇది ఈనాడు ప్రేమ పేరుతో వంచిస్తున్న మగవాళ్లకు అందరికీ వర్తించే సవాలు. గురజాడ అప్పారావు ‘కాసులు’ అనే కవితలో ”మగడువేల్పన పాతమాటది నేను ప్రాణసఖుడ” అని భర్తతో చెప్పించారు. భర్త అంటే పురుషాధిపత్యానికి ప్రతినిధి. అతనితోనే ఈ మాట చెప్పించారు అంటే ఎవరు మారాలో గురజాడ అప్పారావు గారికి బాగా తెలుసని అర్థం. కులవ్యవస్థలో మారవలసింది ఆధిపత్య కులాల వారు.  పురుషాధిపత్య కుటుంబ వ్యవస్థలో మారవలసింది పురుషులు. అందుకోసమే ‘లవణరాజు కల’లో రాజుతోనూ, ‘కాసులు’ కవితలో భర్తతోనూ ఆయన కొత్త భావాలు చెప్పించారు.

శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక విప్లవాలు సాధించిన ఈకాలంలో కూడా మనం  గ్రహణాలకు భయపడుతున్నాం.  అనేక ప్రకృతి పరిణామాలను చూసి భయపడుతున్నాం. అనేక  అశాస్త్రీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నాం. దేవుళ్ల పేరుతో భక్తి పేరుతో అనేక తలకిందులు పనులు చేస్తున్నాం. గురజాడ అప్పారావు ఆధునికకవిగా, ప్రజాకవిగా మన భారతీయ సమాజాన్ని తనకు సాధ్యమైనంత వరకు ఒక శాస్త్రీయమైన సమాజంగా మార్చడానికి ప్రయత్నం చేశారు. ‘ముత్యాల సరములు’ కవితలోనే తోకచుక్క కనిపిస్తే భయపడే ప్రజలకు ఆయన ధైర్యం చెప్పారు. తోకచుక్క కనిపిస్తే దేశానికి అరిష్టంగా భావించే సమాజానికి ధైర్యం చెబుతూ ఆయన (దానికి)  ‘దూరపు బంధువు’ అని పేరు పెట్టారు.78 సంవత్సరాలకు ఒకసారి మనల్ని పలకరించి పోవడానికి వచ్చే దూరపు బంధువు అన్నారు. అంతే కాదు ఆ తోకచుక్కను సంఘసంస్కరణ ప్రయాణ పతాక అనికూడా వర్ణించారు. ఎంత ధైర్యం! చూడటానికి బక్కపలచగా ఉండే మనిషికి ఎంత గుండెదిటవు ఉందో చూడండి. ఈనాడు కూడా పైన ఏదైనా కనిపిస్తే చాలు జనం పూజలకు దిగేస్తారు. మొన్ననే ఒక వేపచెట్టు ఎక్కడో తిరుగుతూ కనిపించిందట జనం టెంకాయలు, కర్పూరాలు తీసుకొని పరిగెత్తుకొని పోయారు. ఎప్పుడు 21 శతాబ్దంలో! 20వ శతాబ్దం తొలినాళ్లలోనే ఆయన, ‘ఈ తోకచుక్క అనేది సంఘసంస్కరణ, ఒక ప్రయాణానికి పతాక అంటే జండాగా భావిస్తాను’ అన్నారు. అందుకోసం మేము గురజాడ వారసులం అని చెప్పుకునే వాళ్ళు ఏ రకమైన మౌఢ్యాన్ని ఆమోదించకూడదు. శాస్త్రీయ చింతనాపరులే గురజాడకు వారసులు. అశాస్త్రీయవాదులు గురజాడను వాడుకుంటే అది అవకాశవాదం తప్ప సరైన వాదం కాదు.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles