31 C
New York
Wednesday, July 22, 2026

ప్రకాశిక - పరిచయం

ఆధునిక కవితకు అడుగుజాడ అయిన మహాకవి శ్రీ గురజాడ వేంకట అప్పారావు గారు తలపెట్టిన పత్రిక ‘ప్రకాశిక’. ఆ పత్రికని పునరుద్ధరించి ఆయన స్మృతికి ఘన నివాళి ఇవ్వాలనే ఉద్దేశంతో గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా) ‘ప్రకాశిక‘ ను అంతర్జాల, డిజిటల్‌ పత్రికగా గత మూడు సంవత్సరాలుగా ప్రచురిస్తోంది. యావత్‌ తెలుగు జాతికి అలనాటి భాష, సంస్కృతి, సంప్రదాయం, వ్యావహారికాలను, సమకాలీన సాహితీ ప్రక్రియలను పరిచయం చేస్తూ, నేటి సమాజపు స్థితిగతులకు అద్దం పట్టే ఒక వేదికగా ప్రకాశిక ను రూపుదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ప్రకాశిక త్రైమాస పత్రికగా వెలువడుతోంది.

గురజాడ కలంనుండి జాలువారిన అక్షర మాలికలు ఎన్నో గురజాడ వేంకట అప్పారావు గారికి ‘మహాకవి శ్రీ గురజాడ అప్పారావు’గా గుర్తింపు తెచ్చాయి. ఆయన రచనలు ఆణిముత్యాలు, సరస సరాగాలు, ముత్యాల సరాలు, పరిసరాలని పరిశీలిస్తూ, ప్రభావితమవుతూ, మంచి అన్నది పెంచమంటూ, భాష భావ వ్యక్తీకరణకు సాధనమే కానీ పద డాంబిక ప్రదర్శనకు సూచిక కాదని నమ్మి, తెలుగు భాషని తేటగా, తీయగా, సరళంగా, సరసంగా పండిత పామరులకు చేరువ చేయడంలో ఆయన సలిపిన కృషి అజరామరం, చిరస్మరణీయం.

సాంఘీక దురాచారాలని వ్యావహారిక భాషలో ఎత్తిచూపి, వ్యంగ్యాయుధంతో వాటిని కూకటివేళ్లతో సహా పెకిలించిన అరుదైన భాషావేత్త, సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ వేంకట అప్పారావుగారు. అక్షరాయుధంతో మరెన్నో సాధించాలనుకున్నారో ఏమో, ‘ప్రకాశిక‘ పత్రికను ఆయన స్థాపించారు. అయితే, ఆ పత్రిక ఎంతోకాలం సాగిన దాఖలాలు లేవు. తొలి రాత ప్రతి దొంగిలించబడిందని ఆయన వంశీకుల ఆవేదన. ప్రకాశిక పత్రిక పరహస్తగతమైనా, అందులోని భావ తరంగాలు శతాబ్దానికి పైగా ఎన్నో తరాలను ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి.

ఆ మహాకవి కాలంలో ఉన్న దురాచారాలు, మూఢ నమ్మకాలు ఈ కాలంలో కూడా ఆధునిక పరిజ్ఞానంతోపాటు, ఏదో ఒక రూపంలో విరివిగా, విస్తృతంగా కొనసాగుతున్నాయి. మనుషులలోని భయాలనీ, ఆందోళనలనీ ఆసరాగా తీసుకుని, అరకొర జ్ఞానంతో, శాస్త్రాలకి వక్రభాష్యాలతో అమాయకులని మోసంచేసే నవయుగ గిరీశాలు కోకొల్లలుగా, ఖండాంతరాలుగా వ్యాపించి ఉన్నారు. సమాజంలో, ముఖ్యంగా యువతలో హేతుబద్ధ అలోచనలు పెంచే ప్రయత్నం ప్రకాశిక ద్వారా చేద్దాం. గురజాడ వ్యక్తిత్వ స్ఫూర్తితో, ఆయన ఆలోచనలకు అనుగుణంగా, భాషోద్టీపన, సమాజ శ్రేయస్సులను కాంక్షిస్తూ ‘ప్రకాశిక’ని నడపాలని గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా) సంకల్పం.

సమాజాన్ని తట్టి, కుదిపి, అలోచింపచేసే రచనలూ, వెన్నుతట్టి దారిచూపే దార్శనికుల వ్యాసాలు, మస్తిష్కానికి పదును పెట్టే శీర్షికలతో ‘ప్రకాశిక” ను అందంగా ముస్తాబు చేసి పాఠకులకు గత మూడు సంవత్సరాలుగా అందిస్తున్నాం. ప్రకాశికలో ప్రచురణ కోసం తెలుగు మాండలిక శోభతో వ్రాసీన రచనలని ప్రోత్సహిస్తాం. హాస్యం, వ్యంగ్యం, వెటకారం తెలియని, నచ్చనివాడు తెలుగువాడు కాదేమో అనిపిస్తుంది! కన్యాశుల్కం ఒక ప్రభావవంత నాటకంగా నిలిచిండంటే, హాస్యం, వ్యంగ్యం, వెటకారాలని అనుపానంగా పెట్టి నిష్థూరాన్ని నిబ్బరంగా చెప్పడం వలనే కదా! హాస్య, వ్యంగ్యభరిత, రచనలు పంపిస్తే కళ్ళకద్దుకొని తీసుకుంటాం.

కథ, కవిత, వ్యాసం, అనువాద రచన మొదలైన సాహిత్య ప్రక్రియలకీ, సాహిత్య, సామాజిక అంశాల మీద రాసిన పరిశోధనా పత్రాల ప్రచురణకీ ‘ప్రకాశిక‘ ఒక విలక్షణమైన వేదికగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏ ప్రక్రియలోనైనా యువతరం చేసే రచనలను ప్రకాశిక ప్రోత్సహిస్తుంది.

‘ప్రకాశిక’ను ప్రకాశవంతంగా, శోభాయమానంగా తీర్చిదిద్దడంలో సాహితీ మిత్రులు, రచయితల అండదండలు, సహకారం మాకు సదా అవసరం. ‘ప్రకాశిక’లో ప్రచురణకు రచనలు పంపమని ప్రసిద్ధ రచయికలకు, కొత్త రచయితలకు ఆహ్వానం పలుకుతున్నాం.

ఈ పత్రిక మనందరిదీ. కలిసి పెంచుదాం. మీ రచనలు సులువుగా ‘ప్రకాశిక‘ వెబ్ సైటు లో సమర్పించవచ్చును.

https://www.prakasika.org/submit-your-article/

ప్రధాన సంపాదకులు

[email protected]

Stay Connected