1947లో భారత దేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు భారతదేశ జనాభా సుమారు 34-35 కోట్లుగా అంచనా. ఆకలి, నిరక్షరాస్యత, తక్కువ ఆయుః ప్రమాణం ఆనాటి దేశపు సంపద. ఆ కాలంలో సగటు భారతీయుడి ఆయుఃప్రమాణం ముప్పె రెండేళ్లు, అక్షరాస్యత రేటు పద్దెనిమిది శాతం. పదిమందిలో ఎనిమిది మంది పల్లెల్లో, వ్యవసాయం మీద ఆధారపడి బతికేవారు. కరువు కాటకాలు పిలవకపోయినా సందర్శించే బంధువులు.
1951 జనగణన ప్రకారం, పదిహేనేళ్లలోపు పిల్లలు జనాభాలో ముప్పె ఐదు శాతానికి పైగా ఉండేవారు; పదిహేను నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసున్న శ్రామిక వర్గం యాభై ఏడు శాతం; అరవై ఏళ్లు దాటిన వృద్ధులు కేవలం ఏడున్నర శాతం మాత్రమే ఉండేవారు. జనాభాలో సగం మంది ఇరవై ఒక్క ఏళ్లలోపు వారే. 2026 నాటికి భారత జనాభా నూట నలభై ఐదు కోట్లకు చేరువలో ఉంది. పదిహేనేళ్లలోపు పిల్లల సంఖ్య ముప్పె ఐదు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గగా, పదిహేను నుంచి యాభై తొమ్మిదేళ్ల శ్రామిక వర్గం యాభై ఏడు శాతం నుంచి అరవై ఐదు శాతానికి పెరిగింది, అరవై ఏళ్లు దాటిన వృద్ధుల వాటా ఏడున్నర శాతం నుంచి పదకొండు శాతానికి పెరిగింది. సగటు వయసు ఇరవై ఒక్క ఏళ్ల నుంచి ఇరవై తొమ్మిదేళ్లకు చేరింది. ఈ గణాంకాల వెనుక ఉత్తర-దక్షిణ అంతరం (north-south divide) ఉందన్న విషయం గమనించదగ్గది. దక్షిణాదిన జనాభా వృద్ధి రేటు తక్కువ ఉండడం వల్ల వృద్దుల వాటా ఇప్పుడే ఎక్కువగా ఉంది; శ్రామిక వయసు జనాభా ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ఉన్నా, ఇక ముందు వేగంగా తగ్గబోతోంది.
ఆనాటి భారత్ దేశ స్తూల జాతీయోత్పత్తి (GDP) రెండున్నర లక్షల కోట్ల రూపాయలు; తలసరి వార్షిక ఆదాయం రెండు వందల యాభై రూపాయలకు మించి ఉండేది కాదు. ఏంగస్ మాడిసన్ ఇచ్చిన అంచనాల ప్రకారం 1820లో ప్రపంచ GDPలో పదహారు శాతం వాటా కలిగి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, బ్రిటిష్ పాలన ముగిసేనాటికి కేవలం నాలుగు శాతానికి కుంచించుకుపోయింది. రెండు శతాబ్దాల వలస పాలన సృష్టించిన నష్టానికి ఇది ఒక కొలమానం. ఆర్థిక వ్యవస్థలో తొంభై ఐదు శాతం వ్యవసాయంపైనే ఆధారపడి ఉండేది, అయినా నీటిపారుదల, ఎరువులు, ఆధునిక సాంకేతికత లేమితో పంట దిగుబడులు అంతంతమాత్రమే ఉండేవి. విదేశీ మారక నిల్వలు కేవలం రెండు బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేవి. టెలిఫోన్ కనెక్షన్లు లక్షా ఇరవై వేలకు మించి లేవు. తలసరి విద్యుత్ వినియోగం సంవత్సరానికి కేవలం పదహారు యూనిట్లు ఉండేది, అంటే వందవాట్ల బల్బు పది గంటలు వెలిగించడానికి సరిపడా విద్యుత్తు మాత్రమే ఒక్కొక్కరికి ఏడాదికి దక్కేది!
1991కి ముందు “లైసెన్స్‌రాజ్” వ్యవస్థలో బందీగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, పి. వి. నరసింహారావు గారి విధానాల వల్ల వచ్చిన సరళీకరీణ తర్వాత ప్రపంచంలోనే వేగంగా ఎదిగే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. 2026 నాటికి భారత (30% నాలుగు లక్షల పదిహేను వేల కోట్ల డాలర్లకు చేరిందని అంచనా. కొనుగోలు శక్తి సమానత్వం (PPP) పద్దెనిమిది లక్షల తొంభై వేల కోట్ల డాలర్లు. ఒకప్పుడు తొంభై ఐదు శాతం ఉన్న వ్యవసాయం వాటా పదిహేడున్నర శాతానికి కుదించుకుపోయింది. విదేశీ మారక నిల్వలు రెండు బిలియన్ డాలర్ల నుంచి ఐదు వందల డెబ్బె బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. అయితే
ఈ వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందలేదు అనే విమర్శ కూడా అంతే బలంగా ఉంది. ఒకవైపు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తుంటే, మరోవైపు గ్రామీణ భారతంలో నిరుద్యోగం, వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.
1947 నాటికి దేశంలో స్వతంత్రమైన శాస్త్రీయ పరిశోధనా వ్యవస్థ అనేదే లేదు. సి.వి. రామన్ లాంటి కొద్దిమంది మేధావులు తప్ప, భారత్‌కు సొంత పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక సాంకేతికత దాదాపు శూన్యం. హోమీ భాభా, విక్రమ్ సారాభాయ్ లాంటి దార్మనికులు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే అణుశక్తి, అంతరిక్ష పరిశోధనా పునాదులు వేశారు. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇస్రో (ISRO) 2023లో చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది; ఆదిత్య-L1 సూర్యుడీనీ అధ్యయనం చేస్తోంది; 2025లో
స్పేడెక్స్ (SpaDeX) ద్వారా అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను జోడించే సాంకేతికత సాధించిన నాలుగో దేశంగా నిలిచింది; భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు; 2027కు గగన్‌యాన్ ద్వారా సొంతంగా మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రయత్నంలో ఉంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ ఇప్పుడు పదమూడు బిలియన్ డాలర్లకు చేరింది, రెండు వందలకు పైగా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి.
డిజిటల్ రంగంలో అయితే భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. యూపీఐ (UPI) ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్మించుకుంది; 5జీ సేవలు ప్రారంభమైన ఏడాదిలోపే డెబ్బె శాతం జనాభాకు చేరాయి. రక్షణ రంగంలో డీఆర్డీఓ (DRDO) ద్వారా క్షిపణులు, రాడార్లు, డ్రోన్ల వంటి స్వదేశీ సాంకేతికతలు అభివృద్ధి చేసుకుంటూ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటోంది. అయితే ఈ శాస్త్ర సాంకేతిక పురోగతిలో కూడా అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. గ్రామీణ పాఠశాలల్లో ఇంటర్నెట్ మౌలిక వసతులు ఇంకా అంతంతమాత్రమే; STEM పట్టభద్రుల్లో నలభై మూడు శాతం మంది స్త్రీలు ఉన్నా, వృత్తి నిపుణుల్లో వారి వాటా ఇరవై నుంచి ముప్పె శాతానికే పరిమితం. మొత్తంగా చూస్తే, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తన సొంత సూది ఒకటి తయారు చేసుకోలేని దేశం, ఇప్పుడు అంతరిక్షంలో ఉపగ్రహాలను జోడించగలిగే స్థాయికి చేరడం అనేది ఈ ఎనభై ఏళ్ల ప్రయాణంలో నిస్సందేహంగా అత్యంత గర్వించదగ్గ అధ్యాయం.
కానీ ఈ ఎదుగుదల ఫలితాలు అందరికీ సమానంగా అందడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యం, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణ నుండి ప్రైవేట్ సంస్థల నిర్వహణ లోకి మారుతోంది. దీని పర్యవసానాలు ఆలోచించవలసిన విషయం.
ప్రజల ఆశలు, ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయి. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన సామాన్య భారతీయుడి కోరికలు చాలా మామూలుగా ఉండేవి. కడుపునిండా అన్నం, ఒంటిపై బట్ట, తలదాచుకోడానికి ఇల్లు- ఇవే కోరికలు. ప్రభుత్వం అంటే తమకు తిండి పెట్టేది, భూమి పంచేది, పాఠశాల కట్టేది, ఆసుపత్రి తెరిచేది అనే భావన ప్రజలలో ఉండేది.
1997 నుంచి 2012 మధ్య పుట్టిన “జెన్ జీ” (Gen Z) తరం పూర్తిగా భిన్నమైన ఆకాంక్షలతో నిలబడీ ఉంది. దేశంలో పని చేయగల వయసున్న జెన్ జీ జనాభా దాదాపు ముప్పె కోట్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జెన్‌జీ సమూహాల్లో ఒకటి. వీరి ఆకాంక్షలు కడుపు నింపుకోవడం దగ్గర ఆగవు. వీరికి “అర్ధవంతమైన పని” (meaningful work) కావాలి. ఈ తరం వాళ్ళు జీతం కంటే ఉద్యోగంలో సంతృప్తి, వ్యక్తిగత ఎదుగుదల ముఖ్యం అనుకుంటున్నారు. లింక్డ్ఇన్ వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 2025 (ఇండియా) సర్వే ప్రకారం తొలి ఉద్యోగంలో ఏటా ఆరు నుంచి పది లక్షల జీతం ఆశిస్తున్నా, అర్ధవంతమైన పని కోసం అంతకంటే తక్కువ జీతానికైనా ఒప్పుకుంటామని డబ్భై ఒక్క శాతం మంది చెప్తున్నారు. కేవలం పదహారు శాతం మందికే ఒక సంప్రదాయ పూర్తికాల ఉద్యోగం మీద ఆసక్తి ఉంది. అరవై ఏడు శాతం మంది తాము పనిచేసే సంస్థ తమ మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని ఆశిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, ప్రపంచవ్యాప్త సమాచార ప్రవాహం మధ్య జెన్ జీ పుట్టి పెరిగింది. వీరి కళ్ళలో “మంచి జీవితం” అంటే ఆర్థిక భద్రత, జీవితకాలపు ఉద్యోగం మాత్రమే కాదు, గౌరవం, స్వేచ్చ, పని-జీవితం మధ్య సమతుల్యత కూడా ముఖ్యం. నవతరాన్ని ఉపేక్షిస్తే ఉద్యమించే ప్రమాదం ఉందన్నది సర్వవిదితం.
ఎనభై ఏళ్ల క్రితం నాటి ప్రజల అంచనాలు, ఈనాటి ప్రజల అంచనాలు ఒకే స్థాయిలో లేవు. అన్నం పెట్టే ప్రభుత్వం చాలదు. ఇప్పుడు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు, డిజిటల్ మౌలిక వసతులు, పారదర్శకత, జవాబుదారీతనం కోరుకునే పౌరసమాజం ఏర్పడింది. పూర్తిస్థాయి ప్రైవేటీకరణ వల్ల భారత్ వంటి దేశాలలో జరిగే అనర్థాలు ఈ నాటి యువతకి శాపంగా మారాయి. యూకేజీలో లక్షతో మొదలయిన బడి ఫీజులు పీజీకి వచ్చేసరికి లక్షల్లోకి చేరడంతో ఉత్తమ విద్యతో ఉన్నత జీవన ప్రమాణం వస్తుందని నమ్మే మధ్యతరగతి కుటుంబాలు తలకు మించిన అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్నారు. ప్రతిభావంతులకు కూడా అనువైన ఉద్యోగాలు దొరక్కపోవడంతో యువతలో నిరాశ నెలకొని ఉంది. ప్రజలకి వృద్దాప్యంలో ఆరోగ్య, ఆహార భద్రత కల్పించడం పాలకుల కర్తవ్యం. దేశానికి మారుతున్న తరం ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా వ్యవస్థలని మెరుగుపరచడం భారతదేశ ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.
భవదీయుడు
డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ
ప్రధాన సంపాదకులు, ప్రకాశిక