పరదేశనరపాలపరిపాలనావథి భారత స్వాతంత్ర్య పర్వదినము
బహు భారతీయ తపస్పిద్ధిశుభతిథి భారత స్వాతంత్ర్య పర్వదినము
సకలప్రపంచవిజ్ఞ ప్రమోదకరంబు భారత స్వాతంత్ర్య పర్వదినము
ప్రాగ్దేశ దైన్యజీవనజనాశాజ్యోతి భారత స్వాతంత్ర్య పర్వదినము
భారతీయుల నోముల ఫలము పరమ-భవ్యదివస మాబాలగోపాలమునకు
నవ్యజవజీవసంపదున్నతికరంబుఁ బరమభారత స్వాతంత్ర్య పర్వదినము.
తమ సమస్తము భారతస్వతంత్రతకునై ధారపోసిన మహాధార్మికులును
భారతస్వాతంత్ర్య ఫలసిద్ధికై పోరి జీవముల్ విడిచిన పావనులును
తమ యమోఘపు జీవితములు కారాగృహంబులకె యర్పించిన పూతతనులు
ఆశయసిద్ధికత్యాచారములొనర్చి థీరులై మడిసిన వీరనరులు
పరమ సంభావనీయులెప్పటికీ మనకుఁ – బ్రథమపరిగణనీయులెప్పటికి మనకుఁ
బ్రబల గౌరవనీయులెప్పటికి మనకు – భవ్య భారత స్వాతంత్ర్యపర్వములను.
సత్యంబహింసయు శస్తాస్త్రసమితి, సత్యాగ్రహంబే ప్రబలాయుధంబు
కదురుగవ్వంబులే ఖడ్గముద్గరములు, ఖద్దరు బట్టలే కవచములును
నూలుతీయుటె శత్రుజాలంబునసువులు తీయుటల్ త్రెంచుటె త్రెంచుటలును
అమలమానవుల నిరాహారదీక్షలే శత్రుమారణయంత్ర సముదయములు
విమల భారతస్వాతంత్ర్యసమరమందు-భారతీయుల యాయుధపరికరములు
మఱవ రానివి ముల్లోకీ మానవులకు – భవ్య భారత స్వాతంత్ర్య పర్వములను,
ఉపనిషన్మతము గీతోపదిష్టమతంబుఁ దనరఁగా భారతాదర్శములుగ
అమృతభాష యనంగ నలరు సంస్కృతభాష భారతజాతీయభాష గాంగ
దుస్సహదుర్దర్త దుర్మార్గ మగు శత్రుసమితి తనంతఁ దా సమసిపోవ
శ్రీమంత మగు పూర్వ రామరాజ్యంబుగా మనవారు మనలఁ బాలనముసేయ
అఖిలదుఃఖాదికంబులు సంతరింప-భరతలక్ష్మియు నూతనప్రభ గడించి
వఱలుఁగావుత విఖ్యాతవైభవమున – సర్వతంత్ర స్వతంత్రయై యుర్వియందు.
మంచికో చెడ్డకో మన రాజ్యమును మనకిచ్చిపోయిన యాంగ్లనృపులఁ దలఁచి
కష్టమో సుఖమొ విఖండిత దేశపాలనకొప్పుకొన్నవారిని గణించి
మతమౌఢ్యమో లేక మతరక్షణభ్రమమో పెఱ్ఱులైన ద్రోహుల నడించి
కయ్యమో నెయ్యమో గమనింపఁజాలని మూర్చులకును దగు బుద్ధి చెప్పి
మరల స్వాతంత్ర్రదివసంబు మగిడి వచ్చు-లోపలనె రామరాజ్య సంస్థాపనమ్ము
నాయకాగ్రణులొనరింప, నడచుఁగాక – ధర్మ దేవత నలుగాల ధరణియండు.
భారతి పత్రిక నంపుటము 25 ఆగస్టు, 1948 సంచిక 8 నుండి తీసుకోబడినది.