అంతర్జాతీయ గీతం

- మహాకవి గురజాడ అప్పారావు

గాయత్రి విద్యాపీఠం, విశాఖపట్టణం, విద్యార్ధులు పాడిన గురజాడ దేశభక్తి గేయం

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టి మేల్‌ తలపెట్టవోయి !

పాడిపంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయి
తిండి కలిగితె కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌ !

ఈసురోమని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయ్‌
జల్లుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్‌ !

అన్ని దేశాల్‌ క్రమ్మవలె నోయ్‌
దేశి సరుకుల నమ్మవలె నోయ్‌
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్‌!

వెనుక చూసిన కార్యమేమోయ్‌
మంచిగతమున కొంచమేనోయ్‌
మందగించక ముందు అడుగేయ్‌
వెనుక పడితే వెనుకేనోయ్‌!

పూను స్పర్జను విద్యలందే
వైరములు వాణిజ్య మందే
వ్యర్థ కలహం పెంచబోకోయ్‌
కత్తి వైరం కాల్చవపోయ్‌!

దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని యేదైనాను, వొక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌!

ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చేసె నోయ్‌
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్‌!

పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్‌
ఒకరి మేల్‌ తన మేలనెంచే
నేర్పరికి మేల్‌ కొల్ల లోయ్‌!

సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు ఏడవోయ్‌
దేశమంటే మట్టికాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌ !

చెట్ట పట్టాల్‌ పట్టుకుని
దేశస్థు లంతా నడవవలె నోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయ్‌!

మతం వేరైతేను యేమోయి
మనసు వొకటై మనుషులుంటే
జాతమన్నది లేచి పెరిగీ
లోకమున రాణించు నోయ్‌!

దేశ మనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలె నోయ్‌
నరుల చెమటను తడిసి మూలం
థనం పంటలు పండవలె నోయ్‌।

ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలకవలె నోయ్‌
పలుకులను విని దేశమీందధభి
మానములు మొలకెత్త వలెనోయ్‌!

Kiran
Author: Kiran