16.3 C
New York
Wednesday, May 15, 2024

కలయిక

కలయిక

-శాస్త్ర ప్రకాశిక

ఒకటి ఒకటి కలిపితే ఎంత? ప్రశ్న మరోసారి అడుగుతాను.ఒకటికి ఒకటి కలిపితే ఎంత ? దీనికి సమాధానం చిన్నపిల్లలైనా చెప్తారు కదూ ! అయితే ఈ సమాధానం లెక్కల్లో అయితే రెండు –
జీవశాస్త్రంలో అయితే సమాధానం ఒకటి మాత్రమే. తేడా
మీకు అర్థమైందనుకుంటాను. ఐనా మరొక్కసారి వివరంగా
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక శుక్ర కణం, ఒక అండం కలిసి ఒక సంయుక్త బీజం (ZYGOTE). దాన్నుంచి ఒక పిండం తొమ్మిది నెలల తర్వాత సుమారు ఒక లక్ష బిలియన్ల కణాలతో పూర్తిగా అభివృద్ధిచెందిన శిశువు. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్
కథలా ఉంది కదూ ! కదిలే శుక్రకణాలు, కదలని అండాలు, ఒకే రకమైన విభజనలు. ఒక మగ, ఒక ఆడ. ఇద్దరిలోనూ వేర్వేరు హార్మోన్లు, హార్మోన్లతో మారిపోయే ప్రవర్తన – ఇవన్నీ శాస్త్రవేత్తలలోనూ, సామాన్యులలోనూ సమానంగా ఆసక్తి రేకెత్తించే అంశాలు. సృష్టిలో మొదటగా స్త్రీ, పురుషులనే భేదం ఎప్పుడు ఏర్పడిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లింగత్వం అనేది జీవ పరిణామ సిద్ధాంతాలకు సంబంధించి అత్యంత క్లిష్టమైన సమస్య. మరే ఇతర ప్రకృతి సిద్ధమైన దృగ్విషయము ఇంతటి ఆసక్తిని రేకెత్తించలేదు. డార్విన్, మెండల్ ఇతర విషయాలన్నింటినీ విశదీకరించినప్పటికీ, అన్నింటికీ కేంద్రబిందువైన లింగత్వ ఆవిర్భావం గురించి అరకొరగా తప్ప వివరించలేకపోయారు. లైంగిక ప్రత్యుత్పత్తి జీవ పరిణామ దృష్ట్యా అసంగతమైనది.
కానీ కల్పన (నమూనా) దృష్ట్యా నమ్మశక్యం కానటువంటిది. ప్రకృతిలో పునరుత్పత్తి జరిగే పద్ధతి అంటే మనకు తెలిసింది – స్త్రీ, పురుష బీజ కణాల వలన కొత్తరం ఆవిర్భావం. అయితే నిమ్న స్థాయి జీవుల్లో ఆడ, మగ అనే భేదం లేకుండానే కొత్త జీవులు ఆవిర్భవిస్తాయి. ఈ రకమైన ప్రత్యుత్పత్తిని అలైంగికోత్పత్తి అంటారు.బాక్టీరియాలలో సమృద్ధిగా ఆహారం లభించగానే శరీరం పూర్తి స్థాయికి ఎదుగుతుంది. పూర్తిగా ఎదిగిన జీవిలో ఉండే DNA అనే పదార్థం విడిపోయి,

బాక్టీరియా రెండుగా విడిపోతుంది. ఈ పద్ధతిని ద్విధా విచ్ఛిత్తి అంటారు. ఇలా ఒక
బాక్టీరియా నుండి అతి కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా పిల్లజీవులు ఏర్పడతాయి.
ఈ పిల్ల జీవులన్నీ జన్యుపరంగా ఒకే విధంగా ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ‘క్లోన్’
(CLONE) అంటారు. ఇలాంటివే మరికొన్ని అలైంగిక పద్ధతుల ద్వారా అత్యంత
ప్రాథమిక జీవులు ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి అత్యంత సరళ
మైనది. జీవులు తమ సంఖ్యను వేగంగా అభివృద్ధి పరుచుకోవటానికి ఉపయుక్తమైనది.
ఇప్పుడు లైంగిక పద్ధతిలో సంతానాభివృద్ధిని పరిశీలిద్దాం. అత్యంత ప్రాథమిక
జీవులైన ‘ప్రోటోజోవా’లలో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి కన్పిస్తుంది. కొన్ని ప్రోటోజోవా
జీవులు అనుకూల పరిస్థితుల్లో అలైంగిక పద్ధతిలోనూ, ప్రతికూల పరిస్థితుల్లోలైంగిక
పద్ధతిలోనూ సంతానాభివృద్ధి చేస్తాయి. చాలా ప్రాథమిక స్థాయి జీవులలో స్త్రీ పురుష
భేదం లేదు. రెండు వేర్వేరు ‘క్లోన్’ లకు చెందిన జీవులు దగ్గరకు వస్తాయి. వాటి మధ్య
జన్యు పదార్థ మార్పిడి జరుగుతుంది. తర్వాత విడిపోయి విభజనలు చెందుతాయి.
ఒకవేళ జన్యు పదార్థ మార్పిడికి వేరే జీవి లభ్యం కాకపోతే, తమ పద్ధతిలో అలైంగిక
ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అనేకసార్లు అలైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరపటం వలన
జన్యుపదార్థం బలహీనపడుతుందని శాస్త్రజ్ఞుల భావన. వేరొక జీవి జన్యుపదార్థంతో
కలయిక వలన జీవి పునరుత్తేజితం అవుతుంది. రెండు వేర్వేరు జీవుల జన్యు పదార్థాలు
కలిసిపోవటాన్ని పున:సంయోజనం (Recombination) అంటారు. బాక్టీరియాలలో
కూడా ఈ పున:సంయోజనం కన్పిస్తుంది. రెండు బాక్టీరియాల మధ్య సెక్స్ పైలస్ (Sex
Pilus) అనే సేతువు నిర్మాణం జరిగి, దాని ద్వారా DNA పదార్థం, ఒక దాని నుండి
మరొక బాక్టీరియాకు బదిలీ అవుతుంది. పున:సంయోజన ప్రక్రియ DNA పదార్థం
మరమ్మత్తు చేయటానికి ఉద్దేశించబడినదని కొందరి అభిప్రాయం. పునఃసంయోజన

ప్రక్రియ సుమారు 3 బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడి ఉండవచ్చు.
పునఃసంయోజన ప్రక్రియ నుండి లైంగిక ప్రత్యుత్పత్తి ఆవిర్భవించిందని కొందరు
శాస్త్రవేత్తల వాదన. లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాథమిక కేంద్రక జీవుల్లో 1 నుండి 2 బిలియన్
సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడి ఉండవచ్చు. దీనికి స్పష్టమైన కారణాలు
తెలియకపోయినప్పటికీ, బహుశః పరాన్న జీవులు లైంగిక ప్రత్యుత్పత్తిని
ప్రోత్సహించాయనే వాదన కూడా ఉంది.
పరాన్నజీవి అతిధేయి శరీరంలోకి ప్రవేశించాలంటే అతిధేయి కణం నిర్మాణం
తెలిసి ఉండాలి. కణం పై ఉండే ప్రొటీన్లు పరాన్నజీవిని లోపలికి రాకుండా
అడ్డుకుంటాయి. ఒక్కసారి లోపలికి ప్రవేశించే మార్గం తెలసిపోతే అన్ని పరాన్నజీవులు
అదే పద్ధతిని అనుసరిస్తాయి. అంటే, అన్ని ఇళ్ళకూ ఒకే రకం తాళం కప్ప ఉంటే
తెఱవటానికి ఒకే తాళం చెవి సరిపోతుంది కదా ! అలాగన్న మాట.
అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే జీవులన్నీ, అంటే ఒక క్లోన్ లోని జీవులన్నీ ఒకే
తాళం చెవితో తెరుచుకునే ఇళ్ళ వంటివి. దీనివలన పరాన్నజీవుల బారినపడే
అవకాశాలు ఎక్కువ. పునఃసంయోగం వలన కానీ, లైంగిక ప్రత్యుత్పత్తి వలన కానీ
ఏర్పడిన జీవులు ప్రతిసారీ కొత్త తాళం కప్పను కలిగిన ఇంటివంటివి. వీటిలోకి
ప్రవేశించాలంటే పరాన్నజీవులు ప్రతిసారీ కొత్త తాళం చెవి తయారు చేసుకోవాలం
టారు శాస్త్రజ్ఞులు.
మొదట్లోస్త్రీ, పురుష సంయోగ బీజాలు అంటూ వేర్వేరుగా ఉండేవి కావు. కేవలం
రెండు కేంద్రకాలుండేవి. పేరామసియం వంటి ప్రొటోజోవా జీవులు ఒక కదిలే
కేంద్రకాన్ని, ఒక కదలని కేంద్రకాన్ని తయారు చేస్తాయి. కదిలే కేంద్రకాన్ని పురుష

కేంద్రకమనీ, కదలని కేంద్రకాన్ని స్త్రీ కేంద్రకమని పిలుస్తారు. ఒక పేరామసియంలోని
పురుష కేంద్రకం, మరొక పేరామసియంలోని స్త్రీ కేంద్రకాన్ని చేరి దానితో
కలిసిపోతుంది. దీన్ని సంయుగ్మం అంటారు. దీన్ని లైంగిక ప్రత్యుత్పత్తిగా గుర్తించారు.
మలేరియా పరాన్న జీవి ప్లాస్మోడియంలో రెండు వేర్వేరు స్త్రీ, పురుష సంయోగ
బీజాలేర్పడ్డాయి. దాదాపు ఒకే పరిమాణంలో ఉండే కణం నుండి ఎనిమిది వరకూ
పురుష సంయోగబీజాలు ఏర్పడితే, స్త్రీ సంయోగ బీజం మాత్రం ఒకటే ఏర్పడుతుంది. స్త్రీ
బీజ కణం పరిమాణం అంతకంతకూ పెద్దదై పోతూ ఉంటే, జీవ పరిణామ ప్రక్రియలో
భాగంగా పురుష బీజకణానికి చలనానికి అవసరమైన అన్ని హంగులూ ఏర్పడ్డాయి.
పొడవైన తోక, ఈదటానికి అవసరమైన శక్తినందించే యంత్రాంగం, స్త్రీ బీజ కణాన్ని
గుర్తించటానికి, అండంలోకి ప్రవేశించటానికి అవసరమైన రసాయన పదార్థాలు…
ఇలా అనేకం.
లైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరపటానికి కొన్ని చిక్కులున్నాయి. ఒక అండం, ఒక
శుక్ర కణం కలిసి సంయుక్తబీజం ఏర్పడుతుందని మనకు తెలుసు. అయితే క్రొత్తగా
ఏర్పడే జీవి తల్లిదండ్రులకు రెట్టింపు పరిమాణంలో ఉండాలి కదా ! కానీ అలా జరగటం
లేదని మనకు తెలుసు. దీన్ని అర్థం చేసుకోవటానికి కణ విభజన పద్ధతుల గురించి
కొంచెం అర్థం చేసుకుందాం.
శరీరంలోని దైహిక కణాలలో, కణ విభజనకు ముందు కేంద్రకంలోని DNA
రెట్టింపయి, రెండు కణాల మధ్య సమంగా పంచబడుతుంది. అదే బీజ కణాలలో
అయితే DNA పదార్థం సగానికి తగ్గించబడుతుంది. దీన్ని క్షయకరణ విభజన
అంటారు. దీనవలన లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే జీవుల్లో ఎప్పటికీ DNA
పదార్థం తల్లిదండ్రులలో ఉన్నంతే ఉంటుంది.
ప్రస్తు ం స్త్రీ, పురుష బీజకణాలు ఏర్పడటం పూర్తి సమాచారం మన దగ్గర
ఉన్నప్పటికీ, ఖచ్చితంగా స్త్రీ, పురుష జీవులు వేర్వేరుగా ఏర్పడ్డాయో చెప్పటం కష్టం.
అలాగే స్త్రీ జీవి శరీరంలో పిండం అభివృద్ధిచెందటానికి అవసరమైన యంత్రాంగాన్ని
ఎలా ఏర్పరచుకున్నాయో వివరించటమూ కష్టమే. వానపాములు, జలగలు వంటి
జంతువులు, జీవులు, ఎక్కువ శాతం మొక్కలు ఉభయ లైంగికాలు.
అలైంగికోత్పత్తి ఒకే సంఖ్య ఉన్న అనేక లాటరీ టిక్కెట్లు కొనటం వంటిదని,
లైంగికోత్పత్తి వేర్వేరు సంఖ్యలున్న కొన్ని లాటరీ టిక్కెట్లు కొనటం వంటిదని అంటారు
డాక్టర్ విలియమ్స్. లైంగికోత్పత్తి వలన వచ్చే వైవిధ్యాలు, వాతావరణంలో వచ్చే
మార్పులను తట్టుకుని నిలబడతాయని వీరి భావన.
మనుగడ కోసం జీవులు జరిపే పోరాటంలో, జీవులు నిరంతరం క్రొత్త సమస్యలకు
సమాధానం వెతకాలి. అది పరాన్నజీవులు, వాతావరణం, ఆహారం ఏదైనా కావచ్చు.
ఈ పోరాటంలో యోగ్యమైన లక్షణాలున్న జీవులే మనుగడ సాగిస్తాయంటారు ‘లీవాన్

వేలెన్’ (Leighvan Valen) తన ‘రెడ్ క్వీన్ హైపోథిసిస్’ లో.
తల్లిదండ్రులు వయసులో బాగా పెద్దవాళ్ళైనా వాళ్ళ పిల్లలు ఎప్పుడూ పూర్తికాలం
ఎలా జీవించ గలుగుతున్నారు? చాలా చెత్త ప్రశ్న ఇది. బెర్న్ స్టీన్, మైకోడ్, హఫీ అనే
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం దైహికమైన కణాలు నిరంతర విభజన వలన వృద్ధాప్య
దశకు చేరుకుంటాయి. బీజకణాలు క్షయకరణ విభజన చెందుతూ, నిరంతరం
పునఃసంయోజనం చెందటం వలన DNA మరమ్మతుకు అవకాశం ఏర్పడి,
వృద్దాప్యదశకు చేరటం లేదంటారు.
లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఒకే పుస్తకం రెండు కాపీలు కొని, పేజీలన్నింటినీ
విడదీసి, క్రొత్త పుస్తకం తయారు చేయటానికి ఏ పేజీ ఎంచుకోవాలో లాటరీ వేయటం
వంటిదంటారు రిడ్జి, మార్క్ అనే జీవపరిణామ శాస్త్రవేత్తలు. లాటరీలో ఎన్నిక కాని పేజీ
వృధా అవుతుంది.
ఇప్పుడున్న పద్ధతిలో లైంగిక ప్రత్యుత్పత్తి అవసరమైన హంగామా అంతా
లేకుండానే జరుగుతుంది. మరి ఇదంతా ఎందుకు ? యౌవనం తెగింపునిస్తుంది.
దీనివలన జీవి మనుగడకే ప్రమాదం రావచ్చు. కేవలం సంతానోత్పత్తి కోసం ఇంత
ఖరీదైన వ్యవహారం అవసరమా? ఏమో, మానవ మేధస్సు దీనిపై మథిస్తూనే ఉంటుంది.
క్రొత్త ఆధారానికై వెతుకుతూనే ఉంటుంది.
విశ్వం నిర్మాణం విషయంలో భగవంతుడు పాచికలాట ఆడటం లేదంటారు –
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్ స్టీన్.
అంతా చదివారు కదా ! ఇంతకీ స్త్రీ జీవి ముందు పుట్టిందా ? మగజీవి ముందు
పుట్టిందా ? ఆలోచించండి !

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles