డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు
భారత దేశం 78 వ స్వాతంత్య్ర దినం జరుపుకుంటున్న సందర్భంగా దేశ విదేశాలలో నివసించే ప్రజలకి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. గత 77 సంవత్సరాలలో దేశం గణనీయమైన ప్రగతి సాధించడం భారతీయులందరికీ గర్వకారణం.
సాధించిన విజయాలను, ఇంకా చేయవలసిన కార్యక్రమాలను బేరీజు వేసుకుంటూ ప్రగతిపథంలో సాగడం వ్యక్తులకైనా, దేశానికైనా అభిలషణీయం. భుజాలు తట్టుకుంటూ, ఛాతీ విరుచుకుని మనమే
గొప్పవారమని విర్రవీగడం వ్యక్తులకు ఎంత హానికరమో, దేశాలకీ అంతే హానికరం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన దేశాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో కళ్ళముందు చూస్తున్నాం. ప్రగతి గమ్యం కాదు, నిరంతర ప్రయాణం. శ్రీశ్రీ అన్నట్టు స్వాతంత్యం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదు; సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటు.
ప్రపంచ మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్న వార్త ఎంత ఆనందకారకమో, ధనవంతుల, పేదల మధ్య అంతరం ఏటా పెరుగుతుందన్న వాస్తవం అంతే బాధాకరం. దేశ స్థూల ఆదాయం కంటే
తలసారి ఆదాయం సూచికలు దేశ ఆర్థిక ప్రగతికి సంకేతాలు. తాజా అంచనాల ప్రకారం 65 శాతం సంపద 10 శాతం మంది అత్యంత ధనికుల చేతిలో ఉండగా, కేవలం 64 శాతం సంపద మాత్రమే కింది 50 శాతం సామాన్య ప్రజల దగ్గర ఉంది. అదీకాక, 1 శాతం అత్యంత ధనవంతులు 40 శాతం సంపదని అనుభవిస్తున్నారు. ఆర్థిక అసమానతలు సమాజ ఆరోగ్యానికి, ప్రజాస్వామ్య మనుగడకి మంచిది కాదు.
ఈ పరిస్తితికి ఎవరిని నిందిద్దాం ? ఎప్పుడో వెళ్ళిపోయిన పూర్వ పాలకులను, గత ప్రభుత్వాలని నిందిస్తే పరిస్థితి చక్కబడదు, ప్రజలు ఆమోదించరు. ప్రజారంజక విధానాలు తీసుకొచ్చి అమలు చేయడం పాలక ప్రభుత్వాల బాధ్యత. పూర్తి స్థాయి పెట్టుబడిదారీ విధానం భారతదేశానికి అనువైన వ్యవస్థ కాదు. అమిత ఆర్థిక బలం ఉన్న వ్యక్తులు ప్రభుత్వాలను శాసించే స్థితికి చేరే ప్రమాదం భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పొంచి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఎందరో వీరులు, కవులు, సామాజిక తత్త్వవేత్తలు, సామాన్య ప్రజలు పోరాడి సాధించిన స్వతంత్ర భారత దేశం మళ్ళీ దాస్య శృంఖలాలలోకి పోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఆధునిక ప్రపంచంలో ఆర్థిక శృంఖలాలు యుద్ధం కంటే ప్రమాదకరమైనవి. విదేశీ వస్తువులు, ఉద్యోగాల మీద ఆధారపడి నడిచే ఆర్థిక వ్యవస్థ దేశ ఆరోగ్యకర మనుగడకి మంచిది కాదు. పాలకులు ఏ పార్టీకి చెందినవారైనా పాలక, ప్రతిపక్ష పార్టీలు దేశ భద్రత, విదేశాంగ విధానం లాంటి విషయాలలో అహాన్ని పక్కనపెట్టి వ్యవహరించవలసిన అవసరం ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువ ఉంది.
నకారాత్మకంగా అనిపించినా ఆవేశంతో, ధర్మాగ్రహంతో రాసిన గేయాలు, పాటలు నిద్రాణంలో ఉన్న జాతిని మేలుకొల్పే ఉత్తేజకాలు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటలోని కొన్ని వాక్యాలని
పునఃపరిచయం చేయడం కంటే వేరే సందేశం ఏముంటుంది!!
కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే
సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం, ఈ సంధ్యా సిందూరం
వేకువ వైపా, చీకటి లోకా ఎటు నడిపేవమ్మా! గతి తోచని భారతమా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
యుద్ధ నినాదపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దాన్ని సవాలు చేద్దామా!
తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నే స్వరాజ్యమందామా!
"When I despair, I remember that all through history the way of truth and love has always won. There have been tyrants and murderers and for a time they seem invincible, but in the end, they always fall… think of it, always."
మహాత్మా గాంధీ



గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి