20.9 C
New York
Tuesday, May 14, 2024

తిలక్ కథలు – శిల్పసౌందర్యం

తిలక్ కథలు – శిల్పసౌందర్యం

పరిశోధనా పత్రంమొదటి భాగం

“కథను ఊహించడం ఒక ఎత్తు, దాన్ని చెప్పడం మరో ఎత్తు. కథ చెప్పే విధానమే
కథకి అందాన్ని, బలాన్ని ఇస్తుంది. దీనినే శైలి, శిల్పం అంటారు. ఉత్తమ కథలతో గల
పరిచయం వల్ల తన కథలలో ప్రతిభావంతుడైన రచయిత శిల్పాన్నీ శైలినీ విస్పష్టంగా
రూపొందించుకోగలడు.
“కథలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికో బలపరచడానికో చేసే ప్రయత్నం
కథాశిల్పంలో ఒక ముఖ్యమైన దోషం”ఇవి కథాశిల్పం గురించి తిలక్ చేసిన స్పష్టమైన ఆలోచనలు. “కథలు రాయడంఎలా” అనే వ్యాసంలో ఆయన చెప్పిన కథానిర్మాణ విషయాలు చాలా వున్నాయి. తిలక్క థాశిల్పం విషయంలో లోతైన అవగాహన లేకుంటే, ఆయన కథలు అలాంటి సజీవ
చిత్రాలుగా పాఠకుల్ని ఆకట్టుకునేవి కావు. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్టు ఉత్తమ
కథల్ని చదవడం వల్ల అలాంటి శిల్ప నైపుణ్యం అలవడింది.
“అతని మీద ఎవరి ప్రభావమూ, ఎవరి వస్తు శిల్ప శైలీ ప్రభావమూ లేవని చెప్పలేం.
అందర్నీ ఊగించిన చలం, సోమర్సెట్ మామ్, మొపాసా ఎవర్ని వదలి పెట్టారు గనుక.
అయినా ప్రత్యక్ష, బలోపేతమైన స్వకీయ ముద్ర. స్వతంత్రమైన అన్వేషణ, లోతూ,
మెరుపూ అతను తిలక్ ” అంటూ తిలక్ కథాశిల్పం పై ఎవరెవరి ప్రభావాలున్నాయో
స్పష్టపరిచాడు మునిపల్లె రాజు. అదేవిధంగా కోడూరి శ్రీరామమూర్తి తిలక్ కథల
తత్వాన్ని వివరిస్తూ ప్రేమ్ చంద్ ‘కఫన్’ సోమర్ సెట్ మామ్ ‘Caker and Ale’ వంటి
కథల్లోని శిల్పం తిలక్ కథల్లో కన్పిస్తుందని చెప్పడంలో తిలక్ కథానిర్మాణంలో ఎవరి
ప్రభావం వుందో తెలుస్తుంది. అంతేకాదు ఇంకా లోతుగా తిలక్ కథల్ని పరిశీలించి
“శిల్పంలో మొపాసాకు దగ్గరగా కనపడతాడు తిలక్’’ అని చెప్పాడు కోడూరి శ్రీరామ
మూర్తి. “ఆయన కథానికా ప్రక్రియ నియమాలను, పరిమితులను, లక్ష్యాలను అర్థం
చేసుకోనే కథలు రాశాడు” అని అంపశయ్య నవీన్ చెప్పడంలో తిలక్ కథలు కథానికా
శిల్ప లక్ష్యాలను కొనసాగించాడని అర్థమౌతుంది. మేరుపర్వతంలాంటి తిలక్ సాహిత్య
శిల్పాన్ని అంచనా వేయడం అంటే సముద్రపు తరంగాల్ని గుప్పెట్లో చూపాలని

ప్రయత్నించడమే. నేను అర్థం చేసుకున్నంత మటుకు యువ పరిశోధకుల కోసం తిలక్క థల్లోని కొన్ని శిల్పసౌందర్య విషయాల్ని
చెప్పడం ఈ వ్యాసోద్దేశం. శిల్పసౌందర్య విశిష్టతను గురించి వల్లంపాటి వారు “కథాసంవిధానం, పాత్రలు, నేపథ్యం, దృష్టికోణం, కంఠస్వరం’ అనేవి కథాంగాలుగా వుంటాయని, తన కథానిక శిల్పం’లో చెప్పుకొచ్చారు. పోరంకి దక్షిణామూర్తి కథాశిల్పాన్ని “వస్తు విన్యాసం, పాత్రచిత్రణ, సంఘటన, సంఘర్షణ, సన్నివేశకల్పన, కథనం, శీర్షిక”’ అనే విభాగాలుగా వర్గీకరించాడు. రచయిత కథలో చెప్పేదాన్ని వస్తువని, ఎందుకోసం చెప్తున్నాడో అది ఉద్దేశమని, ఒక విధమైన పద్ధతిలో చెప్తాడు దాన్నే శిల్పమని అంటాడు ఖదీర్ బాబు’ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించినపుడు గొప్ప కథకుడైన
తిలక్ తన కథలను ఒక పద్ధతిలో చెప్పాడు. ఒక ప్రత్యేకమైన శిల్ప నిర్మాణాన్ని
ప్రదర్శించాడు. కథలకు పేర్లు పెట్టడంలో, కథల్ని ప్రారంభించడంలో, పాత్రల్ని
నిర్మించడంలో, సంభాషణలు చేయించడంలో, కథనం చేయడంలో, వాక్యాల్ని
నిర్మించడంలో, వర్ణనలు చేయడంలో, సాహిత్యపు సొబగులు అద్దడంలో, సంఘర్షణ,
సంభావ్యత, స్థలకాలాదుల వంటి అంశాల నిర్వహణలో, తనదైన కంఠస్వరాన్ని
విన్పించడంలో చివరికి కథా ముగింపులో తిలక్ కథాశిల్పం స్పష్టంగా కనిపిస్తుంది. కథ
చదవడం ప్రారంభమైన కొద్ది సేపటికే అది తిలక్ కథ అని అర్థమైపోతుంది. అదే తిలక్
కథానిర్మాణపు ప్రత్యేకత.
శీర్షికలు:
“మంచి శీర్షిక దొరికితే; దాని ఆధారంగా కథలు రాసే వారు వున్నారు. మంచి
శీర్షిక దొరకనిదే కథారచన ఆరంభించని వారూ వున్నారు. కథ రాసినా, సరైన శీర్షిక
దొరక్క నెలల తరబడి యోచించవలసిన అవసరం ఉంటుంది.” అంటాడు శార్వరి. ఈ
మాటలు వెనుక అనేక మంది కథకుల అనుభవం ఉంది. కథకు పెట్టే పేరులోనే
శిల్పానికి అంకురార్పణ జరుగుతుంది. కథకు శీర్షిక ఇంటికి గడపలాంటిది. అది ఎంత
ఎత్తు, ఎంత వెడల్పు, అనేది నిర్మించబోయే ఇంటిని బట్టి వుంటుంది. అలాగే కథలో
చెప్పబోయే వస్తువును గాని, సంఘటననుగాని, ఆధారంగా చేసుకొని రచయిత శీర్షిక
నిర్ణయిస్తాడు. శ్రీశ్రీ ‘ఒసే తువాలందుకో’, పద్మరాజు ‘గాలివాన’ వంటివి సంఘటనను

ఆధారంగా చేసుకొని పెట్టిన శీర్షికలు. తిలక్ ‘నలజర్ల రోడ్డు’ కథా శీర్షిక అక్కడ జరిగిన
సంఘటన ఆధారంగా పెట్టబడిందని కథ పూర్తయిన తర్వాత అర్థమౌతుంది. అలాగే
‘రాత్రి 9 గంటలకు’ అనే శీర్షిక ఆ సమయంలో నగరంలో జరుగుతున్న సన్నివేశాల్ని
ప్రతిఫలింపజేస్తూ పెట్టబడింది.


కథలకు జంటపదాల శీర్షికల్ని పెట్టడం ఒక
ప్రత్యేకత. అయితే తిలక్ కథా శీర్షికలు ఆ గాలివాటంలో
పెట్టాడని ఖచ్చితంగా ధ్రువీకరించలేం గానీ ఆయన
‘సుందరీ – సుబ్బారావు’, ‘మీరేనా – నీవేనా’ కథా
శీర్షికల్ని మాత్రం కథలోని సన్నివేశాల్నిబట్టి నిర్ణయిం
చాడనిపిస్తుంది. అలాగే తిలక్ ‘కదిలేనీడలు’,
‘ఏమీలేదు’ వంటి ఆలోచనాత్మక కథా శీర్షికలను
ఎంచుకున్నాడు. వీటిలోని పాత్రల తత్వం అర్థం
చేసుకొనే విధంగా ఇలాంటి పేర్లు తిలక్ కథలకు
పెట్టడం శిల్ప నిర్మాణంలో భాగమే. అదే విధంగా
సామాజిక కోణం నుంచి సాగే కథలకు, మానవత్వం
వాసనలతో నడిచే కథలకు ‘ఓడిపోయిన మనిషి’,
‘అతని కోరిక’ వంటి అర్థవంతమైన పేర్లు పెట్టాడు
తిలక్. దొంగ ఎవరో తెలియపరిచే కథకు ‘అసలు
దొంగ’ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు.
డొంక తిరుగుడు కథా శీర్షికలు తిలక్ శిల్ప
నిర్మాణంలో భాగం కాదు. అందుకే ‘దొంగ’ సంక్షిప్త
శీర్షికను మంచి భావం కుదిరేలా ఇమిడ్చాడు.
బొమ్మచుట్టూ అల్లబడిన కథకు ‘బొమ్మ’ అని,
ఉంగరం చుట్టూ తిరిగిన వ్యక్తి జీవితాన్ని వర్ణించే
కథకు ‘ఉంగరం’ అని, ఒక వ్యక్తి జీవితం ఎలా రంగులరాట్నంలా తిరిగిందో చెప్పే
కథకు ‘జీవితం’ అని, రకరకాల సంక్షిప్త శీర్షికల ద్వారా కథా భావాన్ని పలికించాడు
తిలక్. సహజంగా కవి అయిన తిలక్ కొన్ని కథలకు ‘గడియారపు గుండెలు’ ‘మణి
ప్రవాళం’ ‘సముద్రపు అంచులు’ వంటి కవితాత్మక శీర్షికలను పెట్టి తన శిల్ప
నిర్మాణానికి ప్రారంభం చేశాడు.
కథా ప్రారంభాలు:
“కథ అనేది గుర్రపు పరుగు వంటిది. ప్రారంభం, ముగింపు ముఖ్యం” అంటాడు
మోపాసా. తిలక్ మొపాసా కథలతో ప్రేరణ పొందాడని ముందే చెప్పుకున్నాం. అందుకే

తిలక్ కథల్లో ప్రారంభాలు నత్తనడకన వుండవు. కథకుణ్ణి
నేరుగా కథలోకి ప్రవేశపెడ్తాయి. ఇది తిలక్ శిల్ప
లక్షణం. ప్రకృతి వర్ణనలు, సుదీర్ఘ సన్నివేశాలు వంటివి
వెదకినా దొరకవు. పాఠకుడి దృష్టిని స్పష్టమైన ప్రదే
శంలో, ఖచ్చితమైన సమయంలో, సరైన సందర్భంలో
నిలబడేటట్లు వాక్యం ప్రారంభిస్తాడు. పాఠకుణ్ణి ప్రారం
భపు మాటలతో బంధిస్తాడు.
తానే చూసినట్లు కథ చెప్పడం, పాత్రల చేత కథను
చెప్పించడం వంటి ప్రారంభాలు వున్నా ఆసక్తిగా ఎత్తుగడ
శిల్పాన్ని నిర్వహిస్తాడు తిలక్.
‘నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు.
అవధాని గారు ఇలా అనేటప్పటికి మేమందరం ఫక్కున నవ్వాం.” అని నల్లజర్ల రోడ్డు కథలోని ప్రారంభ వాక్యాలు వేరేపాత్ర చేత రచయిత కథ
చెప్పిస్తున్నాడనే విషయాన్ని, అడవిలో జరగబోయే సంఘటనల
స్వరూపాన్నిసూక్ష్మంగా తెలియజేస్తాయి.
‘యవ్వనం’ కథలో ‘ఆ రోజు విశాలలో ఎప్పుడూ లేని ఉత్సాహం సముద్రపు
కెరటాల్లా పొంగింది.” ప్రారంభ వాక్యాలు కథను సూచన ప్రాయంగా తడుముతూ
సాగుతాయి. సముద్రపు కెరటపు పొంగు ఉపద్రవ సూచకంగా పాఠకుడికి అర్థమై,
కథలోకి జొరబడేలా చేస్తాయి ప్రారంభవాక్యాలు. ‘ఫలిత కేశం’ కథలో “ప్రసాదరావు
అద్దంముందు నిలుచున్నాడు. అతనికి తనని తాను తీరికగా చూసుకోవాలనిపించింది.
అందులో ఏదో తృప్తి వుంది. అహం వుంది అనే ప్రారంభ వాక్యాలు ఎంతో హాయిగా
ప్రశాంతంగా కథలోకి తీసుకెళ్తాయి. వివేచనా శక్తిగల పాఠకుడు తొలి వాక్యంలో తిలక్
భావాల లోతును తర్కించుకోవచ్చు. అద్దం నిజం చెప్తుంది. వాస్తవాన్ని కాదు. నిజం
వేరు వాస్తవం వేరు. ఉన్న రూపాన్ని ఉన్నట్టు చూపడం నిజం. కుడిని ఎడమగా చేసి
చూపడం వాస్తవం. చిన్న తత్వాన్ని పట్టుకుంటే ప్రారంభ వాక్యాల్లో తిలక్ శిల్ప
సౌందర్యం అర్థమౌతుంది. కథలో ప్రధాన పాత్ర నిజం గురించి ఆలోచించాడు.
వాస్తవం గుర్తించలేక పోయాడు. ‘బొమ్మ’ కథలో ఎత్తుగడ శిల్పాన్ని వ్యాఖ్యానంలా
చెప్తాడు తిలక్. ‘ఆ పెద్దనగరంలో మార్కెట్టులో ఒకచోట బల్ల మీద ఓ ఆడది కూర్చుని
వుంది. ఆమె చాలా అందమైనది. లావణ్యమైనది……. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు’
అంటూ సాగిన వాక్యాలు తాను చెప్పబోయే సమకాలీన సమాజంలోని వ్యక్తుల
మానసిక స్థితిని పట్టి చూపిస్తాయి. కొందరు వ్యక్తులు ఆమెను ఉల్లేఖాలంకారంలోలాగా
ఎలా ఊహించారో చెప్పడానికే కవి అలాంటి పెద్ద ప్రారంభం చేశాడు. ‘ఓడిపోయిన
మనిషి’ కథను ‘తెరచి ఉన్న కిటికీలోంచి వొంటి మీద జల్లుపడి చటుక్కున మెలకువ వచ్చింది కళ్ళు తెరచి కిటికీలోంచి చూశాను.’ అనే ఆలోచనాత్మకమైన ఎత్తుగడతో
ఆరంభిస్తాడు తిలక్. ‘కళ్ళు తెరచి చూశాను’ అనడంలో అంతకుముందు కళ్ళు
తెరవకుండా సమాజాన్ని చూసిన ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్న రచయిత శిల్ప
నిర్మాణ దక్షత అర్థమౌతుంది.
పాత్ర నిర్మాణ శిల్పం:
తిలక్ పాత్రకు పెట్టే పేర్ల విషయంలోను, పాత్రలు నిర్మించే క్రమంలో ప్రత్యేక
శిల్పాన్ని ప్రదర్శించాడు. లోకం పోకడ తెలియని పురుషులకు ఆ రోజుల్లో ‘సుబ్బారావు’
అనే పేరు పెట్టి వ్యంగ్యంగా పిలిచే పరిస్థితి. మునిమాణిక్యం వారి కథల్లో భర్త పాత్రలో
అమాయకపు సుబ్బారావు కన్పిస్తాడు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి గురించి
తెలిసిందే. అలాంటి ఉద్దేశంతోనే కాబోలు సెకండరీ గ్రేడు స్కూలు మాస్టరులోని
అమాయకత్వాన్ని చెప్పడానికి ‘సుబ్బారావు’ అనే పేరు పెట్టాడు ‘సుందరీ-సుబ్బారావు’
కథలో అలాగే స్వచ్ఛమైన వ్యక్తిత్వంగల స్త్రీలకు నిర్మల (నిర్మల మొగుడు), స్వేచ్ఛా
ప్రవృత్తిలో జీవించాలనుకొనే స్త్రీకి విశాల(యవ్వనం), ధైర్యం, చురుకుదనం గల
యువతులకు సూర్యుడు(నల్లజర్ల రోడ్డు) వంటి పేర్లు పెట్టాడు.
ఇక పాత్రలను మలచిన పద్ధతిని తిలక్ కథల్లో ప్రత్యేకంగా గమనించాలి. పాశ్చాత్య
పాత్ర నిర్మాణ పద్ధతి తిలక్లో కనిపిస్తుంది. ప్లాట్ క్యారక్టర్స్ (సరళరేఖ పాత్రలు) రౌండ్
క్యారక్టర్స్ (గుండ్రని పాత్రలు) రెండూ తిలక్ కథల్లో వున్నాయి. మనిషి ఎంత ఉన్నతంగా
వుండగలడో చూపిస్తాడు. ఎంత పతనమవుతాడో చూపిస్తాడు. ఎలాంటి ఒడిదొడుకులు
లేని మనిషిని చూపిస్తాడు. అనైతికతతో పక్కవారిని నిరంతరం హింసించే మనిషిని
రూపుకట్టిస్తాడు. ముసలి మనిషి (ఊరిచివర యిల్లు), నరసమ్మ (సముద్రపు అంచులు)
వంటి పాత్రలు స్వార్థంతో, నమ్మిన మనిషిని వంచన చేయడంలో స్థిరంగా
నిలబడిపోతాయి. వారి స్వభావంలో కథ ముగిసేవరకు మార్పురాదు. అలాగే
వాస్తవికంగా పాత్రల్ని నిర్మించడం తిలక్ విలక్షణత. శంకరం (పరివర్తన), గవరయ్య
(దేవుణ్ణి చూసిన వాడు), సీతాపతి (సీతాపతి), గోపాలం (దొంగ) వంటి పాత్రలు
వాస్తవాల్ని గ్రహించి తాము మారాలని అర్థం చేసుకుంటాయి. గతంకంటే భిన్నంగా
తమ దిశను మార్చుకుని జీవించడానికి సిద్ధపడుతాయి. వెంకటేశ్వర్లు (ఆశాకిరణం)
లక్ష్మీమోహన్ రావు (అతనికోరిక) వంటి పాత్రలు పలాయన వాదానికి, అసమర్థతకు
శాశ్వత చిరునామాగా చూపిస్తాడు రచయిత. కూతురు వ్యభిచారిణిగా మారిందని
తెలిసి, చావును వాయిదా వేసుకొనే తండ్రి, కొడుకు చనిపోయినాడని తెలిసి పెళ్ళాం
పుస్తెలతో వేశ్య సాంగత్యం కోసం వెళ్ళిన వ్యక్తి వంటి పాత్రలను నిర్మించడంలో ఎంతో
నేర్పును ప్రదర్శించాడు తిలక్.

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles