23.2 C
New York
Sunday, April 28, 2024

తెలుగులో కాల్పనికేతర వచన సాహిత్యం

– డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్, సంపాదక సలహాదారు

“తెలుగులో సృజనాత్మక సాహిత్యముంది విస్స్రతంగా. శాస్త్ర సాహిత్యం లేదనే కన్నా ఉండవలసినంతగా లేదని చెప్పవచ్చు.” – డా. బూదరాజు రాధాకృష్ణ

      “… హిందూ దేశంలో ఇప్పటికి వచ్చిన గ్రంథాలు చాలా వరకు ఛందోబద్ధమైనవే! కొన్ని …… గ్రంథాలు వచన రూపంలో ఉన్నా, ఇవి సంస్కృత భాషలో ఉండటం చేత, మిక్కిలి కఠినంగా అనిపిస్తాయి. పండిత పామరులందరిచేత చదివించే సాధారణ వచన గ్రంథాలు లేకపోవడం చేతనే హిందూ దేశస్థులకు విద్యలు రావడం కష్టమయిపోతున్నది. విశేషమైన, అత్యావశ్యకమైన అనేక శాస్త్ర గ్రంథాలలో ఉండే విజ్ఞానం వారికి అందకుండా పోతున్నది”

      సామినీన ముద్దునరసింహం (175 సంవత్సరాల క్రితం రాసిన ‘హతసూచని’ తొలి అధ్యాయం ‘విద్య’ లో)

      “ఇప్పుడు మనకి వచన వాజ్బయం చాలా అవసరంగా ఉంది.” – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (‘ప్రబుద్దాంధ్ర 1034 జనవరి)

      తెలుగులో ముఖ్యంగా సాహిత్యరంగంలో ఒక విషయం దాదాపు దృష్టి నుంచి తప్పుకుంది. కనుక గుర్తు చేయాలని ముగ్గురు దిగ్గంతులైన ప్రముఖుల అభిప్రాయాలను ప్రకాశిక మీ ముందు ప్రస్తావిస్తోంది! అదేమిటంటే తెలుగులో ‘నాన్‌ ఫిక్షన్‌ గురించి ఎప్పుడూ చర్చ పెద్దగా జరగలేదేమో! నేడు ప్రపంచ వ్యాప్తంగా బెస్టు సెల్లర్స్‌ గా అమ్ముకాలుండే పుస్తకాల్లో చాలా భాగం నాన్‌- ఫిక్షన్‌ మాత్రమే! వాటిలో ఫిక్షన్‌ కూడా ఉంటుంది, కానీ నాన్‌ -ఫిక్షన్‌ సోదిలో లేకుండా పోదు! దీనికి కారణం ఏమిటో ‘సైన్స్‌ ఎందుకు రాస్తున్నాం’ అనే సంకలనంలో ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, గణితశాస్త్ర పరిశోధకులు డా. పి.వి. అరుణాచలం ఇలా వివరిస్తారు- “తెలుగు భాష చాలా వరకు సంస్కృత మూలాల నుండి అభివృద్ధి చెందింది. ఈ అనుసరించడం అన్ని రంగాలలో జరుగలేదు. ఎందుకో చారిత్రాత్మకంగా అట్లా జరిగిపోయింది. దీనివల్ల తెలుగు భాష ఎంతగానో నష్టపోయింది.”

      తెలుగు వ్యక్తి నీలం సజీవరెడ్డి 1977లో భారత రాష్ట్రపతి అయితే తెలుగు, సచిత్ర వారపత్రికలకు ముఖపత్రంగా ఆయన రాలేదుగానీ; ‘సుధ’ వంటి కన్నడ వారపత్రికలో కవర్‌ పేజీ అయ్యింది! నార్ల వెంకటేశ్వరరావు గారు ఎడిటర్‌ గా పనిచేసే కాలంలో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక ముఖచిత్రం మీద ‘గురజాడ చిత్రం వేశారు. చాలా సంచికల కట్టలు తిరిగి వచ్చాయి. (ఈ బొమ్మను దాచుకుని, తర్వాత స్థాయిలో దానికి ఫ్రేమ్‌ వేసి మా కొనతట్టుపల్లి ఇంట్లో నేను గోడకు వేలాడ దీసి ఉంచాను). మరొకరు ఎడిటర్‌ అయి ఉంటే వారి ఉద్యోగం పోయి ఉండేది!

      ఈ విషయాలు చెప్పడం ఎందుకంటే ఈ అనారోగ్య పరిణామం ఇప్పటిది కాదు, తెలుగులో చాలా కాలంగా ఉందని చెప్పడానికే! కవిత్వం, కథ, పాట, నవల, నాటకం వంటివి మరింత ఆకట్టుకుంటాయి. అందులో ‘చెప్పే తీరు హృద్యంగా ఉండి ఆకర్షిస్తోంది. ఈ ‘చెప్పే తీరు’ గురించి కూడా గమనించాలి. దానికంటే ముందు ‘చెప్పే విషయం’ ఏమిటని పరిగణించాలి! ఈ విషయానికి, చరిత్ర, సామాజిక, విజ్ఞానం, వైద్యం, వ్యవసాయం, ఫిలాసఫి, భూగోళం.. ఇలా చాలా అంశాలున్నాయి. వీటిని పరిశీలిస్తే, మరింత అధ్యయనం చేసి చెప్పే విషయం పుష్టిగా ఉంటుంది! ఈ విషయంలో తెలుగు కుంటుపడుతోంది.

      తెలుగులో నాన్‌-ఫిక్షన్‌ నుంచి మౌలిక వస్తువును ఫిక్షన్‌ స్వీకరించాలి; శిల్పపరంగా ఫిక్షన్‌ నుంచి నాన్‌-ఫిక్షన్‌ నేర్చుకోవాలి! మొదటిది అధ్వాన్నం అనుకుంటే, రెండోది మరింత అధ్వాన్నం! సమాచారం పంచే మాధ్యమాలు నుంచి విద్యార్థులు రాసే సమాధాన పత్రాలు దాకా ఇలా అన్నీ వచనంలోనే ఉంటాయి, కానీ కవిత్వంగా ఉండవు! అంత తరచుగా వాడే వచనం ఎందుకిలా అయ్యిందని – ఆ వచనాన్ని విరివిగా వినియోగించేవారు కూడా ఆలోచించని దుస్థితి దాపురించింది! అయితే అదే సమయంలో గొప్పగా రాణించిన ప్రతి రచయితా చక్కని చదువరి అని సులువుగా తెలుసుకోవచ్చు. ఆ మధ్య గురజాడ అప్పారావు సేకరించిన, మనకు చివరన మిగిలిన గ్రంథాల జాబితాను. చిన్న పుస్తకంగా ప్రకటించారు. ఆ పుస్తకాల చిట్టా చూస్తే గురజాడ వారి అధ్యయనం ఎంత విస్త్రతమో బోధపడుతుంది. తాపీధర్మారావు, శ్రీశ్రీ, కుటుంబరావు, పద్మరాజు, ఆరుద్ర, బుచ్చిబాబు, గోపీచంద్‌ వంటి రచయితలు విశేషంగా చదివిన వచన సాహిత్యం గమనించాలి.

      ఇపుడు పరిశీలన, అధ్యయనం తగ్గిపోయాయి. మన మేధో ట్యాంకులు, నింపుకోకపోతే రేపు ఉత్పత్తి అయ్యే సాహిత్యం డొల్ల కాక తప్పదు! ఇది సోషల్‌ మీడియా గురించి చేస్తున్న వ్యాఖ్య కాదు. మెయిన్‌ స్ట్రీమ్ లో రెగ్యులర్‌ గా, విరివిగా రాస్తున్న రచయితలను కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వ్యాఖ్య ఇది! ‘గేమ్‌ చేంజర్‌’ లాంటి పరిస్థితి వస్తే కానీ తెలుగు ప్రపంచ వేదిక ముందు భాసించే అవకాశం లేదు! కనుక చాలా స్థాయిలలో పరిష్కార మార్గాలు కోసం అన్వేషణ సాగించాలి.

      5/5 - (2 votes)
      Prakasika
      Author: Prakasika

      Related Articles

      Latest Articles