18.4 C
New York
Monday, April 29, 2024

బలహీనులు తిరుగబడితే – పిపీలికం కధ

శ్రీ మన్నె ఏలియా
మేటి కథలు-లోతు వ్యాాఖ్యలు

రావిశాస్త్రిగా ప్రసిద్ధిచెందిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తి రీత్యా న్యాయవాది. ప్రవృత్తి రీత్యా కథా రచయిత, నవలా కారుడు, నాటక కర్త. ఆయన కథల్లో కూడా న్యాయవాదే. నిత్యం సమాజంలోని పై తరగతుల వారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురియై చిత్రహింసలు అనుభవిస్తున్న దీన హీన పీడిత జనుల తరపున వకాల్త పుచ్చుకొని రచనలు చేసారు. ప్రతి రచనలోనూ సాంఘిక న్యాయం కోసం గొంతెత్తినారు. మార్క్సిజం ప్రభావంతో రచనలు చేసినారు. అందుకే అతన్ని ఇండియన్‌ గోర్కిగా పిలుస్తారు.

తెలుగు వచన సాహిత్యానికి వన్నె తెచ్చిన మహా రచయిత. రావిశాస్త్రి కథలు రాసినా, నాటికలు రాసినా, నవలలు రాసినా వీరిది విశిష్టమైన శైలి. రచనల్లో వీరు చేసినన్ని ప్రయోగాలూ ఇంకెవరు చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. రావిశాస్త్రి మానవతావాది, సామాజిక చైతన్య వారధి, కథా రచయిత, బహుముఖ ప్రతిభా సంపన్నులు, సునిశిత పరిశీలకులు, నిజాయతి నిబద్ధత గల రచయిత చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పడం వారికి వెన్నతో పెట్టిన విద్య. అనుక్షణం భయపడుతూ జీవించే నిసహ్లాయుల సమస్యలను వాటి వల్ల కలిగే వేదనను రోదనను సూటిగా పాఠకుల గుండెలకు హత్తుకునేలా తమరచనల్లో చెప్పినారు రావిశాస్త్రి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను తన రచనల ద్వార ఎత్తి చూపడమే కాకుండా పరిష్కార మార్గాన్ని కూడా చూపించినారు. ప్రతి రచన ఏదో ప్రయోజనాన్ని ఆశించి రచించినదే.

1967-1972 కాలంలో శ్రీకాకుళం గిరిజనుల హక్కులకోసం పోరాటం చేసినారు. అట్టడుగు ప్రజల కోసం తనదైన పద్దతిలో సమాజాన్ని నిలదీసినారు. 1947లో అతను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రజల జీవనశైలిలో వస్తున్న మార్పులను గమనించినారు. ఈ కొత్త జీవన విధానంలో
అమానవీయత అతనికి చాల బాధను కల్గించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా, ప్రతిభావంతంగా, పాఠకుల హృదయాలు స్పందిచేలా ఎల్లకాలం నిలిచి పోయే రచనలను అనేకం చేసినారు.

చిన్న కథలకు కొత్త కోణాలను, ఆధునిక కాల్పనిక సాహిత్యానికి వినూత్న దారులు వేసినారు. వీరి రచనల్లో పదునైన వ్యంగ్యం అంతర్లీనంగా ప్రవహించి సామ్యవాద భావాలను ప్రసారం చేస్తూ సాగిపోయే కథననం రావి గారిది.

వర్గ వ్యత్యాసాలను కండ్లకు కట్టినట్టుగా కథలు రాసినారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పలుచబడుతున్న సాంఘీక న్యాయాన్ని తమ కథల్లో ఎత్తి చూపినారు. గాయపడ్డ జీవితాలను ఇతివృత్తాలుగా మలచి రచనలు చేసినారు. వారి రచనలన్నీ ఆణిముత్యాలే. అణగారిన, పీడిత వర్గాలకు సాహిత్య జీవనాడితో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినారు.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యతను తెచ్చి తన రచనలతో తన ప్రభావాన్ని చాటారు. రావిశాస్త్రి రచనలు క్లయింట్లు, నిమ్నకులాలు, మరియు సామాన్య ప్రజల జీవితాలతో ప్రతిధ్వనించాయి. అతని కథా సాహిత్యం యొక్క సారంశంగా మారింది. అణగారిన వర్గాల బాధలకు ఓదార్పు నిచ్చారు. సృజనాత్మక రచనల ద్వార తను నమ్మిన సిద్దాంతాలను తమ రచనల్లో బలంగా ప్రకటించారు.

తెలుగు సాహిత్య లోకానికి “అల్పజీవి'(1952) నవల ద్వార విశిష్ట కథన శైలి చైతన్య స్రవంతి (stream of consciousness)ని పరిచయం చేసిన మొదటి వ్యక్తి. జేమ్స్‌ జాయిస్‌ రచనా పద్ధతి చైతన్య స్రవంతి ధోరణిలో రావిశాస్త్రి రాసిన “అల్పజీవి” నవలను పేర్కొంటారు. తెలుగు నవలా ప్రపంచంలో ఈ చైతస్య ప్రవంతిని ప్రవేశపెట్టిన తొలి నవల రచయిత రావిశాస్త్రి గారే!

మధ్య తరగతి, దిగువ తరగతి, ఉన్నత తరగతి సమాజం యొక్క సామాజిక ఫ్యాబ్రిక్‌ ను లోతుగా పరిశోధించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అణగారిన ప్రజల గొంతుకై వారి హక్కుల కోసం అయన రచనలు చేసినారు. వారి ప్రతి రచన సామాజిక
న్యాయం కోసమేనని వారికున్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. రచయితగా, తత్వవేత్తగా, సాహిత్య విమర్శకుడిగా, సామాజిక కార్యకర్తగా, ప్రజా హక్కులపరిరక్షకుడిగా బహుముఖీయంగా ఏది చేసిన అణిచివేతకు గురవుతున్న బలహీన వర్గాలకు దిక్కుగా వున్నారు. భావితరాలకు మార్గదర్శిగా నిలిచారు.

తెలుగునాట కలంతో సామాజిక రుగ్మతలను పెకిలించడానికి అహర్నిశలు కృషిచేసిన అక్షర యోధుడు. సమాజంలో నెలకొన్న దౌర్జన్యాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా తన రచనల ద్వార ప్రజలను చైతన్య పరచిన ఒక గొప్ప మానవతావాది. ఆర్తుల, దీనుల, హీనుల, బలహీనుల
పక్షపాతి. అటువంటి రావి శాస్రి గారి కథల్లో ఒకటైన కథ “పిపీలికం”. ఇది అతి ప్రసిద్ధమైన కథ. శ్రమదోపిడికి గురవుతుకూడా ఆ విషయం తెలియని అమాయకుల కష్టజీవుల, ఆర్రత ఆరాటం పోరాటం, వ్యథాభరితమైన జీవితాన్ని కండ్లకు కట్టినట్టు ఈ కథ చూపిస్తుంది. మానవతా వాదులను మేధావులను ఆలోచింపజెసిన కథ పిపీలికం.

ఒక అల్ప ప్రాణియైన చీమ ద్వారా నేనెవర్ని? అని ప్రశ్నలు సంధిస్తూ అస్తిత్వవాదాన్ని తెరపైకి తెచ్చిన కథ ‘పిపీలికం”. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిపోయే ఈ కథ శ్రమ దోపిడిని ప్రశ్నించడమే కాదు సందేశాత్మకంగా పరిష్కారం కూడా చూపించింది. కథ ఇలా మొదలవుతుంది. పూర్వం కృత యుగంలో ప్రజాపతి రాజ్యం చేసే కాలంలో గౌతమీ నదికి ఉత్తరంగా శ్యామ వనం అనే అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉండేదట.దాని మాను నానుకొని ఒక పెద్ద చీమల పుట్ట ఉండేదట.

ఒకనాడు ఉన్నట్టుండి ఒక చీమకు తానెవరోనని తెలుసుకోవాలనే జిజ్ఞాస కల్లిందట. చాల తీవ్రంగా ఆలోచించి ఆలోచించి పనిచేయడం మానివేసిందట. పని చేయని ప్రాణులు చెడిపోతాయని హెచ్చరించాయి మిగతా చీమలు. అయినా ఆ చీమ ఆలోచన మానలేదు. నేనెవర్ని? ఎందుకు పుట్టాను? ఎందుకు జీవిస్తున్నాను? నేనెందుకు చస్తాను? చచ్చి నేనేమవుతాను? వంటి ప్రశ్నలతో నిద్రచెడి దాని ఆరోగ్యం క్షీణించసాగింది.

మూడామడల దూరంలోని గోపాలపాలెంలో నిగమశర్మ అనే అనుభవశాలి బ్రాహ్మణుడుడున్నాడని ఆయన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలడని తెలుసుకుంటుంది. పెనుప్రయాసలకోర్చి అక్కడికి చేరుకుంటుంది చీమ. ఆత్మపదార్థానికైన సరే, బ్రహ్మ పదార్థానికైన సరే ఆకలి మాత్రం తప్పదని బాగా ఎరిగినవాడు నిగమశర్మ. గొప్ప ఆకలి మీదున్న శర్మ చీమల్ని కాని మనుషుల్ని కాని తినడట. కాని వారి కష్టాన్ని మాత్రమే తింటాడట అని రావిశాస్త్రి తనదైన శైలిలో వ్యంగ్యంగా చెపుతాడు. చీమకేమో జ్ఞానకాంక్ష, నిగమశర్మదేమో ఆకలి చూపు.

స్వామి! నేనెవర్ని? అని సవినయంగా చీమ విన్నవించు కుంటుంది. నిగమశర్మ ఒంటి బ్రాహ్మణుడు సగమాకలితో బ్రతికేవాడు. చీమకు చదువు చెప్పడం వల్ల కడుపునిండా భోజనం చేయవచ్చని సంబర పడిపోయినాడు. జిజ్ఞాసతో వచ్చిన చీమతో చదువుకోవాలంటే ప్రతి
దినం గిద్దెడు నూకలివవ్వాలని చీమతో ఒప్పందం చేసుకున్నాడు. ఎంతటి కష్టమైనా లెక్కచేయక ఎద్దులా కష్టపడి గింజా గింజా సంపాదించి ఇవ్వడానికి సిద్ధపడింది చీమ. వీలైనంత ఆలస్యంగా కొన్ని విషయాలు నేర్పించాడు. నువ్వు చీమవు అని తెలియజేసి ఇక చదువు అయిపోయిందని
చెపుతాడు.

చీమ తిరిగి శ్యామవనం చేరుకుంటుంది. తను నేర్చుకున్న జ్ఞానం ఇతర చీమలకు పంచింది. కొన్ని రోజులకు మళ్ళీకొత్త అనుమానాలు పట్టుకొచ్చాయి. చీమ అనే పదార్ధం ఎందులో వుంది? ఇవి ఇలాగే ఎందుకు పుట్టాలి? ఇలాగే ఎందుకు బ్రతకాలి? ఇలాగే ఎందుకు చావాలి?….

పాత గురువు దగ్గరికి వెళ్లి తన అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటుంది. అంతటి జ్ఞానం తనకు లేదని మూడు ఆమడల దూరంలో వున్నజన్నాల పల్లె అనే అగ్రహారంలో చతుర్వేది అనే బ్రహ్మణుడున్నాడని అతనివద్ద శిష్యరికం చేయమని సూచిస్తాడు నిగమశర్మ. చీమ
యమప్రయాసలకు ఓర్చుకొని వెళ్లి నిగమశర్మ నుండి తెచ్చిన పరిచయ పత్రం చతుర్వేదికి ఇస్తుంది. వేదాలు తెలుసుకోవాలంటే అది బ్రాహ్మణ చీమ అయివుండాలి కదా అని ఒక శిష్యుడు అభ్యంతరం చెపుతాడు. చీమ వాతలకు తట్టుకోలేదని మంత్రం జలం చల్లి చీమను
శుద్ధి చేసి బ్రాహ్మణులలో కలుపుకుంటాడు చతుర్వేది. చతుర్వేది వద్ద వేదవేదాంగాలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా బంగారం గురు దక్షిణగా ఇవ్వాలనంటాడు.

సంవత్సరాల తరబడి కాయ కష్టం చేసి గురుదక్షిణ చెల్లిస్తుంది చీమ. అధ్యయనం పూర్తి అయిపొయింది. బ్రహ్మజ్ఞానమంతా “సోహం” అనే మాటలోనే వుందని నేర్చుకుంటుంది.

బ్రహ్మజ్ఞానం పొందినప్పటికీ చీమ బ్రతుకులో ఎలాంటి తేడా రాలేదు.

బ్రతుకులో వెతుకులాటలు, కష్టాలు, కడగండ్లు, పీకులాటలు ఏవి తప్పలేదు.

ఇంకా తన అనుమానం తీరనేలేదు. అయినా పట్టువదలని చీమ ఏడు కొండలు దాటితే మహారుషి పుంగవుడున్నాడని తెల్సుకొని వెళ్లి అతన్ని కలుస్తుంది. నాలో భగవంతుడి పదార్ధం ఉన్నదా? వుంటే భగవంతునికి నేను ఏ రీతిగా భిన్నం? నాలో భగవంతుడు లేనట్టయితే భగవంతుడు
సర్వవ్యాపకుడు కానట్టేనా? అందుచేత భగవంతుడు “నాలో ఉన్నట్టే లెక్క చేసుకోవలేనా? అతడు నాలో ఉన్నట్టయితే నాకెందుకిన్ని బాధలు? అది నా పాప కర్మల ఫలితమనుకున్నట్లయితే భగవంతుడు నాలో వుండగా ఆ పాపాలు నేనెల చేయగలను? అంటే భగవంతుడు కూడా పాపాల నుండి తప్పించుకోనలేడా? ఇంతకీ నేనెవర్ని? నేనెందుకు ఈ రీతిగా ఉండిపోయాను? ఇప్పుడు నా కర్తవ్యమేమిటి? అంతా తెలియజెప్పండి స్వామీ! అని సవినయంగా వేడుకుంటుంది. దానికోసం యోగసాధన తపస్సు చెయ్యవలెనని సూచిస్తాడు. అలా చేయడం వలన జన్మరాహిత్యం సాధించి, మోక్షం పొందడమే ఏ జీవికైనా గమ్యం అని చెపుతాడు.

“జన్మరాహిత్యం, మోక్షం ఎందుకు” అని అడుగుతుంది. అందుకు మహర్షి ఇలాంటి సందేహాలకు సమాధానం ఇవ్వడం అనవసరమని నిశ్శబ్దంగా వుండిపోతాడు.

తనకు సమాధానం రాకపోవడంతో చెట్లు చేమలు, రాళ్లు రప్పలు, ఏడుకొండలు ఎన్నెన్నో గుట్టలు అన్నింటిని దాటుకొని నెల రోజులకు తన ఇంటికి చేరుకుంటుంది చీమ. చీమ పుట్ట సమీపానికి చేరుకొనే సరికి సూర్యోదయమవుతుంది. పగిలిపోయిన కోటలాంటి పుట్టలోంచి
బెదిరిపోయిన సైన్యంలా లక్షలాది చీమలు పారిపోవడం కనబడింది. ఏదో ఆపద సంభవించిందని గ్రహిస్తుంది. ఎవడో నల్లని రాక్షసుడు ఇంట్లో ప్రవేశించాడని ఒక చీమ ద్వార తెలుసుకుంటుంది. పారిపోతున్న చీమలన్నింటిని ఆపి తన చదువునంత వుపయోగించి వారికి ధైర్యం చెప్పి, తను ఒంటరిగా పుట్టలోకి వెళ్ళింది.

ఒక నల్లని రాక్షసావతారం చుట్టాలు చుట్టుకొని నిద్ర పోవడానికి సిద్ధపడుతుంది. చూడడానికి ఎంతో భయంకరంగా, అసహ్యంగా వుంది. ఎవరు నువ్వు? మా అనుమతి లేకుండా మా ఇంటిలోకి అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా ప్రవేశించావు ఎందుకు అని నిలదీస్తుంది.

“ఒరేయ్‌ నన్నే అడుగుతావా? నేను సుఖజీవిని. మీ పాలిట కాలయమున్ని. ఇప్పుడు తెల్సిందా అంటుంది నల్లని ఆకారం. ఇంకా ఇలా అంటుంది నువ్వొక కష్ట జీవివి. మాలాంటి వాళ్ళ సుఖం కోసం మీలాంటి వాళ్ళు కష్టపడడం ప్రకృతి ధర్మం. అలా జరగాలనేదే భగవంతుడి ఆజ్ఞ. మీలాంటి వెదవలంతా కష్టపడాల్సిందే, మేమంతా సుఖపడాల్సిందే అదే న్యాయం, అదే ధర్మం కాదంటే కాటేసి చంపుతాం. ఆ హక్కు మాకు భగవంతుడే ఇచ్చాడు” అంటుంది అ రాక్షసావతారంలోవున్న పాము. నివ్వెర పోయిన చీమ అనుకొంటుంది బ్రహ్మజ్ఞానం చెప్పారు కాని తను
కష్టజీవినని మాత్రం ఎవరు చెప్పలేదు. తన కష్టాన్నిదోచుకొని ఇతరులు సుఖిస్తారని కూడా ఎవరు చెప్పలేదు. శాస్త్రాలు చెప్పని సత్యం, ధర్మాత్ములు దాచిన నిజం నిజ జీవితంలో ఆ రాక్షసవతారం వల్ల బోధపడింది చీమకు.

ఈ అన్యాయాన్ని మేము సహించం తిరగబడతాం అని నిర్ణయించుకుంటుంది. పట్టుదలతో సహచర చీమలందర్నీ పిలిచి హితభోద చేసి, ధైర్యం నూరి పోసి వీరులనుగా మార్చేస్తుంది. అన్ని సంఘటితమై ఆ భయంకరమైన పాము మీద దాడి చేస్తాయి చీమలు. దానిని కొరికొరికి చిత్రహింసలు పెడతాయి. చీమల దాడికి విలవిలలాడి నెత్తురు కక్కుకొని చచ్చిపోతుంది పాము.
“బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమలచేత చిక్కి చావదె సుమతీ!” అనే పద్యం మదిలో మెదిలింది.

చీమ మరియు పామును ప్రతీకలుగా తీసుకొని రాసిన కథ పిపీలికం. ఇప్పటి రిసితులకు రాజకీయాలకు, కుల పీడనకు, శ్రమ దోపిడీకి, బలవంతులు, అ చేస్తున్న దౌర్జన్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది పిపీలిక కథా. అల్ప జీవులు ఎప్పుడు దోపిడీకి పీడనకు అన్యాయాలకు గురి అవుతాయని సూటిగా తెలియజేసే కథ ఇది.

కథలోని ప్రధాన పాత్ర చీమ (మానవ జీవితానికి ప్రతిబింబంలా)శ్రమజీవులకు బలహీనులకు ప్రతీకగావున్నా కథా. దుర్భలుడికి తోడుగా అతని మేధస్సు, వ్యూహ రచన, నాయకత్వం, మనోబలం, పోరాట పటిమ మొదలగు లక్షణాలు చీమలో చూడవచ్చు. మాయచేసో, భయపెట్టో, భ్రమచేసో, అర్థ బలమో, అంగబలమో, రాజకీయ బలమో, ఇతరుల అమాయకత్వమో వాడుకొని దౌర్జన్యాలు చేస్తున్నవారికి ప్రతీక పాము. న్యాయాన్యాయాలను, తర్మానికి, ధర్మ విచక్షణకు తావివ్వని ఈ తరం పోకడను విశదపరిచింది ఈ కథ.

“పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప” అని ప్రపంచానికి చాటి చెప్పిన తత్వవేత్త కార్ల్‌ మార్క్స్‌ అన్నట్టు నిజజీవితంలో చీమ ఈ సిద్దాంతాన్ని అమలు పరచి విజయం సాదించింది. మానవ హక్కులకోసం, “జోపిడీ, అణచివేతల నుండి రక్షణకోసం పోరాటమే అవసరమని నిరూపించిన కథ. నేటికి ఏనాటికైనా ఆమోద యోగ్యమైన మార్గమని చెప్పకనే చెప్పారు రచయిత. పాలకుల, యజమానుల, నియంతృత్వ ధోరణులు, విశృంఖల పోకడలు, దోపిడీ విధానాలు, అరాచకాలు పెచ్చరిల్లుతున్న తరణంలో వాటినుండి విముక్తి కోసం ఉద్యమం /తిరుగుబాటు అనివార్యమని చరిత్ర చెప్పిన సత్యం. పిపీలికం కథలో ప్రతిపాదించబడింది.

అస్తిత్వ ఉద్యమ నేపథ్యంలో ఇటివల కాలంలో అనేక కథలు రాస్తున్నారు. కాని రావిశాస్త్రి గారు ముందు చూపుతో ఆనాడే రచనలు చేసినారు. చీమ చేసిన ఉద్యమం మేధావుల, సామాన్యుల మెదళ్ళలో కదలిక తెచ్చింది కనుక ఈ కథ సార్థకమైనట్లే!

Vote this article
Prakasika
Author: Prakasika

Previous article
Next article

Related Articles

Latest Articles