21 C
New York
Sunday, April 28, 2024

మన గణతంత్ర ఘనత

డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ,
ప్రధాన సంపాదకులు, ప్రకాశిక

1947 లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన ఇండియా, (భారత్‌) 1950 జనవరిలో, స్వంత రాజ్యాంగంతో గణతంత్ర రాజ్యంగా అవతరించి ప్రపంచ పటంలో చేరింది. ఎందరో ప్రతిభావంతులైన వారి ఆలోచన, ఆదర్శ భావాల దర్బణమే భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాధమిక హక్కుల, ఆదేశ సూత్రాల, నియమాల స్వరూపం. రాజ్యాంగ స్ఫూర్తిని సమగ్రంగా, సంక్షిప్తంగా, భారత ప్రజల తరపున, వివరిస్తూ రూపొందించబడిన భారత రాజ్యాంగ పీఠిక దేశ ప్రజల ఆకాంక్షలకు అద్ధం పట్టే భావ సూచిక. సుమారు రెండున్నర శతాబ్దాల వీదేశీ పాలనలో భావ దాస్యానికి అలవడ్డ భారత జాతి తనదైన గళాన్ని, తనదైన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి ఆవిష్కరించే ప్రయత్నానికి ప్రతీక భారత రాజ్యాంగ రూపకల్పన. మంచి చెడుల మేలు కలయిక గా భారత రాజ్యాంగం రూపు దిద్దుకుంది; లిఖిత రాజ్యాంగమైన అమెరికా రాజ్యాంగంలోని మంచి అంశాలను, మౌలిక రాజ్యాంగమైన బ్రిటిష్‌ రాజ్యాంగాన్ని అనుసరించి నవ భారత ప్రజల భవిష్యత్‌ కు బాటలు వేసే ప్రజాస్వామ్య రాజ్యంగా మనుగడ సాగించడానికి మార్గ దర్శనం చేసే రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారు. కాలానుగుణంగా సవరణలు చేసుకోవడానికి వీలైన సదుపాయం మన రాజ్యాంగంలో కల్పించారు; ఇప్పటికీ 106 సవరణలు జరిగాయి.

సాధారణ సవరణలు పార్లమెంట్‌ లోని ఉభయ సభల సభ్యుల ఆమోదంతో జరుగుతాయి. రాజ్యాంగంలోని 368 అధికరణంలోని అంశాలకు సంబంధించిన సవరణాలకు మాత్రమే సగానికి తక్కువ కాకుండా రాష్ట్రాలు ఆమోదించాలి. అలాంటి సవరణలు ఇప్పటికీ 42 మాత్రమే జరిగాయి. పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో రాజ్యాంగ సవరణ అంత సులభం కాదు. ఆ దేశ కాంగ్రెస్‌ లోని ఉభయ సభలలోని మూడింతలలో రెండింతల సభ్యులు ఆమోదించాక, ఆ సవరణ ప్రతిపాదనను రాష్ట్రాలు ఆమోదించాలి. పర్యవసానంగా అమెరికన్‌ రాజ్యాంగానికి 250 సంవత్సరాలలో 27 సవరణలు మాత్రమే జరిగాయి. భారత దేశంలో, రాజ్యాంగ సవరణలలో రాష్ట్రాలకి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం అభిలషణీయం కాదు. రాష్ట్రాలు లేని కేంద్రం లేదు. కేంద్రం చేసే సవరణలు రాష్ట్రాలకి వర్తించడమే కాక, రాష్ట్రాలలోనే అమలు అవుతాయి. రాజ్యాంగ సవరణలలో రాష్ట్రాలకి తగిన ప్రాతినిధ్యం అవసరం.

సమగ్ర, విస్తృత చర్చలు జరగకుండా పార్లమెంట్లో మూజువాణి ఓటుతో ఆమోదించబడుతున్న చట్టాలు, రాజ్యాంగ సవరణల ప్రక్రియ ఆరోగ్యకరం కాదు అన్నది అందరికీ తెలుసు. కానీ ఆ అవాంఛనీయ సంప్రదాయాన్ని ఆపే ప్రయత్నం జరగడం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ చేసే చట్టాలు ప్రజల అవసరాలు తీర్చే మేరకు జరగాలి.

రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన జరగాలన్నది రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష, ఆలోచన. అందుకు అనుగుణంగా పారదర్శకంగా, ప్రభుత్వ ఒత్తిళ్లకు లోబడనవసరం లేని వ్యవస్థల ఏర్పాటు చేయడం జరిగింది. మన పెద్దలు మంచి ఆశయాలకు అనుగుణంగా
నిర్మించినది మన రాజ్యాంగం. కానీ, చట్టాలు చేసే చట్ట సభల సభ్యులు ఎంతమంది ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని ఓటు వేస్తున్నారు? పార్టీ ఆదేశానికి అనుగుణంగా జారీ అయ్యే విప్‌ కి లోబడి సభ్యులు ఓటు వేస్తే సభ్యుల వ్యక్తిగత ఆలోచనలు, ప్రజల ఆకాంక్షలు చట్టాల్లో ఎలా ప్రతిబింబిస్తాయి ? క్రీలక చట్టాలు తెచ్చేటప్పుడు నియోజక వర్గాల వారీగా ప్రజల అభిప్రాయాలని సేకరించే ప్రక్రియ చాలా అవసరం. సాంకేతిక ప్రగతి సాధించిన దేశంలో సమగ్ర ప్రక్రియల రూపకల్పన కష్టం కాదు.

స్వాతంత్ర్యం వచ్చాక భారత దేశం లో జరిగిన అభివృద్ధి గణనీయమైనది. కానీ, ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు అభివృద్ధి కొద్దిమందికి మాత్రమే పరిమితమైనది అనిపిస్తోంది. ఆందోళన కలిగించే విషయం ఏమంటే, ధనిక, పేద వర్గాల మధ్య అంతరం పెరుగుతోంది. పర్యవసానంగా, మధ్య తరగతి కనుమరుగయ్యే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది. అగ్ర రాజ్యం అయిన అమెరికాలో ఈ పరిస్థితి ఇప్పటికే గోచరమవుతోంది. ధనికులను మరింత ధనికులుగాను, పేదలను మరింత పేదలుగాను మార్చే ఆర్థిక వ్యవస్థ సమాజ ఆరోగ్యానికి మంచిది కాదు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలలో భారత దేశం మిశ్రమ ఆర్థిక విధానాన్ని ఎంచుకుంది. భారత దేశంలో ఉన్న ప్రజల స్థితిగతులను అనుసరించి ఈ విధానం అప్పటికీ, ఇప్పటికీ అవసరం, అనుసరణీయం. దశాబ్దాలుగా మనుగడ సాగిస్తూ, ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకి ఊతమిస్తున్న సంస్థలని కొందరు ప్రైవేటు వ్యక్తుల పరం చేసే ప్రయత్నం అవాంఛనీయం; దీర్ధకాలంలో ఆర్థిక వ్యవస్థకి హానికరం.

ప్రపంచ ఆర్థిక, సామాజిక నేపధ్యం వేగంగా మారుతోంది. అగ్రరాజ్యాలలో జరిగే మార్పులను తట్టుకుని నిలబడగల ఉద్యోగ అవకాశాల కల్పనకి అవసరమైన విధానాల రూపకల్పన అవసరం. గ్రామీణ ప్రజల అవసరాలకు అనుగుణంగా, పర్యావరణ హిత పరిశ్రమల స్థాపన అవసరం. గాంధీ ప్రతిపాదించిన గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా భారత దేశం అడుగులు వేస్తే, ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఈ దిశగా భారత దేశం అడుగులు వేయాలంటే, అందరినీ కలుపుకుపోయే, నాయకత్వ లక్షణం ఉన్నవారు దేశానికి అవసరం, పార్టీలకు అతీతంగా.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles