15.8 C
New York
Wednesday, May 15, 2024

బాల్యం – భాష – భవిష్యత్తు

– ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు

బిడ్డ గర్భంలో ఉన్నప్పటినుంచి, బిడ్డతో అమ్మ మాట్లాడే భాష అమ్మ భాషే; అరువు భాష కాదు. బాల్యంలో బిడ్డ అభివృద్ధికి అమ్మ, బిడ్డతో అమ్మ మాట్లాడే మాటలే మూలం. అమ్మ, నాన్న, తాతలు, అమ్మమ్మ, బామ్మ, అత్త, మామ లాంటి దగ్గర వ్యక్తులు మాట్లాడే మాటలు విని బిడ్డ అదే భాషలో ఆలోచించడానికి అలవాటుపడుతుంది. ఏ ప్రాంతానికి సంబంధించిన పిల్లలకైనా, ఏ ఆర్దిక, సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లలకైనా ఇది వర్తిస్తుంది.

బడిలో ఏ భాష ద్వారా బోధించాలి అన్న చర్చ ఈ మధ్య ఆంధ్రరాష్ట్రంలో విస్తృతంగా జరుగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం ఇలాగే కాలేజీ లలో తెలుగు మాధ్యమం ఉండాలా ఆంగ్ల మాధ్యమం ఉండాలా అన్న చర్చ జరిగేది. ఆంగ్ల మాధ్యమంలో చదివినవారు మేధావులవుతారని, వాళ్ళు ఉన్నత పదవులు పొందుతారని ఆంగ్ల మాధ్యమ వాదులు వాదించే వారు. నాబోటి వాళ్ళు ఎంతోమంది వేరే దారి లేక ఉన్న ఊళ్ళో ఉన్న కాలేజీ లో చదివారు; అయినా వెనకబడలేదు

పూర్తిగా ఇంటి వాతావరణం నుంచి బయటకి వచ్చి, కొంచెం బడి, కొంచెం ఇల్లు వాతావరణానికి అలవాటుపడే పిల్లలు ఇంట్లో వాడే భాషలోనే అలోచిస్తారు. ఒకటవ తరగతి నుంచి 8 వ తరగతి వరకు ఆంగ్లంలో బోధించే విధానం తీసుకురావడం అంటే పిల్లలని గందరగోళం లో పడేయడమే. బోధన మాధ్యమం, పాఠ్యాంశం వేరే విషయాలయినా ఆ రెండిటినీ కలగలపి ఆంగ్ల మాధ్యమవాదులు కొంత గజిబిజి వాదనలు చేస్తున్నారనిపిస్తోంది. పూర్వంలాగే పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తూ, ఆంగ్ల భాషని ఒకటి రెండు పాఠ్యాంశాలుగా బోధించి ఆ భాషతో కొంత పరిచయాన్ని పెంచి, ఉన్నత విద్యని ఆంగ్ల మాధ్యమంలో కొనసాగించడానికి విద్యార్ధులను సన్నద్ధం చేయడం సబబుగా ఉంటుంది.

ఆంగ్ల మాధ్యమాన్ని ఒక సామాజిక విభజన రేఖగా చిత్రించడంలో ఔచిత్యం లేదు. ఇంతకాలం మనం తెలుగులోనే నేర్పుతున్నా తెలుగులో భావవ్యక్తీకరణ ఎందుకు మెరుగుగా లేదు అని ఆంగ్ల మాధ్యమవాదులు కొందరు వాదించవచ్చు. ఇంగ్లండులో పెరిగినా, అమెరికాలో చదివినా పట్టుమని పది వాక్యాలు ఆంగ్లంలో రాయలేని, మాట్లాడలేని వాళ్ళు కోకొల్లలు. అంతెందుకు, అమెరికాలో పుట్టి పెరిగిన చాలా మంది అమెరికన్‌ లు కూడా ఆంగ్లంలో సరిగా మాట్లాడలేరు, రాయలేరు. పోల్చుకోవాలంటే, గ్రామాలలో పుట్టి పెరిగినా, ప్రతిభావంతులుగా ఎదిగి తెలుగు, ఆంగ్ల భాషలలో అనర్గళంగా మాట్లాడగల భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, భారత ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి శ్రీ రమణ గార్ల తో పోల్చుకుని వాళ్ళకి తెలుగు భాష మీద ఉన్న మక్కువతో పోటీ పడాలి.

పిల్లలు పెరిగేటపుడు, వాళ్ళు పెరిగే సమాజానికి సంబంధించిన విషయాలు, చరిత్ర తప్పక తెలుసుకోవాలి. తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి మాత్రమే ప్రత్యేకమైన ఎన్నో అంశాల గురించి పిల్లలకి పాఠ్యాంశంగా చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ పని తెలుగు మాధ్యమంలోనే సాధ్యం. పైపెచ్చు, అరకొర ఆంగ్లం తెలిసిన అధ్యాపకులు ఆంగ్ల మాధ్యమంలో చెబితే తయారయ్యే పిల్లలని ఊహించగలమా? అసంఖ్యాక గిరీశాలను తయారు చేయడానికి ఇది సులువు మార్గం. ఎక్కువ శాతం ప్రజలు గ్రామాలలో నివసించే భారతదేశంలో స్థానిక భాషలోనే బోధన జరగాలన్నది భారత రాజ్యాంగంలో దూరదృష్టితో పొందుపరచిన అంశం. ఆ స్ఫూర్తితోనే తెలుగు అధికార భాషా సంఘం తెలుగుని పరిపాలనా భాషగా రూపొందించే ప్రయత్నంతో పాటు పాఠశాలలో తెలుగు మాధ్యమ పరిరక్షణకి కూడా పాటుపడాలి, ఒత్తిళ్లకి తట్టుకుని. అది గురజాడ, గిడుగు లాంటి మహానీయులకి మనమిచ్చే నిజనివాళి.

5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles