16.7 C
New York
Wednesday, May 15, 2024

స్వేచ్చా భారతికి వజ్ర హారం

– ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు

ఈ సంవత్సరం భారత దేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం ప్రపంచంలోని భారతీయులందరికీ గర్వకారణం. అత్యంత క్లిష్టమైన సామాజిక, భౌగోళిక, ఆర్దిక, సాంస్కృతిక, మత పరమైన వైవిధ్యాలున్న శతాధిక కోటి ప్రజానీక ఆకాంక్షలకి, ఆశలకి ఆలవాలమైన భారత దేశం ప్రపంచానికి ఎన్నో రంగాలలో ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం 75 సంవత్సరాలలో బడుగు దేశం అన్న ముద్రని చెరుపుకుని అత్యంత _ ప్రభావశీలమైన దేశంగా పరిణతి చెందింది అంటే సామాన్య విషయం కాదు, ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాల పరిస్థితితో పోలిస్తే భారత దేశం సుస్థిరమైన గణతంత్ర రాజ్యంగా ప్రపంచంలో గౌరవాన్ని సంపాదించుకుంది. అంతేకాదు, ప్రపంచ ఆర్దిక వ్యవస్థ స్థిరత్వానికి మూల స్తంభంలా నిలుస్తోంది. నెహ్రూ నాటిన IIT లాంటి విత్తనాలు విస్తరించి ప్రపంచ నలుమూలలూ వ్యాపిస్తే, పి.వి. విస్తరించిన స్వేచ్చా విపణులు ప్రపంచాన్ని భారత దేశ వాకిటికి తీసుకువచ్చాయి. ఈ మహత్‌ పరిణామాలన్నిటికీ దోహద పడ్డది భారత ప్రజానీకం. మారే కాలానికి అనుగుణంగా మారుతూ, మారే వ్యవస్థలతో అనుసంధానం చేసుకుంటూ, వేగంగా మారే సాంకేతికతని అందిపుచ్చుకుంటూ, నిరంతర మార్పుని ఆహ్వానిస్తూ, అనుసరిస్తూ, దేశీయంగా జీవిస్తూ, ప్రాచికంగా ఆలోచించ గలిగే తత్వం గల భారతీయులు నిజంగా అభ్యుదయ భావాలు గల ప్రపంచ పౌరులు.

గత 75 సంవత్సరాలుగా. భారత దేశం భౌతికంగా ఎన్నో సాధించింది. దేశీయ పరిజ్ఞానంతో ఎన్నో ఉపగ్రహాలని అంతరిక్షం లోకి పంపడం, శాంతియుత ప్రయోజనాలకోసం అణు శక్తిని ఉపయోగించే సాంకేతికతని పెంపొందించుకోవడంతో అగ్ర దేశాల సరసన నిలిచింది. ఒక గౌరవ ప్రదమైన, నమ్మక ప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచింది.

దీనికి ప్రధాన కారణం పాలకులు మారినా మారని విదేశాంగ విధానం, విలువలు, అలీన విధానం.

ఇంత సాధించినా సాధించ గలిగినది సాధించలేదేమో అని అనిపిస్తుంది. ఎంతోమంది శాస్త్ర వేత్తలని తయారు చేస్తున్నాం. ఎన్నో శాస్త్ర విజ్ఞాన కేంద్రాలని స్థాపించాం. కానీ, ప్రపంచ స్థాయి పరిశోధనలు గాని, శాస్త విజ్ఞాన అవధులని విస్తృత పరచగల ఆవిష్కరణలు గానీ జరగలేదు. సాంకేతిక రంగంలో చూస్తే, ప్రపంచం మొత్తం వాడే ఏ ఒక్క సాఫ్ట్‌వేర్ కూడా భారత దేశంలో తయారు కాలేదు. మానవ వనరులని, మేధస్సుని ఎగుమతి చేసే ప్రధాన దేశంగా మాత్రం గుర్తింపు పొందేము. మనం ఎగుమతి చేసిన మేధావులు మైక్రోసాఫ్ట్, గూగుల్‌ లాంటి సంస్థలకి అధినేతలు అవుతుంటే గర్వంగా ఉంటుంది. గానీ అలాంటి వాళ్ళకి భారత దేశం లో ఎందుకు అవకాశం, వాతావరణం, వసతులు కల్పించలేక పోయారా అని ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఆర్దిక పరమైనది కాదు. అర్హతని ఆహ్వానించని సంస్థల వైఖరి, అడుగడుగునా అడ్డుపడే అర్హత లేని అధికారుల ఆగడాలు. ఇంకా చెబితే, ఎప్పుడూ కార్య కారణ సంబంధం వెతికే ప్రయత్నం చేయని పాలకుల నైజం. “మేధో వలస కాదు, డాలర్‌ బ్యాంక్‌” అన్నాడు ఎప్పుడో ఒక పెద్ద మనిషి. ఇది గర్హనీయమైనా జాతి ఆలోచనకి తార్కాణం. వలస వీసాల పరిమితిని అమెరికా తగ్గిస్తే భారత ప్రభుత్వం, భారత “మేధో ఎగుమతి” సంస్థలు చేసే ఆగడం అంతా ఇంతా ఉండదు. ఈ విషయం లో మాత్రం ‘దేశీయ గర్వం’ వెనకంజ వేస్తుంది.

యువకులు ఎక్కువగా ఉన్న దేశాలలో భారత దేశం ప్రపంచంలో ముందు స్థానాలలో ఉంది. యువకుల ఆశలకి, ఆకాంక్షలకి అనుగుణంగా విధానాలు రూపొందించ వలసిన అవసరం ఉంది. భారత దేశంలో పట్టాలు పొందే వారిలో సగానికి పైగా ఉద్యోగార్హత లేనివారని తేలుతోంది. వృత్తి నైవుణ్యం ఉన్నా ప్రవృత్తి నైవుణ్యం (Soft Skills) లేని వారు ఎంతో మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. చేపట్టిన పనిని సకాలంలో సాకులు చెప్పకుండా పూర్తిచేయలేక పోవడం, మాట్లాడడం రాకపోవడం, భావవ్యక్తీకరణ సామర్ద్యం లేకపోవడం, ఎదుటి వారితో అనుసంధానం కాలేక పోవడం, కలిసిమెలిసి సమష్టిగా పనిచేయలేక పోవడం, సమస్యలు సుహృద్బావ ధోరణిలో ఇచ్చి పుచ్చుకునే పద్దతిలో పరిష్కరించుకునే నేర్పు లేకపోవడం, ఎదుటి వారి సమస్యల పట్ల సానుభూతి చూపలేక పోవడం లాంటి మౌలిక ప్రవృత్తి నైపుణ్య లేమి భారతీయులలో ఎక్కువగా కనవడుతుంది. అంతకు మించి, పరిస్థితులకు తగినట్టుగా మారలేని భేషజం మన స్వంతం. ఈ ప్రవృత్తి నైపుణ్య అభివృద్ధికి యువతకి శిక్షణ ఇవ్వవలసిన ఆవశ్యకత చాలా ఉంది.

చైనాతో తలపడడాలంటే ఆశతో పాటు, వాస్తవిక పరిస్థితుల ఆధారంగా రూపొందించబడిన ప్రణాళిక చాలా అవసరం. నినాదాలు, వాగ్దానాలు దేశంలోని కొంతమందిని ఆకట్టుకుని ఆకర్షించవచ్చు కానీ అంతర్జాతీయ రంగంలో పోటీని ఎదుర్కోగల వ్యూహాలు మాత్రం కాజాలవు. రాబోయే దశాబ్దంలో భారతదేశం మరింత అభివృద్ది చెంది ప్రగతి మార్గంలో ప్రయాణించాలని నా ఆకాంక్ష.

5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles