18.4 C
New York
Monday, April 29, 2024

వాగ్గేయకారుల సాహిత్య సేవ

– ఆచార్య జి. ఎస్. మోహన్

– 94484 05110

తెలుగు సాహిత్య క్షేత్రంలో ‘వాగ్గేయకార సాహిత్యా’నికి విశిష్టస్థానం ఉంది.

‘సంగీతమపి సాహిత్యమ్ సరస్వత్యాః స్తనద్వయమ్|
ఏకమాపాత మధురమ్ అన్యదాలోచనామృతమ్||’

సంగీత సాహిత్యాలను రెండింటినీ ఆస్వాదిం చిన కవులు సంకీర్తనకవులు; వాగ్గేయకారులు. పదకవినే వాగ్గేయకారుడని అంటున్నాము. వాగ్గేయకారుడంటే వాక్యాన్ని గేయరూపంలో పెట్టేవాడు. అంటే వాక్కును గేయాన్ని (వాక్ + గేయం) కూర్చే నేర్పు కలవాడు వాగ్గేయకారుడు. లాక్షణికులు పదంలోని సాహిత్యాంశాన్ని ’వాక్’ అని, సంగీతాంశాన్ని ’గేయ’మని వ్యవహరించారు.

పాటలోని వాక్కులకు ‘మాతువు’ అనిపేరు. సంగీతానికి సంబంధించిన గేయానికి ’ధాతువు’ అనిపేరు. వాగ్గేయకారుడికి ఉండాల్సింది వాక్శక్తి మరియు గేయ నిర్మాణ చాతుర్యం. అలాగే సుశబ్ద, అపశబ్దాలకు సంబంధించిన శబ్దానుశాసన జ్ఞానం మరియు ప్రయోగ కౌశలం ఉండాలి. నవరసాలు, వాటి స్థాయీ భావాలు, విభావానుభవ సంచారీ భావాలను కూడా వాగ్గేయకారుడు తెలిసికొని ఉండాలి. దేశిరాగాలకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఈ లక్షణాలనన్నింటిని శార్ఙదేవుడు (13వ శతాబ్దం) తన ‘సంగీత రత్నాకరం’లో పేర్కొన్నాడు.

‘వాఙ్మాతురుచ్యతే గేయం ధాతురిత్యభి ధీయతే,
వాచం గేయంచ కురుతేయ స్సవాగ్గేయకారః’

ఇది వాగ్గేయకారునికి ‘సంగీతరత్నాకరం’లో ఇచ్చిన నిర్వచనం. కీర్తన యొక్క ‘మాతువు’ దేవతాస్తుతి పరమై ఉంటుం ది. పల్లవి, అనుపల్లవి మరియు చరణాలతో కూడుకొనియుంటుంది. మొదటి చరణం చివరిభాగం అనుపల్లవి యొక్క ధాతువును అనుసరిస్తుంది. మరిరెండు చరణాలు మొదటి చరణం ధాతువును అనుసరిస్తాయి.

పదానికి (పాటకు) పల్లవి ప్రాణం లాంటిది. పల్లవిలో సూచించిన వస్తువును చరణాలలో విస్తృతపరచడానికి ఉపయోగపడేది అనుపల్లవి. సాధారణంగా పదానికి మూడు చరణాలుం టాయి. పల్లవి, అనుపల్లవి, చరణాలు – ఇది పదనిర్మాణం. ‘పదం’ అనే పారిభాషిక శబ్దం నాట్య శాస్త్రంలో చెప్పబడింది. అక్షర సహితమూ, అక్షర యుతమూ అయినది పదం. పదాల్లో ఆధ్యాత్మ మరియు శృంగారం అనే రెండు రీతుల్ని వస్తు దృష్టితో గుర్తించవచ్చు. అన్నమయ్య తన ’సంకీర్తన లక్షణం’లో సంకీర్తనని పదమని పిలిచి శృంగారం మరియు వైరాగ్య పదాలన్న విభజన చేశాడు. వైరాగ్యపదం ‘అగ్రామ్యరమ్య విష్ణుచరితో దారం’ అయి ఉండాలి. అంటే అన్నమయ్య చెప్పినట్టుగా వైరాగ్యపదాలు అగ్రామ్యాలు గాను, రమ్యం గానూ విష్ణు సంకీర్తనలు గాను ఉండాలి. ఆ తర్వాతికాలంలో వైరాగ్యపదం లేదా ’దేవరనామాల’కు కీర్తనలనీ, శృంగార ప్రధానరచనలకు పదాలన్న పేరు వచ్చిం ది. తెలుగులో క్షేత్రయ్య శృంగార రచనలకు ’పదం’ అనేది పారిభాషిక పదం అయిం ది. అన్నమయ్యకు ’పదకవితా పితామహుడ’న్న బిరుదు ఉన్నా ఆయన రచనలకు కీర్తన లేదా సంకీర్తన అనేదే రూఢీ అయింది అంటారు కన్నడ పరిశోధకులు డా. అక్కమహాదేవి గారు. (‘పురందరదాసర మత్తు అన్నమాచార్య కీర్తనగళ సాంస్కృతిక అధ్యయన’, పుట 7)

బ్రహ్మానందమైన అనుభవానికి రసరాగలయబద్దమైన నాదోపాసనకోసం వాగ్గేయకారులు కనిపెట్టిన పరమోత్త సాధనాలలో ’కీర్తన’ ఒకటి. కీర్తన అంటే
స్తుతి, వర్ణన అని అర్థం. నవవిధ భక్తుల్లో కీర్తన కూడా ఒకటి. భగవంతుని కీర్తిస్తూ, చేసే గానమే కీర్తనభక్తి. అందువల్లనే కన్నడంలో కీర్తనను ’దేవరనామ’
అని కూడా అంటారు.

“సంగీత రచనా ప్రధానములగు త్యాగయ్య గారి రచనలవంటి వానిని ’కృతు’లనుచున్నాము. భక్తి ప్రధానములగు రామదాసు పాటలవంటివి ’కీర్తనములు’ అనుచున్నాము…..” అంటారు ప్రసిద్ధ పరిశోధకులు శ్రీమాన్ రాళ్ళపలి అనంతకృష్ణశర్మ గారు.

కీర్తనలలో నామముద్ర ఉండటం లక్షణంగా కనిపిస్తుంది. ఎవరికి అంకితంగా పదం రచింపబడుతుందో, అతని పేరును ఆపదంలో స్మరించడాన్ని, అతని నామాంకితంగా పదరచనచేయడాన్ని నామముద్ర లేదా పదముద్ర అంటారు. తాళ్ళపాక కవుల రచనలు శ్రీ వేంకటేశ్వరుడి నామాంకితాలు. క్షేత్రయ్య పదాలు మువ్వగోపాల నామాంకితాలు. సారంగపాణివి వేణుగోపాల నామాం కితాలు అవుతే, త్యాగయ్యవి శ్రీరామాం కిత పదాలు. యాగంటివారు, వీరబ్రహ్మం, దూదేకుల సిద్ధయ్య మొదలైన పదకవులు ఆత్మ ముద్రాంకితంగా కూడా రచనలు చేశారు. పదకర్తలు లేదా వాగ్గేయకారులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు సాహిత్య చరిత్రలో పదకవితలకు, వాగ్గేయకారులకు విశిష్టస్థానం ఉందని నిరూపిస్తుంది ఈ ప్రత్యేక సంచిక. ఈ సంచికలోని రచయితలందరూ తమ తమ సాహిత్యరంగాలలో లబ్ధ ప్రతిష్ఠులు. ఇందులో పదకొం డు వ్యాసాలు వాగ్గేయకార సాహిత్యానికి సంబంధించినవి. డా. గుమ్మా సాంబశివరావు గారు ’తెలుగు సాహిత్యంలో పదకవితావికాసం’ గురిం చి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆచార్య పి.ఆర్. హరినాథ్ గారు తాళ్ళపాక పదసాహిత్యం గురించి వివరించారు. ఆచార్య ఎస్. గంగప్ప గారు సారంగపాణి పద సాహిత్య సౌరభాన్ని, ఆచార్య వెలమల సిమ్మన్న గారు క్షేత్రయ్య పదసాహిత్య వైభవాన్ని, ఆచార్య జి. దామోదర నాయుడు గారు చిన తిరుమలాచార్యుల సంకీర్తనల స్వరూపాన్ని వివరించారు.

తెలుగు వాగ్గేయకారులు సంగీతానికి చేసిన సేవను డా. చల్లా ప్రభావతి గారు , త్యాగయ్యగారి పంచరత్నకీర్తనలు గురించి డా. పరమేశ్వరయ్య గారు ప్రత్యేకంగా వ్యాసాలు వ్రాసి పంపించారు. అన్నమాచార్యుల కీర్తనల మీద నాలుగు వ్యాసాలు ఉన్నాయి. అన్నమయ్య కీర్తనలలో సాంఘిక దృక్పథం అన్న వ్యాసాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, అన్నమయ్య భావుకత గురిం చి ఆచార్య ఎం. రామనాథం నాయుడుగారు, అన్నమయ్య కీర్తనలలో ఆచారవ్యవహారాల గురిం చి ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్ డిగారు తమ అమూల్యమైన వ్యాసాలను వ్రాసి పంపిం చారు. సహకరిం చిన రచయితలందరికీ ప్రధాన సంపాదకులు, ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారి తరపున, నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా మీద ఉన్న అభిమానంతో, విశ్వాసంతో ప్రకాశిక పత్రికలో “వాగ్గేయకార సాహిత్య శోభ” అనే ప్రత్యేక సంచికకి అతిథి సంపాదకత్వం వహించే అవకాశం ఇచ్చిన ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలతో పాటు మస్సుమాంజలులు.

1/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles