14.2 C
New York
Tuesday, May 14, 2024

కొత్త యిల్లు

– ఆచార్య కొలకలూరి ఇనాక్‌

పెళ్ళలు రాలి, నెర్రలు పడి, పాడుబడ్డ పాటిమట్టి గోడలలోపల ఏమీలేదని తెలిసి కూడా ఎందుకో వెదుకుతున్నాడు చలమయ్య. ఆ గోడల మధ్యనుంచి లోకం తెలియని రోజుల్లో మొట్టమొదట సూర్యుణ్ణి జూశాడు. ఆ యింటిలోనే కాపురానికి వచ్చిన పేరమ్మ అడుగుల చప్పుళ్ళు విన్నాడు.

ఒకనాడు ఆ ఇంటి నట్టిల్లు ఇప్పుడు పిచ్చిమొక్కల పుట్టిల్లు. నిలబడలేక పోయాడు. వెలుపలికి వచ్చాడు. చుట్టూ ముళ్లకంచె వుంది. దాన్ని అల్లుకొని కలబంద పెరిగిపోయింది. అది చలమయ్య పాతిందే! అడ్డ మాకలు లేకుండా పెరిగి పెద్ద మానులయ్యాయి. చిన్నతనంలో ఇంటిచుట్టూ అలవగా పాతిన ఈతచెట్టు తాటిచెట్టు పైకి పెరిగిపోయాయి. చెట్టుమీద కాయలు లేవు. కల్లు ముంతలున్నాయి. ఎడం ప్రక్క ఇదివరలో లేని పెంటప్రోగు వుంది. పడమటి గాడ్పు తోలి డొంకలో దుమ్మంతా లేచి కొమ్మలమీద, రెమ్మలమీద, ఆకులమీదా పడి విచిత్రంగా వుంది.

చలమయ్య యింటి స్టితి అంతా చూచి, కళ్లనీళ్ళు కళ్ళ గ్రుక్కుకొని చిల్లకంప ప్రక్క తాటిచెట్టు క్రింద నీడలో మొదలుకు వీపు మోటించి కూర్చుని, లాల్చీ జేబులోంచి బీడీ తీసి ముట్టించుకొన్నాడు. అలసటగా వుంది. నిద్ర మత్తుగా వుంది. కూర్చున్నప్పుడు పైజామాకు కాళ్ల దగ్గర కొట్టుకున్న దుమ్ము దులుపుకున్నాడు.

మిట్ట మధ్యాహ్నం, ఎండ తీవ్రంగా ఉంది. నేల పెట్రేగి పోతూ వుంది. రోహిణికార్తె ఎండలకు రోళ్ళు పగలటం లేదుగానీ, వెలుపలికి వచ్చిన ప్రాణుల వీపులు మండిపోతున్నాయి. అంత ఎండలో కుండ చంకన పెట్టుకొని పదహారు పదిహేడేళ్ళ యువతి గిలకబావి దగ్గరకు పోతూ వుంది. ఇంత ఎండలో ఈమెకు నీళ్లెందుకు కావలసివచ్చాయో తెలియలేదు చలమయ్యకు. బీడీ పొగలు వదులుతూ కూర్చున్న అతనికి జీవితం అర్థం లేని వివిత్ర సంఘటనల ఏకీకృత రూపం అనిపించింది.

ఆమె బావి వైపు పోతూ ‘ఎవరా ఈ మనిసి ఇక్కడ కూర్చున్నాడు అన్నట్లుగా వెళ్ళి చూసింది. కుండనిండా నీళ్లు నింపుకొని, పైట చెంగు నెత్తిన కుదురు చుట్టుకొని కుండ పెట్టుకొని మళ్లీ వచ్చిన తోవనే వెళ్ళింది. వెళ్ళేటప్పుడూ చలమయ్య వైపు విచిత్రంగా చూచి ‘ఎవరో బాటసారి అనుకొన్నట్టుగా వెళ్ళి పోయింది.

తన చిన్నతనంలో ఊరికంతటికీ అదొక్కటే మంచినీళ్ళబావి. మిగతావి ఎన్ని తవ్వించినా ఉప్పునీళ్ళే పడ్డాయి. ఇప్పుడేమన్నా కొత్త బావులు తవ్వించారో లేదో, ఆడకూతురు ఇంత ఎండలో నీళ్ళు తీసుకుపోవలసిన పరిస్థితి తలుచుకొని బాధపడ్డాడు చలమయ్య.

చలమయ్యకు దప్పికయింది. తాటిచెట్టు మొదట్లోంచి లేచి, బట్టలు దులుప్పుకొని బావి దగ్గరకు పోయాడు. బావి దగ్గర ఎవరూ లేరు. ఏ యింటి లోంచి జనం బైటికి రావటం లేదు. గిలకమీద తాడేసి, కడవకు ఉచ్చువేసి, బావిలోకి వదిలాడు. అప్పుడు ఆ యువతి పడిపోయిన గోడల యింటిమూలనుంచి తిరిగి మళ్ళీ వస్తూంది.

ఆమె అప్రయత్నంగా తాటిచెట్టు మొదట్లోకి చూచింది. ఎవరూ లేరు. ఆశ్చర్యపోయింది. ‘ఏమయ్యాడీ మనిషి ‘”ముంతలోనే!’ అనుకొంది. ఏమోలే అనుకొంటూ బావివైపు చూచింది. చలమయ్య కడవ అరుగుమీద పెట్టి పైజామా పైకెత్తి మోకాళ్ళతో అదింపట్టి కొంచెం వంగి, చేయినోటి దగ్గర పెట్టుకొని చేత్తో కడవ పట్టుకొని ప్రక్కగా వంచుకొని, నీళ్ళు తాగాడు. ఇంకా మిగిలిన నీళ్ళు ముఖంమీద జల్లుకొన్నాడు. ఇంకా మిగిలితే కాళ్ళమీద పోసుకున్నాడు.

ఆమె బావి దగ్గరకు వచ్చింది. చంకలో కుండ బావి చష్టామీద అరిగి కుదురుగా ఉన్నచోట పెట్టింది. చలమయ్య కడవ బావిలోకి వదిలాడు. చేది కుండలో పోశాడు. రెండు కడవలకే నిండిపోయింది.

ఆమె తల వెంట్రుకలలో ఎక్కడో ఊట ఉన్నట్లుగా చెమట నుదుటి మీదికి వస్తూంది. చెంపలమీది చెమట బొట్లు ఆరిపోవడం లేదు. మెడమీద తడి తడిగా వుంది. ముక్కుమీద నీరు వూరుతూ ఉంది. ఆమె పైట చెంగుతో ముఖం అంతా తుడుచుకొని, బారుచేసి కుదురు చుట్టుకొంటూ వుంది.

ఏ వూరయ్యా మంది? ఆమె అడిగింది.
ఈ వూరో
ఈ వూరె? ఏడ మనిల్లు నాకు తెలీకుండా, ఎవురబ్బా? ఎవుళ్ళన్నా చుట్టాలుండారా?’
ఊం
ఆమె పైటచెంగు కుదురు నెత్తిమీద పెట్టుకొంది
చూడమ్మా! చలమయ్య అడిగాడు.
ఏందీ?
పేరమ్మనీ ఒకామె ఉండాలి. వాళ్ళిల్లు తెలుసా? ఇదివరకు ఆ పాడుబడ్డ యింటిలో వుండేవాళ్ళు? ఒక కొడుకు ఆమెకు
ఏందీ?
ఈ వూళ్లోనే వున్నారా వాళ్లు
ఆ! మా అత్తేగా! మా అత్తేవవుద్ది?
చుట్టం!

‘దా సూపిత్తా’ తాడుచుట్టి సంకన తగిలించుకొని, కుండ ఎత్తుకోబోయింది. చలమయ్య కుండ ఎత్తాడు. కడవ తీసుకోబోయింది. ‘నేదెస్తాన్లే కడవా తాడు చలమయ్య తీసుకొన్నాడు. ఆమె వెనుక నడవసాగాడు. ఆ అమ్మాయి తన కోడలు అయివుంటుంది. పేరమ్మ ఎలా ఉందో? అమ్మాయి కుదిమట్టనంగా వుంది. మంచి బుద్ధి. చక్కని ఆరోగ్యం, బాగుంది. అనుకొన్నాడు.

ఆయన పుట్టినప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడనీ అందరూ చెప్పుకొంటున్న తన మామ ఈయనే కాడుగదా అనుకొంది.

నీ పేరెందమ్మా?
సీతమ్మ!
బసవయ్య బాగుండాడా?

ఇద్దరూ పాడుబడ్డ ఇంటి మలుపు తిరిగారు. వేపచెట్టు క్రింద పిల్లలు కర్రాబిళ్ల ఆడుకొంటున్నారు. అంతకంటే చిన్నవాళ్ళు దుమ్ములో గోళశీకాయలు ఆడుకొంటున్నారు. ఒక ఇంటి చూరు నీడలో ఆడపిల్లలు నామనగుంటలు ఆడుకొంటున్నారు. మరికొందరు అచ్చనగాయలు ఆడుతున్నారు. అందర్నీ చూచుకొంటూ వెళ్ళుతున్నాడు చలమయ్య. కోడలు వెంట! ఒక యింటి ముందు వేపచెట్టు క్రింద నులక మంచం మీద కూర్చుని చుట్ట కాల్చుకొంటున్న వృద్దుడు నోట్లోంచి చుట్టతీసి కళ్ళపైన చేయి పెట్టుకొని చూచి

ఎవరదీ! సీతా! అన్నాడు.
ఏందీ తాతా?
ఎవురే అది?
చుట్టంలే!
ఎవరే ఆ చుట్టం, నాకు తెలియకుండా నీకు?
సీతమ్మ జవాబు చెప్పలేదు ముందుకు నడుస్తూవుంది. వెంట చలమయ్య.
ముత్తయ్య ఇంకా బ్రతికే వున్నాడా?
ఆం! చూప్పుతగ్గలా! మాట తగ్గలా! తగిలి పనిసేత్తన్నాడు!

ముత్తయ్య, చలమయ్య చిన్నతనంలోనే ముసలివాడు. ఇంకా ముసలి వాడుగానే వున్నాడు. చలమయ్య తండ్రికి ముత్తయ్య పెదనాన్న.

అయ్యా! పేరు చలమయ్యేనా?’ సీతమ్మ అడిగింది

ఆం
“ఏంది! దా! దా!’ సీతమ్మ ఇంటివైపు గబగబా నడిచింది.

దా! ఇదే యిల్లు! అంటూ లోపలకు పోయి వేపచెట్టు క్రింద బానదించి మూకుడు తెచ్చి మూతవేసింది. చలమయ్య చేతిలో కడవా తాడూ తీసుకొని, తాడు చెట్టు కొమ్మకు తగిలించింది.

ఎవుడే ఆడు? బసవయ్య వచ్చాడు.
ఏం దట్టా మాట్లాడుతా! మా మాంవ!
ఎవుడే మీ మాంవ! – నాకు తెలియకుండా!
ఏందదీ – మీ అయ్య!
మా అయ్యేడుండాడే! ఏనాడో జచ్చాడు’ అంటూ దగ్గరకు వచ్చి ‘ఎవరు నువ్వు? అన్నాడు

చలమయ్య గుండె చివుక్కుమంది. బసవయ్య వైపు ఎగాదిగా చూచి ‘పెద్ద వాడయ్యాడు’ అనుకొన్నాడు.

ఎవుడెహే వాడు మాట్టాడ్డు!

భార్య చేతిలో కడవ తీసుకొని ‘రెయ్‌ రండ్రరా నీళ్ళు దాగుదురు గానీ!’ అని పిలిచాడు.

చూరుగుట్టు బద్ద చంకలో పెట్టుకొని వచ్చిన మనిషి కాళ్ళు ముఖం, కడుక్కున్నాడు. కొంచెం తాగిం తర్వాత ఆకందించే మనిషి, లోపల కుట్టుగట్టే మనిషి నీళ్ళు తాగి, ముఖాలు తుడుచుకొంటున్నాడు.

ఆడి మాటకేందిలే అయ్యా! ఆడిమాటే అట్టాటిది. పెళుసు. పుల్లిరగదీసి పొయ్యిలో పెట్టినట్లు మాట్లాడతాడు. నువ్‌గూసో’ అంటూ సీత మంచం తెచ్చి చెట్టు క్రింద వేసి బట్ట పరిచి ఇంటి వెనుక్కు పోయింది.

అక్కడ పాత తాటాకు తుంటెలూ, ఆకులూ పనికిరానివి ఒకచోట కుప్పవేసి పూడుస్తూ వుంది పేరమ్మ. నేలమీద నీటితడి విరిగిపోయిన పాత తాటాకుముక్కలు నేలకు ఇల కర్చుకుపోయాయి.. ఎండు తాటాకులు మీద నిలిచిన నీళ్ళతో చెమ్మగిల్లుతున్నాయి. కవురుగమ్మి నల్లకప్పేసిపోయిన ఆకులు జీవితంలో ఓడిపోయి పనికిరాకుండా అయి, పొయ్యిలో పెట్టుకోడానికి మాత్రమే తగినట్టు తయారయి ఉన్నాయి.

అత్తా! అత్తా!

ఏందే దూకుడు?

పేరమ్మ తలెత్తకుండా నేల వూడుస్తూ అంది.

ఎవురొచ్చరో చెప్పు!

ఏందీ సెప్పేది? ఎవురొచ్చేరేంది?

మాంవ! సెలంవయ్య మాంవ!

ఏందీ? పేరమ్మ నడుం ఎత్తి కోడలు ముఖంలోకి చూస్తుంటే, సగం కప్పటం పూర్తయిపోయి, మిగతా సగం బోసిగా వున్న ఇల్లు కనిపించింది.

ఏందే నువ్వనేది?

నిజం! దా!

ఇద్దరూ యింటిముందుకు వచ్చారు. చెట్టుక్రింద మంచం మీద చలమయ్య కూర్చుని వున్నాడు. పేరమ్మ పైట భుజాలు మీదికి చుట్టుకొంది.

ఇరవై ఏళ్ళనాడు, ఇరవై ఏళ్ళ వయస్సులో పదహారేళ్ళ భార్యనీ ఏడాది నిండని కొడుకును వదలివెళ్ళిన భర్తను, చలమయ్య ను పేరమ్మ పోల్చుకుంది.

విధికి భార్యను కొడుకునూ వదిలివెళ్ళి, విధి చేతిలో బొమ్మగా మారిపోయి, గూడులేని పక్షిలాగా పంజరంలో చిక్కుకొని, అక్కడే పరమార్థం వుందని భ్రమించి, చావు మూడుతుందని తెలియకుండా నిప్పుచుట్టూ భ్రమించే కీటకంలాగా అయి, చావుదప్పి కన్ను లొట్టటోయినంతపనయి తిరిగివచ్చిన చలమయ్య భార్యను, పేరమ్మను చూశాడు. గుర్తుపట్టాడు.

పదహారేళ్ళ వయస్సులో ఎలా ఉందో అలాగే వుంది పేరమ్మ చలమయ్య దృష్టిలో. అయితే ఆమె మారిపోయింది. మునుపటి కంటే లావు అయింది. చలాకీతనం లేదు. ఆమెకిప్పుడేదీ ఆనందం _ కలిగించదు. ఏదో విచారం పుట్టించదు.. స్తబ్ధంగా అయిపోయింది. ముఖంలో వచ్చిన మార్పు కంటే మనస్సులో వచ్చిన మార్పు దొడ్డది! భర్త వూరు విడిచి వెళ్ళినప్పుడూ ప్రతిరోజూ ఇవాళొస్తాడు. రేపొస్తాడనుకొంటూ ఎదురు చూచింది. అలా కొన్ని సంవత్సరాలు ప్రతీక్షించింది. భర్త రాలేదు. అంతేకాదు భర్త అంతూ పొంతూ లేకుండా అయిపోయింది. ఆమె ఎదురు చూడటం మానుకొని కొన్ని సంవత్సరాలు – దాదాపు ఒకటిన్నర దశాబ్దం అయింది.

సాఫీగా వెళ్ళే రైలు వంతెన మీదుగా వెళితే కొన్ని సెకెండ్లు కొత్తగా దడదడలాడిన ధ్వని వినిపిస్తుంది. ఇప్పుడామెకు అలాగే అనిపించింది.

భర్త ముఖంలోకి చూచింది. జుత్తు బాగా పెరిగింది. గిరిజాల జుత్తు. గడ్డం మాసిపోయింది. కళ్లు కనుగుంటల్లోకి పీక్కుపోయాయి. చెక్కిలి మార్దవం కోల్పోయింది. చెక్కిలి ఎముకలు ముందుకు పొడుచుకు వచ్చాయి. పెదాలు చచ్చి ఎండిన బల్లుల్దా నోటికి ఇలకర్చుకుపోయాయి. బలంగా లావుగా ఉండే భర్త సన్నగా గోగు పుల్లలాగా వున్నాడు. దానికితోడు వేసుకొన్న బట్టలు వికారంగా వున్నాయి. పేరమ్మ ఏమీ మాట్లాడలేదు. చివరికి చలమయ్యే అన్నాడు.

బావున్నావా?

వూ(!

పేరమ్మ తలవంచుకొంది.

అప్పటికి సీతమ్మ మనస్సు కుదుటపడింది. ఇంటిపైన తాటాకు కప్పు వేయటానికి వచ్చిన పనివాళ్ళకు నీళ్ళు త్రాగనిచ్చి కాళ్ళూ చేతులూ కడుక్కొన్న తర్వాత భార్య నుద్దేశించి ‘మాకేంవన్నా ఇంతపడేసేదుందా లేదా?” అన్నాడు బసవయ్య.

ఇది గిప్పుడే అంటూ చుట్టింటిలోకి పోయింది సీతమ్మ. బసవయ్య తలుపు. దగ్గరకు వచ్చి, ‘“ఎవుడడు నడిమంచం మీద నాటకాలోళ్ళా బాచిపట్టేసుక్కూచున్నాడు?’ అన్నాడు.

కొడుకును వెంట తీసుకుని చుట్టింటిలోకి పోయింది పేరమ్మ. కొడుకు గుండెమీద తల ఆనించి బావురుమని ఏడ్చింది.

ఏందే? ఏవయిందేంది?

పేరమ్మ కన్నీళ్ళు తుడుచుకొంటూ చెప్పింది. ‘మీ నాయన!
“ఏందీ! ఏందే నువ్వు జెప్పేది?’

‘మీ నాయనరా!’

బసవయ్యకు అర్థం కాసాగింది. అర్థం అయినట్లే వుంది. ఉన్న పళాన వెలుపలికి వచ్చాడు. తండ్రి ముఖంలోకి ఎగాదిగా చూశాడు. కొన్ని క్షణాల సేపు ఆ మనిషిని తండ్రి అనుకోలేకపోయాడు. మనస్సంగీకరించలేదు. వింతగా వుంది చూపు. మనస్సు తిరగబడుతూ వుంది. ఇరవై ఏళ్ళు తండ్రి ప్రేమ నెరుగని బసవయ్య. తండ్రితో మాట్లాడడం తెలియని బసవయ్య, తండ్రి ఎదుట నిలబడటం తెలియని బసవయ్య చలమయ్యను, ఆదోమాదిరిగ ఉన్న చలమయ్యను, వికారంగా రోతగా ఉన్న చలమయ్యను, ఎవడో వీడు అనుకొన్న చలమయ్యను “తండ్రి అనుకోలేకపోయాడు. ‘నాయనా!’ అనలేకపోయాడు.

తల్లిమాట చేదు, పెళ్ళాంమాట బెల్లం అనుకొన్నా భార్య చెప్పిన ప్రకారం చలమయ్యను తండ్రి అనుకోలేకపోయాడు. తల్లిమాట జవదాటని బసవయ్య చలమయ్యను తండ్రి అనుకోలేదు.

ఒక మధురమైన ఊహ, తీయని కల, ఎడారిలో సరోవరం వంటి ఆలోచనతో అక్కశ కూర్చున్న మనిషి తన తండ్రి అనుకోవటానికి ప్రయత్నిస్తే పెన్సిలిన్‌ ఇంజక్షను పడనివాళ్లకు ఇంజక్షను ఇస్తే వచ్చే రియాక్షను వంటిది వచ్చి వళ్ళంతా మంట పుట్టింది.

తీరా, తండ్రి అని సర్టుకొందామని, శరీరంతో మనస్సుకు రాజీ కుదిరిద్దామని చూస్తే హృదయం, చలమయ్య వైపు గోంగూరలో పురుగును ఏరిపారేస్తున్నట్లు ఎదురు తిరుగుతూ చూస్తూ ఉంది.

బాగున్నావా నాయనా! చలమయ్య కొడుకును అడిగాడు.

ఏందోలే నీ దయవల్ల ఇట్టా గున్నాంవ్‌’ అన్నాడు.

ఆ మాట చలమయ్య గుండెమీద గునపం పోటయింది.

చలమయ్య జీవితంలో పొందిందీ, పోగొట్టుకుందీ వయసు. కష్టసుఖాల తెరల మధ్య జీవితం అనే రంగస్థలంమీద వయస్సును వెచ్చించి నటించాడు. ఇక సామర్థ్యం లేదు. అవకాశం లేదు.

చెట్టు ఎంతెత్తు పెరిగినా , వింతగా ఆకాశం తాకాలని చూచినా దాని పుట్టుక గుర్తుకొచ్చినప్పుడు, వ్రేళ్లింకా భూమిలోనే ఉన్నాయని జ్ఞప్తికి రాక పోదు. చలమయ్యకు అలాంటి స్ఫురణే కలిగింది. తల్లి వేరు, పిల్ల వేరులుగా పేరమ్మ, బసవయ్యలు పల్లెలో ఉన్నారని బయలుదేరి వచ్చాడు.

ఇలా రావటంలో వాళ్ళను ఉద్ధరిద్దామనే దృష్టి ఏమీ లేదు. సాయంకాలం అవుతుంటే గూటికి చేరుకొనే పక్షులకు గూళ్ళను ఉద్ధరింపబోతున్నామన్న అభిప్రాయం ఉండే అవకాశం తక్కువ. అలాగే వచ్చాడు చలమయ్య.

తన గూడు అనుకొన్న దాంట్లో తనకు తావు లేకపోతే పక్షి విల విల లాడవచ్చు. గూట్లో చేరిన పక్షులతో రెక్కారెక్కి, ముక్కాముక్కి తగాదా వేసుకోవచ్చు పక్షులులయితే. కాని చలమయ్య అలా చేయలేడు. అందుకే ఏ పరిస్థితయినా తలవంచి, రాజీపడే ధోరణిలో ఉన్నాడు.

‘కూర్చో!’ అన్నాడు కొడుకు నుద్దేశించి.

‘నువ్‌ గూసో. వత్తా!

బసవయ్య వంట గదిలోకి పోయేసరికి తల్లితో సీతమ్మ చలమయ్యను గూర్చి మాట్లాడుతూ వుంది. వాళ్లిద్దరూ పెద్ద విశాలమయిన చెరువుల్లాగా కొత్త నీటిని కలుపుకోగల చెరువుల్లాగా కనిపించారు.

సీత చెంబులో నీళ్ళు తెచ్చి ‘కాళ్ళు గడుక్కోమమ్ణి అత్త” – అంది.

చలమయ్య లేచి, బట్టలుతికే బండ దగ్గరకు పోయి కాళ్ళ మీద నీళ్ళు పోసుకుని తుడుచుకుంటూ వచ్చాడు.

‘అన్నం తింటానికి రమ్మందత్త’ అని లోపలికి నడిచింది సీతమ్మ.

కోడలు వెంట చుట్టింటిలోకి వెళ్ళాడు. వంట చేసుకోవటానికి, వంట పాత్రలు పెట్టుకోవడానికి, ఒకరిద్దరు అన్నం తినటానికి సరిపడినంతగా వుందా చుట్టిల్లు.

రాగిబిందె ఒకటి, ఇత్తడి గంగాళం ఒకటి. ఇత్తడి కంచాలు రెండు ఆ యింట్లో ప్రముఖంగా కనిపించిన వస్తువులు. అదేదీ తను సంపాదించలేదు. అన్నీ ఆమె అర్జించుకొన్నవే!

పేరమ్మ అన్నం కంచం నిండా పెట్టి పచ్చడీ, కూరావేసి మూలకు కూర్చుంది. కంచం ముందు వాల్చి ఉన్న పీటమీద కూర్చున్నాడు చలమయ్య.

అది రండు దూలాల ఇల్లు. గోడ మట్టిగోడ కాదు, రాతిగోడ! పంచపాళీకి కప్పేశారు. ఒక దూలం వరుస పూర్తయింది తాటాకు కప్పు. ఇంకా ఒక దూలం వరుస కప్పాలి. ఇంటి పంచలో శుభ్రంగా వూడ్చి విస్తళ్ళు తడిపి, పరిచి ఇత్తడి గ్లాసులతో నీళ్లు బెట్టి పనివాళ్ళూ, భర్త విస్తళ్లు ముందు కూర్చుమ్హై సీతమ్మ అన్నం వడ్డిస్తూ వుంది. ఆమె. ఇంటి. పంచలోకి చుట్టింటిలోకి నేతనేసే మగ్గంలో కండెలాగా తిరుగుతూ ఉంది.

చుట్టింటిలో భర్త అన్నం తింటుంటే చూస్తూ కూర్చున్న పేరమ్మ కోడలు రాగానే ఎటో చూచింది. ఆయనెంత నాజూకుగా అన్నం కలుపుకుంటున్నాడూ, ఎంత ఒద్దికగా తింటున్నాడూ, ఎంత ఆకలిగొన్నాడో అనుకొంటూ వుంది సీతమ్మ.

కోడలు లేనప్పుడు అడిగింది.

“అన్నం వేసేదా”

“కొంచెం!”

అన్నం వడ్డించిండి.

‘కూరేసేదా?”

వద్దు?”

“పెరుగు?
“ఊం

పెరుగు వేసింది. కలుపుకొని తింటూ ఆవకాయ నంజుకొంటుంటే ఇరవై ఏళ్ళనాటి జీవితం జ్ఞప్తికి వచ్చింది.

చలమయ్య చుట్టింటిలోంచి వచ్చి చెట్టుక్రింద మంచం మీద కూర్చున్నాడు. ఇంటిపంచపాళీలో అన్నం తినటం ముగించినవాళ్ళు పైపంచెలు తలక్రింద పెట్టుకొని నేలమీద మేను వాల్చారు. మళ్ళీ సీతమ్మ బియ్యం కడిగి పొయ్యిమీద పెట్టింది. పేరమ్మ వెలుపలికి రాలేదు. రాలేకపోయింది. పొయ్యి ఊదుతూ అక్కడే కూర్చుంది.

నిండు చూలాలుగా భర్త పాదాలకు నమస్కరించి పుట్టింటికి పోయిన పేరమ్మ పండంటి కొడుకును వెంటతీసుకొని అత్తవారింటికి వచ్చి భర్త జాడ తెలియక వెర్రెత్తిపోయింది.

ఆమె పుట్టింటినుంచి బయలుదేరుతున్న రోజే చలమయ్య పుట్టినించి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె చీరేసారే తీసుకువస్తుంటే, చేతికి అందిన డబ్బు ఉంగరాలు తీసుకొని అతను ఉడాయించాడు.

భర్త అనురాగం కోల్పోయిన పేరమ్మ అత్తమామల _ ఆదరణ సంపాదించుకొంది. మామమీద అలిగి పెళ్ళయిన కొత్తలో అమ్మానాన్నల నిద్దరినీ వెళ్ళగొట్టాదు. ఇప్పుడు వాళ్ళిద్దరికి అండ దొరికినంతపనయింది. సంవత్సరం అంతా వాళ్ళింటా వీళ్ళింటా తలదాచుకొన్న వాళ్లు తమ ఇంటికి తామే వచ్చేశారు.

మాధవయ్య గారి దొడ్డిలో మాయల ఫకీర్‌ టిక్కెట్‌ నాటకం ఆడిన వాళ్లలో బాలనాగమ్మగా నటించిన సభారంజని చలమయ మనోరంజని అయింది.

బాలనాగమ్మ సభారంజని మహాపతివ్రతగానీ, మనిషిగాఆమె బహుపతివ్రత! ఆమె బోగం కులంలో పుట్టింది. కన్నెరికం పెట్టిన వాడిపుట్టి నెలలు తీరకముందే మునిగింది. మళ్ళి ఎవరూ కన్నెరికం పెట్టలేదు కాబట్టి ఆమె ఖాళీగా ఉంది. పదీ పన్నెండేళ్ళ నుండి.

నాలుగోరోజు, అదే చివరిరోజు. నాటకం పూర్తి అయిం తర్వాత చలమయ్య పోయి, రంగు తుడిచేసుకొంటున్న సభారంజనిని చూచి ‘నీతో మాట్టాడాలనుంది’ అన్నాడు. ‘మాట్టాడు’ అంది.

అప్పుడు సభారంజనికి ముఫ్ఫైఏళ్ళు! దేవతలకు ఎప్పుడూ ముఫ్ఫై ఏళ్ళే వుంటాయట. ఆమె దేవతలాగా వుందనుకొన్నాడు. ఇరవై ఏళ్ల చలమయ్య. వట్టిగా అనుకోవటం ఏమిటి గట్టిగా అనుకొన్నాడు.

‘వట్టిమాటలతో ఏం ప్రయోజనం, కన్నెరికం పెడితే చూడు అంది. కన్నెరికం, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో వివరంగా తెలుసుకొందామని చూస్తే స్తూలంగా ఆమెను పోషించటం అని తేలిపోయింది.

జీవితం విచిత్రమయింది. ఏ సూత్రం ఎందుకు చెప్పబడిందీ, ఏ ఆచారం ఎందుకు పుట్టిందీ జాగ్రత్తగా ఆలోచిస్తే కారణం శూన్యంగా కనిపించదు. కొన్ని ఆవశ్యం ఆచరించదగ్గవి, కొన్ని ఆవశ్యం మార్చుకోదగ్గవీ _ వుంటాయి. కాలం మార్పువల్ల.

వివాహ వ్యవస్థలో పురుషుడి కంటే స్త్ర ఆలోచిస్తే కారణం చిన్నదిగా వుండాలన్న ఏర్పాటును గూర్చి (వాకా చలమయ్య ఆలోచించాడు. ఎందుకా కనిపించదు. పట్టింపు? స్త్రీ పెద్దదయితే ఏమి?

అనుభవంలేనివాడు ఆలోచించితే ఆ ఆలోచననుంచి వచ్చే నిర్ణయం అనుభవరహితంగానే వుంటుంది, ఆ ఏర్పాటు మార్చదగిందని చలమయ్య అనుకొన్నాడు. అందుకే ఆమె తనకంటే పదేళ్లు పెద్దదని తెలిసినా అందులో తప్పులేదని తీర్మానించుకొన్నాడు.

చలమయ్య సభారంజనిని చేపట్టాడో, ఆమె అతన్ని చేరదీసిందో తెలియదు గానీ ఆర్నెల్లు వాళ్ళిద్దరూ కాపురం చేసిం తర్వాత అతని దగ్గర డబ్బయిపోయింది.

చలమయ్య పోషణలో ఉన్నంతకాలం ఆమె. నాటకాలు ఆడటానికి పోలేదు. పోషించలేని పరిస్థితి వచ్చినప్పుడు అతన్ని వెళ్ళిపొమ్మనలేదు _ గానీ _ నాటకాలలో నటించటానికి పోతానని అడిగింది. అతనికిది ఇష్టం లేదు. అందుకని ఇంటి దగ్గర్నుంచి డబ్బు న్నీ తెచ్చే మార్గం ఏమయినా ఉంటుందేమోనని ఆలోచించాడు. ఉన్న రెండెకరాలు తండ్రి సంపాదించిన ఆస్తి, తంద్రి తదనంతరంగానీ చలమయ్యకు సంక్రమించదు. డబ్బు తేగలిగే మార్గంలేక సభారంజనిని నాటకాలలో ఏనటించటానికి చలమయ్య _ అంగీకరించక తప్పలేదు.

ఆమె ఏ వూరులోనో నాటకం అడి, అక్కణ్డుంచి మరేవూరో వెళ్ళి అలా నాటకాల యాత్ర ముగించుకొని ఇంటికి వచ్చేసరికి చలమయ్యకు పిచ్చిపట్టినంత పని అయ్యేది. ఆమె తల్లిదండ్రులు చలమయ్యను చీదరించుకోవటం, తూలనాడటం, చెప్పకూడని పనులు చెప్పటం, చేయించటం మరీ సహించలేకపోయాడు.

భీగం స్త్రీ అయినా, కులస్త్ర అయినా, మంచి గుణం ఉన్నదయినా, లేనిదయినా భర్త సంపాదన లేకపోతే, తనే సంపాదించి భర్తను పోషించవలసి వస్తే మగవాడు చులకనగా చూడబడతాడు. ఇంటా బయటా స్వజనంలోనూ, పరజనంలోనూ.

సభారంజనికి వస్తుతః మంచిబుద్ధి ఉన్నా, చలమయ్య మీద చిన్న చూపు కలగకపోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడయి మరీ ఉన్న యింటివాళ్ళయినా కన్నెరికంగా చేపట్టితే బాగుంటుందనే ఆలొచన కలిగింది.

అయితే అమాయకుడయిన చలమయ్యను వెళ్లి పొమ్మని చెప్పలేకపోయిందిగానీ అతనికి ఉండబుద్ధి కాకుండా చేయగలిగింది.

పొయ్యి సెగన వెన్నముద్ద వుంచితే కరిగిపోయినట్లు వయస్సులో పెద్దదయిన స్తీ దగ్గర మగవాడు అలా అయిపోతాడని అనిపించింది చలమయ్యకు. ఆమెకు వదిలి ఎటయినా పారిపోదామనిపించింది. కానీ వీలు కాలేదు. పోలేకపోయాడు. మనస్సు పడ మానిని పొందు విడితే మగవాడికి మనుగడ భీతావహంగా వుంటుంది. ఆమెతో జీవించనూ లేడు, ఆమెను వదిలిపోనూ లేడు.

ఎంత మంచి కుటుంబంలో పుట్టినా, ఎంత బుద్ధిగా వుందామనుకొన్నా దొంగతనం, వ్యభిచారం, తాగుడు అలవాటు అయిన స్త్రీ పురుషులు మానలేరు. ప్రమిదలో పడ్డ కీటకం, నీటిలో పడ్డ పురుగు పైకి రావాలని రాలేకపోయినట్లే అవుతుంది. హద్దులేని అనందపు అలజడికి పురుషుడికి కలిగించిన స్త్రీ నుంచి ఏ మగాడూ దూరం కాలేడు. దూరం కాగలటం సామాన్యుల విషయంలో చాలా కష్టం. నల్లమందు రుచి చూచినవాడు అది. లేకపోతే జీవించలేననుకొంటాడు. చలమయ్యకు సభారంజని మత్తుమందు అయింది. అమెను వదిలి వుండలేకపోయాడు.

అందువల్లే ఆమె కిరాయికి ఒప్పుకొంటే వెంట తనూ వెళ్ళేవాడూ. కిరాయి నటిని పట్టించుకొనే ప పరాయి మగాళ్లు చూచి పళ్లికిలించే తీరు గమనించే పరిస్థితి దాటిపోయాడు. ఆమె వూరెళ్ళిపోతే ఇంటిదగ్గరుండి పొందే అటుపోటులకంటే తన ఉంపుడుగత్తెను (ఈ మాట పైకి అనడు, ఎందుకంటే, ఆమె అతనికి ఉంప్పుడుగత్తెకాదు. అతనామెకు ఉంపుడుగత్తె. లింగవివక్ష దూరంగా వుంచుకోవచ్చు) ఊళ్ళోవాళ్ళంతా (అదే వూరయినా కావచ్చు) చూచి నోళ్లు చప్పరిస్తుంటే మురిసిపోవటం కూడా అలవాటు చేసుకొన్నాడు.

అది అలవాటు అయింతర్వాత, ఇంకేం ఇబ్బంది లేకపోయింది. నాటకంలో తెరలు లాగుతూ సృష్టిసూత్రం చేతపట్టుకు కూర్చున్నంత ఆనందం పొందాడు.

నాటక కంపెనీ సామానులు మోస్తూ ఈ బ్రహ్మాండాన్ని వరాహావతారంతో కాపాడుతున్న శ్రీ మహావిష్ణువు ననుకొనేవాడు చలమయ్య.

చలమయ్య ఈ సితికి వచ్చేసరికి సభారంజని మనస్సు ఆక్టోశించింది గానీ పోనీలే ఈ విధంగా నయినా ఉపయోగపడుతున్నాడని కష్టం కలిగించటం మానుకొంది. ఒక విధమైన జాలితో అతన్ని వెంటబెట్టుకొని వెళుతూ వుండేది.

స్టేజీమీద ఒక మూల కూర్చుని తెరలాగేతాడు చేతబుచ్చుకొని సభారంజని నటనా చాతుర్యం చూస్తూ ఆదమరచిపోయేవాడు. ‘ఎప్పుడు తెర వేయాలో, ఎప్పుడు తీయాలో నాకు తెలిసినంత బాగా సృష్టికర్తకు కూడా తెలియ’దని మహాగర్వంతో విర్రవీగిపోయేవాడు. ఆ విధంగా ఆమె నటించే బాలనాగమ్మ, మాయలఫకీర్‌ నాటకాలు – రెండూ దాదాపు ఒకటే! కొన్ని వందల ప్రదర్శనాలు చూశాడు చలమయ్య.

మంచం మీద కూర్చున్న చలమయ్య న్నీ స్టేజీ మీద తెర తాడు పట్టుకూర్చున్నట్లుగా ఆలోచన కలిగింది. ‘నేనిక్కడ కూర్చోటానికి తగను’ అనుకొన్నాడు. నాటక కంపెనీలో చీరె కావాలంటే చీరె, జాకెట్‌ కావాలంటే “క వో… జాకెట్‌, పౌడర్‌, స్పో కేక్‌, అద్దం, నూనె ర న లాట. – ఏం కావాలంటే అది ఎవరికంటే వాళ్ళకి “నేనిక్కడ అందించిన తను యింటిమీదకి తాటాకు కూర్చోటానికి అందించటం తప్పు కాదనిపించింది. తగను” ఇల్లు కప్పేవాడు చూరుగుట్టుబద్ద, అనుకొన్నాడు. “కర్ర తీసుకొని పైకి ఎక్కాడు. కొప్పుమీద కూర్చున్నాడు. చూరుకుట్టేవాడు, గోడ మీదికి దూలం మీదికి వేసిన అడ్డుతాటి బొత్తల మీద అడ్డంగా నిచ్చెన వేసుకొని తాటినార దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు క్రింద నుంచి తాటాకులు విసిరి పైకివేసి కప్పేవాడికి అందేట్టు చేస్తున్నారు బసవయ్యా మరో పనిమనిషి.

తాటాకులు అందుకొని వెలుతురు లేకుండా మూడు ఆకులు వరసకప్పి చూరుకుట్టుబద్ద గుచ్చితే లోపలున్న మనిషి తాటినార బద్ద కన్నంలో పెట్టటం పైవాడు రెండోకుట్టు వేయటం, లోపలివాడు ఆ రెండు కొసలూ పట్టుకొని ముంతతో నీళ్ళు ముంచబోతే పేరమ్మ ‘నాకిట్టాయియి. అంటూ ముంత తీసుకుంది.

ఇంటి లోపలికిపోయి, ‘నార బాగా బిగలాగు’ అంటే వెలా తెలా చూచి, ‘నే యింతవరకి జెప్పిచ్చుకోలా. ఇంతకంటే బిగలాగే వాడెపుడో చెప్పమను జూత్తా’ అన్నాడు చూరుకుట్టేవాడు.

బైటికి వచ్చి కొప్పుమీదికి చూస్తూ ‘ఆ కొసర మందంగా ఏయ్‌! చాలా ఆకు మిగిలిపోద్ది అన్నాడు చలమయ్య. ‘ఏత్తా! ఏత్తా! ఒరేయ్‌ బసవయ్యా, ఎవుర్రా అది!

‘నేన్నీకేడ గుర్తుంటాన్లే, కప్పటం కానిచ్చి దిగిరా! మాట్టాడుకొందాం. చలమయ్యనులే! బాగా ఊరిపోయావుగా! ఒరే సిన్నోడా! నేనింకా గుర్తులారా?”

“ఏంది? నువ్‌ సెలంవయ్యవా? ఎట్టా! ఏందిట్టా అయ్యా ఏనిగింత మనిషివి పీనిగయిపోతివే! ఎప్పుడోచ్చా!’ సిన్నోడు ఆనందం పొందాడు చలమయ్యను చూచి. చలమయ్య మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చున్నాడు.

ఆ యింట్లో తను పరాయి వాడులాగ అయిపోయాడు. సొంత మనిషిలా ఎవ్వరూ చూడటం లేదు. ఎవరూ పని చెప్పటం లేదు. అందరూ దూరంగా పొమ్మంటున్నారు. అలా అనటం గౌరవంతో అయినా భరింపలేకపోయే స్థితిలో ఉన్నాడు. జాలిపడుతున్నారేమో అని అనుమానం కలిగితే నిలద్రొక్కుకోలేకపోతున్నాడు.

చేలో కలుపు మొక్కలు పెరిగితే పీకిపారేస్తారు. తను అక్కడ కలుపుమొక్క!

అయితే పీకిపారేయ వీలుగాని కలుపుమొక్క! ఆ చేలో పుట్టి పెరగటానికి కాదుగానీ ఉంటానికి వీలుగాని మొక్క! ఈ మొక్క పెరిగి పెద్దయి చేనులో కొంతభాగం ఆక్రమించుకొంటే, ఆ నీడన పైరుపెరక్కుండా ఎలా వుంటుంది? చలమయ్య ఆలోచనలు శాఖోపశాఖలుగా విస్తరిల్లిపోతున్నాయి.

ఎంతో ఆశతో వచ్చాడు చలమయ్య. తన వాళ్లు అందరూ వూళ్ళో వున్నారనుకొన్నాడు. ఎవరూ తనిని గుర్తించలేదు. సొంతవాల్భు కూడా ఎందుకో పరాయివాడుగానే భావిస్తున్నారు. ఆ యిల్లు తను కట్టించలేదు. అయినా పని చేస్తానంటే వద్దనటం ఏమిటి? తను తగడా? అన్నం పెట్టారుగదా, ఆ మాత్రం పని చేస్తానంటె వద్దనటం ఎందుకు?

చలమయ్యకు ఈ ఇరవై ఏళ్లలో జీవితం రుచిచూపిన అనుభవం గుండెపై వేసిన ముద్ర ప్రభావం తొలగిపోలేదు. తొలగిపోయేసరికి ఎంతకాలం పడుతుందో ఎంత పరిమామం తెస్తుందో తెలుసుకోలేకుండా వున్నాడు.

తను చూచిన జీవితంలో ఎవరు ఎవరికి ఏ విధంగా ఏమిచ్చినా దానికి తగిన ప్రతిఫలం తను చూచిన ఆశించటం కళ్ళారా చూశాడు. అటువంటి ఈ లోకంలో వూరికే మంచంమీద కూర్చో అనే మనుష్యులు ఎదురుగా వుంటే అది మూమూలు లోపం కాదనుకొన్నాడు. మంచి లోకం అయితే ఆ మంచి ఏదో తెలియటం లేదు. చెడులోకం అనుకోటానికి గుండె చాలదు. అనుకొంటే. జీవితంలో ఓటమి! పరాజయం!

చలమయ్య పరిస్థితులకు లొంగిపోవటం ఇరవై ఏళ్ళనాడే రుచిచూశాడు. ఆ తుచి తన రక్తంలోనే జీర్లించుకుపోయింది. రుచి మరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని, లొంగిపోవడానికి వీలు లేకపోతే చలమయ్యకు ఏడుపు వస్తుంది.

చలమయ్యది ఒక విధమైన బానిస మనస్తత్వం. అతను తిరుగుబాటు చేయలేడు. ఎంత చెప్పితే అంత! దేనికయినా లొంగిపోతాడు. ఆ యింటిలో అతనికి ఎన్ని పనులు చెబితే అన్ని చేసేవాడు. వాళ్ళు చెప్పటం లేదు. అందుకే అతనికి పిచ్చెక్కినట్టుంది.

సభారంజని ఎన్ని పనులో చెప్పేది. అన్నీ చేసేవాడు. ఆమె ఆనందించేది. అందువల్ల అతనెన్ని పనులయినా ఆమె ఆనందం కోసం చేయగలిగేవాడు. చలమయ్యకు ఇష్టం కలిగితే ఏ పని అయినా చేస్తాడు. అలా చేశాడు. ఇప్పుడిష్పపడే ఇక్కడికి వచ్చాడు. ఏ పని అయినా చేద్దామనుకున్నాడు. చేయనివ్వటం లేదు., అందుకే బాధగా ఉంది.

భర్త తనను దిక్కులేని పక్షిని చేసి వెళ్ళిన సంవత్సరం అంతా భయంకరంగా కుమిలిపోయింది. పేరమ్మ. పడినపాట్లు గుండెమీద రంపపుకోతలయ్యాయి. ఎప్పటికయినా భర్త వస్తాడని ఎదురుచూడడంలో ఉండే ఆనందం, అది నిరాశ అయితే కలిగే బాధ దుఃఖం పేరమ్మ అపరిమితంగా చవి చూచింది.

పుట్టింటికి వచ్చి వుండమని తల్లిదండ్రులు పోరు పెట్టారు. ఆ మాట ఆలించలేకపోయింది. అత్తమామలు తమ దురదృష్టం తలచుకొని కుమిలిపోవడం తప ప్ప పేరమ్మను ఓదార్చలేకపోయారు.

రెండేళ్ళ పిల్లవాణ్లి బసవయ్యను అత్తింటివారిలో ఉంచివస్తే మరో సంబంధం వుంది, పెళ్ళిచేస్తామని, కూతురు కడుపుకోత భరించలేమని, తల్లి తండ్రులన్నారు. తల తీసేసినట్లయింది. కొడుకును వదిలి వుండలేననుకొంది. అందుకే ఉన్న ఇల్లు వదిలిపోలేక పోయింది.

ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేసరికి అత్తమామలకు కనువిప్పు కలిగింది. ఉన్న రెండెకరాల పొలం మనవడి పేర వ్రాసేశారు. ఆ పైన సంవత్సరం అయినా తిరకముందే మామ తగించాడు. కూతురు దగ్గరకు వెళ్ళిపోయింది అత్త. ఎప్పుడయినా చుట్టం చూపుగా ఆమె రావటంతప్ప, ఆమెతో ఎక్కువ సంబంధం లేకుండా పోయింది.

బసవయ్య కోసం పొలం సంరక్షించుకోవలసి వచ్చింది పేరమ్మకు. కొడుకుని రొండిమీద పైటకొంగుతో కట్టుకొని పొలం పనులు చేసుకోసాగింది. ఆమెకు భర్త దూరమయ్యాడూ కానీ అదృష్టం కాదు.

సభారంజని దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతూ ఉన్న రోజుల్లో ఒక రోజు, నాటకం అయిం తర్వాత, తెల్లవారుజామున నిద్రలో భయంకరంగా నవ్వుతున్నాడు చలమయ్య. మాయలఫకీరు నవ్వు.

అతన్ని నిద్ర లేపింది. మెలకువలోనే నవ్వుతున్నాడు. ‘నీకేమన్న పిచ్చి పట్టిందా ఏంటి/” అంది. ఇంకా నవ్వుతున్నాడు.

ఓయ్‌ సంగూ! అంటున్నాడు చలమయ్య ఫకీరులాగా. సంగు సంభాషణలు వల్లించింది. బాలనాగు మాటలు పలికింది సంభారంజని మాయలఫకీరు ధోరణి కొనసాగించాడు చలమయ్య.

ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అమాంతం కౌగలించుకొంది. ఎత్తి చాపమీద పడేసిమ్హి. కుదేలుపడి కూర్చుంది. చలమయ్యను ఎంతగానో మెచ్చుకుంది. ఎందుకయినా పనికొస్తావంది. ఇంకా ఏమేమో అంది. అనరాని మాటలన్నీ అంటుంటే వింటూ ఉన్నాడు చలమయ్య.

ఆ తర్వాత ఒకరోజు, ఎవరో తమ నాటకం కంపెనీలో సంవత్సరం కాంట్రాక్టు సంతనం చేయమంటే చేయనంది సభారంజని. ‘ఏం’ అంటే నా భర్త మాయలఫకీరుగా ఉన్న నాటకంలోనే బాలనాగమ్మ వేషం వేస్తానంది.

మాయలఫకీరు నాటకంలో రెండు ముఖ్యమైన _ పాత్రలకు _ వాళ్ళిద్దరూ సంవత్సరం కాంట్రాక్టులతో సంతకం ఆ రోజే అతని జాతకంలో గొప్పమార్చు. కొంతకాలం ఒక రకంగా, మరికొంతకాలం మరో రకంగా. చలమయ్యను. చూచిన సభారంజని ఇప్పుడు ‘మావారు’ అనటం మొదలుపెట్టింది.

చలమయ్య మొదటి ప్రదర్శనకు ముందు బోలెడంత చెమట కక్కేసి రంగస్థలం మీద నవ్వేశాడు. ఆ నవ్వుకు పసిపిల్లలు ఏడ్చారు. నిండునెలల ఆడవాళ్ళకు ప్రసవం కాకుండా పోలేదు. మాట్లాడితే నవ్వేశాడు. రంగస్థలం మీద అల్లకల్లోలంగా గగ్గోలెత్తి పోయేటట్లు నవ్వేశాడు. నవ్వి నవ్వి ప్రక్కటెముకలు పట్టేశాయి.

నాటకం ముగిసిన తర్వాత సభారంజని అతని కాళ్ళు వత్తింది. వళ్ళు పట్టింది. చెమట తుడిచింది. ఎన్నోసేవలు చేసింది. స్వర్గంలో వున్నాననుకొన్నాడు చలమయ్య.

బ్రహ్మాండమయిన ఏక్షను గొప్ప ప్రదర్శన! కాంట్రాక్టరు, ఏక్టర్లను సాధారణంగా మెచ్చుకోడు. అసాధారణంగా మెచ్చుకొంటాడు. చలమయ్యను మెచ్చుకొన్నాడు. ఆ నాటక కంపెనీ ఆంధ్రదేశంలో అన్ని మూలల్లో ప్రదర్శనలిచ్చింది. గొప్ప ట్రూపు అని పేరు వచ్చింది.

చలమయ్యకు _ బాధలు తప్పాయి. అంవ్రైర్రా” ఇదివరలో ఆకలి కడుపు. ఇప్పుడు అన్నం తినేందుకు కాళీలేని కడుపు. ఇదివరలో చిరిగిన బట్టలలోంచి దిక్కులు చూస్తుండే శరీరం, ఇప్పుడు క్రొత్త బట్టలతో అంతర్ముఖమయింది.

నాటకంలో కస్సుబుస్సుమనే బాలనాగు – సభారంజని – జీవితంలో కుక్కిన ‘పేనయింది. గ్రీన్‌ రూంలో బాలనాగు, మాయలఫకీరు సరదాలు పోయేవాళ్ళు రంగస్థలంలో ప్రేయసిగా నటించే సంగు నిజ జీవితంలో ఈర్షపడసాగింది.

చలమయ్యను చేపట్టకముందు చిల్లరగా తిరిగిన సభారంజని, ఆ మధ్య మనస్సును అటూఇటూ వూపుకొన్న సభారంజని ఇప్పుడు లెక్క ప్రకారం సహధర్మచారిణి అయింది. వెన్నపూస కరిగిపోయే, వెన్నుపూస విరిగిపోయే ధోరణి దూరమయిపోయింది. చలమయ్య గొప్ప నటుడయిపోయాడు.

అయిదేళ్ళలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ధన సంపాదన బాగుంది. గుంటూరులో మంచి ఇల్లు తగినంతగా – సంపాదించుకున్నారు. చలమయ్య చీకటి బ్రతుకులో ఉషారాగం ప్రసరించింది. అప్పుడతను చింతలు లేని చిద్విలాస పురుషుడు.

అతని అడుగుజాడల్లో సభారంజని. ఇప్పుడు ఆమె చెప్పినట్లు వింటుంది. చేయమన్నట్లు చేస్తుంది. భర్తే దైవంగా భావించుకొనే స్థితికి వచ్చింది. అతన్ని విడిచి ఉండలేనని నమ్మింది. తనకంటే మంచి నటుణ్లి తను తయారు చేసుకొన్నానన్న ధీమా కూడా ఆమెకు కలిగింది.

‘ఆం ఏంది కత? ఏడుండావ్‌? ఇంతకాలంవేంశావ్‌ ఏంది జెప్పు! సిన్నోడు దగ్గరగా వచ్చి చూరుకుట్టుబద్ద నేలమీద పడుకోబెట్టి, చుట్ట ముట్టించుకొన్నాడు.

ఇల్లు కప్పటం పూర్తయిపోయింది. మిగతా పనివాళ్ళు కూడా వచ్చి మంచం దగ్గర కూర్చున్నారు. పొలిగట్టె తీసుకొని ఇంటిచుట్టూ వూడుస్తున్నాడు బసవయ్య. సూర్యుడు కందిపోయిన ముఖంతో పడమట కొండల్లోకి దిగిపోయాడు.

పేరమ్మ సిన్నోడు అడిగిన ప్రశ్నలు వింది. “అన్నా! యెందుకామాటలు. లేనిపోని మాటలు!’ అంది.

సిన్నోడేమీ మాట్లాడలేదు. చలమయ్య జవాబుచెప్పలేదు. పేరమ్మకు తనమీద కోపం వుందనిపించింది. తనేం చేయాలో తెలియలేదు.

బసవయ్య సీతమ్మ పేరమ్మ | ముగ్గురూ ఒకచోట చేరి ఏదేదో మాట్లాడుకొంటున్నారు. ఏం మాట్లాడుకొంటున్నారో తెలియదు. తను అక్కడికి వెళ్ళాలనిపించింది. వెళ్ళటం బాగుండదు. ఆలోచన పిలవని పేరంటం అవుతుంది. తనతో వాళ్ళు అంతరంగికంగా మాట్లాడరు! ఒకటే హృదయం, ఒకటే ఆలోచన! తను వేరుగా ఎడంగా పరాయి వాడులాగా సొంత యిల్లు వంటి చోటే ఉండలేననుకొన్నాడు.

తనను గూర్చి ఏమయినా చెప్పుకొంటున్నారేమో ననిపించింది. ఏం చెప్పుకొంటారు? ఇంతకాలం యిల్లు గుర్తించని మనిషి ఇప్పుడు ఇక్కడెందుకు, వెళ్ళిపొమ్మని చెప్పబోతున్నారేమో! తన ఉనికి అభ్యంతరకరంగా ఉందేమో!

వాళ్లు ముగ్గురూ మూడు కోణాలు, మూడు బాహువులు. వాళ్ల కలయికతో త్రికోణం ఏర్పడింది. అందులో మరో కోణం, మరో బాహువుకు అసమబాహు త్రిభుజంలో చోటులేదు. ఒక బాహువును మరొక బాహువు బలంగా ఆకర్షిస్తూ వుంది. అందులో తనకు చోటులేదు. చలమయ్య హృదయం భయం పొరలలో చిక్కుబడిపోతూ ఉంది.

వాళ్ళలో తనూ చేరితే ఏర్పడే చదరం అన్ని విధాలా బాగానే ఉండవచ్చు. అయితే ఆ అవకాశం ఎలా కలుగుతుంది? బసవయ్యకు తనంటే ఇష్టం లేనట్టుంది. సీతకు ఇష్టమయినా భర్తమాట జవదాటలేకపోవచ్చు. తన భార్య కూడా ఇంతకాలంగా ఉన్న కొడుకుని ఇప్పుడు తనకోసం దూరం చేసుకోలేదు. దూరం చేసుకో మనటం కూడా న్యాయం కాదు.

ఆమె కొడుకుకోసం అష్టకష్టాలు పడింది. తన కోసం బహూశా ఎదురుచూస్తూ బాధలు ఓర్పుతో దిగమింగి ఉంటుంది. అటువంటివాళ్ళ సంబంధం తను పాడుచేసే పరిస్థితి రాకుండా ఉండాలి.

ఒక్కటే మార్గం! ఒక్కటే మార్గం! తన్నిక్కణ్లుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ వీళ్ళ ఎదుటకు రాకూడదు. అలజడి సృష్టించకూడదు. అయితే ఈ స్టితిలో తనెక్కడ పోగలడు? చచ్చిందాకా ఇక్కడే. _ ఎలాగయినా బ్రతుకుదామనే ఆశతోవచ్చాడు. ఇప్పుడేం చేయటం?

చలమయ్య ఆలోచన తాటాకుల మంట! చుర చుర త్వరత్వరగా మండి చప్పున, ఆరిపోయి ఆ పైన నిప్పుజాడ కూడా లేకుండా అయిపోయే మంట! మంటలోనే ఏమైనా చేస్తే మళ్లీ దానికి తిరుగుండదు. మంట తగ్గితే మళ్ళీ మంట పుట్టటం సామాన్యంగా త్వరగా జరగదు.

వాళ్ళ మాటలు పూర్తయ్యాయి. పేరమ్మ బొడ్డోనుంచి తాళం తీసి ఇచ్చింది. బసవయ్య లోపలికి పోయి డబ్బు తీసుకువచ్చాడు. ముగ్గురు పనిచేసినన వాళ్లకు ఇచ్చాడు. వాళ్ళు వెళ్లిపోయారు.

బైట ఉన్న చిన్న సామానులు అడవాళ్ళు ఇంట్లో పెడుతున్నారు. పెద్ద సామానులు, బసవయ్య పెడుతున్నాడు. తను కూడా వెళ్ళి వాళ్ళకు సహాయం చేద్దామనుకన్నాడు. మళ్ళీ ఏమంటారోనని వూరుకొన్నాడు.

మెట్టుబల్ల బసవయ్య ఒక్కడే లోపల పెట్టలేకపోతున్నాడు. చలమయ్య మంచం దిగి వెళ్ళి ఒక కోపు పట్టుకొన్నాడు. ఇద్దరూ లోపల పెట్టారు. దానిమీద బియ్యం బస్తా, వడ్ల బస్తాలు మేటేస్తున్నాడు బసవయ్య. చలమయ్యకు ఆనందంగా వుంది. తను పనిచేస్తే కొడుకు ఏమీ అనలేదని ఆనందం అపరిమితంగా కలుగుతూ ఉంది.

బరువు పని చేయటం వల్ల గుండెలో పోటు పుట్టింది. కణేల్‌ కణేల్‌ మని దగ్గి ఉమ్మి వేశాడు. ఉమ్మిలో రక్తపు జీర కనిపించింది. సీతమ్మను పిలిచి మంచినీళ్ళు తీసుకొని పుక్కిలించాడు. ఆమె ఉమ్మిలో ఎర్రదనం చూచింది. అత్తతో చెప్పింది.

ఆమె వచ్చి కళ్ళె చూచి వణికిపోయింది. అప్పుడు చలమయ్య గటగటా నీళ్ళు తాగుతున్నాడు. అతనికొక క్రొత్త భయం కలిగింది. ఈ రోగిష్టివాడు ఇక్కడెందుకు అంటారేమోనని.

ఏమయినా వాళ్ళు పొమ్మనక ముందే వెళ్ళిపోవటం బాగుంటుందనిపించింది. దిక్కు తోచటం లేదు. ఎక్కడికి వెళ్ళేటట్లు?

‘ఏవయిందేంది?”

పేరమ్మ అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది.

“ఏం కాలేదు!

చలమయ్య మంచం మీద కూర్చున్నాడు. ఆమె చుట్టింటిలోకి వెళ్ళి పోయింది.

మనస్సంతా వ్యాకులత చెంది సంచలించి పోతున్నాడు చలమయ్య. జేబు తడిమి చూచుకొన్నాడు. భద్రంగా ఉంది పర్సు.

భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకొని వర్తమానంలో జీవితం గుండెలమీద కుంపటి వేసుకొని పేరమ్మ గతం గడిపివేసింది. ఇప్పటికి బ్రతుకులో నిలకడ చిక్కింది.

కడచినేడు కొడుక్కు పెళ్ళి చేసింది. అంతకు మూడేళ్ళ ముందు రెండెకరాల పొలం కొనుక్కొంది. పదేళ్ళ ముందు పాతయిల్లు అచ్చిరావడం లేదని స్థలం మార్చి రాతిగోడల ఇల్లు కట్టించుకొంది.

ఇంత జీవితం వెనుక భగవంతుడు నుదుటిమీద కుంకుమబొట్టు క్రింద వ్రాసిన రాతలో తిరిగిన వంకర్లుమాటున సాఫీగా వున్న అదృష్టంకాక, ఆమె శరీరం నుంచి కణం కణంగా స్రవించిన చెమటబొట్లు విలువ ఉంది.

పుట్టినింటివాళ్ళూ, _ మెట్టినింటివాళ్ళూ. దూరం అయితే, బ్రతుకు అర్థశూన్యంగా నిస్సారంగా ఎదురయితే, గుండెను కూడదీసుకొని, పట్టుదలను వెంటదీసుకొని ఆమె నడచిన బాటలో అదృష్టం పండింది.

తన భర్త తనకు కాకుండా పోయాడని చాలాకాలం చింతించింది. మళ్ళీ చూడగలుగుతాననే ఆశను ఎన్నో ఏళ్ళ క్రితం వదిలేసింది. బ్రతికివున్నాడో గతించాడో తెలియని భర్తకు గాజూ పూస ఇవ్వాలో లేదో తెలియక ఊరుకొంది.

వాటికీనాటికి సార్ధకత కలిగిందని తెలిసి ఆనందించింది. ఆమెకు భర్తృ సంబంధి అనుబంధం వ్యక్తం చేసుకోవడం తెలియదు.

పసితనంలోనే పెళ్ళయింది. తల్లయింది. భర్తకు దూరమయింది. మాట్లాడటం ఎట్టాగో ఆమెకిప్పుడు అర్థం కావడం లేదు. ఏనాడయినా భర్త కనిపిస్తే గుండెలో గూడుకట్టుకొన్న సొద అంతా చెప్పుకొందామనుకొంది. తీరా భర్త ఎదుటికి వస్తే ఎలా నిలబడాలో కూడా అంతుబట్టడం లేదు.

భర్త వరుస చూస్తుంటే భయంగా వుంది. ఎలాగో ఉండే మనిషి ఇలాగయిపోయాడు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకొన్నవాడి మాదిరిగా పిచ్చిగా చూస్తున్నాడు. ఏం అడిగితే ఏం అనుకుంటాడో, ఏం అడక్కపోతే ఏం అనుకుంటాడో తెలియకుండా వుంది.

బసవయ్య దుడుకుమనిషి! మాట్లాడే తీరు తెలియనివాడు. వాడి తరహా కూడా ఉదయం నుంచి చిత్రంగానే ఉంది. తండ్రీ కొడుకులకు మధ్య ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయో! కొడుకు ప్రయోజకుడయ్యాడు. భర్త అనారోగ్యంగా ఉన్నాడు.

తండ్రీ కొడుకుల మధ్య పొరపొచ్చాలొస్తే బ్రతుకగలిగిన కొడుకు కంటే బ్రతకలేని భర్త తనకు ముఖ్యం కాదా? పేరమ్మ ఆలోచనలు అంతు లేకుండా ఉన్నాయి. దరీదాపు లేకుండా సాగుతున్నాయి.

అవాంతరాల అగిపర్వతం పగుళ్ళూ ఆటంకాల కీకారణ్యాలు. అలజడుల తుఫానులు అధిగమించి ఆపై జీవితం, సభారంజనితో సౌఖ్యంగానే గడిపిన చలమయ్య వయస్సు పై బడుతున్నకొద్దీ దూరమవుతున్న కళాజీవితం తీరుతెన్నులు అర్థం చేసుకోసాగాడు. సభారంజని యౌవనంలో ఉన్నప్పుడామె ఆడిన నాటకాల కున్నంత విలువ తర్వాత లేకుండా పోజొచ్చింది. పది పన్నెండేళ్ళు ఆమెకు అంతో ఇంతో రాణింపు మిగిలే ఉంది, ఆమెతో తన జీవితం ప్రారంభించిన తర్వాత.

ఆ పైన క్షీణించిపోయింది. చలమయ్యకు కొంతలో కొంత ఆదాయం వుండేది. అది కుటుంబం ఖర్చులకు సరిపోతూ వచ్చింది. మరీ మూడేళ్ళ నుంచి ఏమీ రాబడి లేకుండా పోయింది. ఎవరూ నాటకాల కాంట్రాక్టు అడగటం లేదు. చిన్న పాత్రలయినా ఇవ్వటం లేదు. దీనికి తోడు గుండె ర్‌ బలహీనత ఒకటి. ఒకళ్ళిద్దరు డాక్టర్లు టి.బి. అన్నారు. మరికొందరు విశ్రాంతి తీసుకోమన్నారు. _ విశ్రాంతి అవసరం నిజమే కావచ్చుగానీ బ్రతకవలసి ఉండటం అనేది అంతకన్నా నిజం! ఎలా బ్రతకటం! సంపాదించిన రోజుల్లో నాలుగు చేతులతో ఖర్చు పెట్టుకున్నారు. ఆ యిల్లయినా లేకపోతే వల్లకాడు కూడా వుండనిచ్చేది కాదని చెప్పే అవకాశం లేదు. వాళ్ళకు ఇప్పుడొక్క చేతిలో ఖర్చుచేసుకోటానికి దాచుకున్న కొద్దోగొప్పో చాలీచాలకుండా అయింది.

జీవితంలోని పూర్వభాగం, రంగస్థలం మీద మాయలఫకీరుగా నటించటంతో సరిపోయింది. ఉత్తరభాగం బిత్తరపోయేటట్టు చేస్తూఉంది. నాటకంలో ప్రక్కటెముకలకు డొక్కలు అంటుకుపోయేట్టు నవ్వి, జీవితంలో ఏడ్పు మిగుల్చుకొన్నాడు చలమయ్య.

డాక్టర్లు చెప్పిన సలహా తను పాటించాడో, కంట్రాక్టర్లు పాటించేట్టు చేశారో చెప్పటం కష్టమేగాని, చలమయ్యకు విశ్రాంతి చిక్కింది. చిక్కిన విశ్రాంతి అక్ష రాలా మిగలలేదు. స్థలితం కాసాగింది.

సభారంజనితో ఇరవై ఏళ్ళ దాంపత్య జీవితం మీద దేవుడు శీతకన్ను వేశాడో దయా దృక్కులు ప్రసాదించాడో గానీ సంతానం లేకుండా చేశాడు. మొదట్లో పిల్లలూ గోలా అక్కర లేదనుకొందిగానీ, క్రమక్రమంగా పిల్లలు కలిగితే బాగుండునని సభారంజని కోరుకున్న కోర్కె తీర్చటానికి దేవుడికి టైం లేకపోయింది.

నాలుగునెలల క్రితం ఆమెకు టైఫాయిడ్‌ జ్వరం వస్తే చలమయ్య కంగారుపడలేదు. ఆమెకు ఎప్పుడూ ఏ జబ్బూ రాలేదు. మంచి ఆరోగ్యం అని చలమయ్య నమ్మకం. తనను గూర్చే భయపడుతూ వుండేవాడు.

ఆమెకు వచ్చిన జబ్బు సామాన్యంగా రాలేదని తెలిసింతర్వాత హాస్పిటల్‌లో చేర్పించాడు. తనకు చేతనయిన సహాయం చేశాడు. డబ్బు వెనుకా ముందూ చూడకుండా అప్పోసప్పో చేసి తెచ్చి ఖర్చు పెట్టాడు. అయితే మానవ ప్రయత్నం వ్యర్థం అయింది.

ఇరవై ఏళ్లు తనతో జీవించి, మనోవాక్కాయ కర్మల తనకు భాగస్వామిని అయిన సభారంజని చితి ముట్టిస్తూ చలమయ్య భగ్గున మండిపోయాడు. జీవితం అర్ధరహితంగా శూన్యంగా గోచరించింది. ఆమెకు సంస్కారం చేసి చూస్తే లోకం విశాలంగా కనిపించసాగింది.

ఎప్పుడూ మబ్బులు చూచి ఆనందించని చలమయ్య ఆమె కాష్ట్రంలోంచి వచ్చిన పొగలే ఆ మబ్బులనుకొని ఆకాశం అంతటినీ ప్రేమించగలిగాడు.

తిరిగాడు. ఏం చేయాలో తెలియలేదు. రంగస్థలం మీద నటించేటప్పుడు సదస్యులు కొట్టిన చప్పట్లు ఆనందంతో వెర్రిగా స్వీకరించిన చలమయ్య జీవితంలో బ్రతుకుతున్నప్పుడు అప్పులవాళ్లు కొట్టే చప్పట్లు దీనంగా పిచ్చిగా అర్థం చేసుకున్న చలమయ్య తప్పనిసరయి ఇల్లు తెగనమ్మి, అప్పులుతీర్చి మిగిలిన డబ్బు పర్సులో పెట్టుకొని నగరం అంతా ఇల్లుగా భావించుకొన్నాడు.

మనిషికి _ విశాలపరిధి భయం _ పుట్టిస్తుంది. విస్త్పతి చూచి పిచ్చివాడయిపోతాడు. అందుకే చిన్న పరిధి ఏర్పరచుకొంటాడు. అందులో నూతిలో కప్పలాగా జీవిస్తాడు. మనిషి పెరిగితే పరిధి పెరిగినా చింతలేదు కానీ, మనిషి యధాపూర్వకంగా వున్నప్పుడు పరిధి విస్తతం అయితే భరించలేడు. చలమయ్య జీవితం అలాగే అయిపోయింది. నగరంలో ఉండలేకపోయాడు. వందలువేలు, లక్షలు మంది జనంలో జనులమధ్య ఒంటరివాడైపోయాడు. ఒంటరితనం అతన్ని నింపివేసింది.

నాది, నాకు, అనే తత్తం ప్రతి మనిషికీ సహజం. అటువంటి కోర్కెలు. లేకపోతే మనిషి బ్రతికి వున్నా చనిపోయినవాడితో సమానం. చలమయ్యకు ఆర్థికంగా చనిపోవటం ఇష్టం లేదు. నాకీ లోకంలో ఏముందని, ప్రతిమనిషీ అంతా శూన్యంగా ఎక్కడా ఆదరణ లేక, నమ్ముకొన్న పడవ సముద్రంలో మునిగిపోతే జీవితం నిస్సారంగా కనిపిస్తే, తుదిమొదళ్ళు లేని శూన్యత ఎటుచూచినా గోచరమయితే సగవంతుడే గుర్తుకు వస్తాడు. చలమయ్యకు దేవుడు గుర్తుకు వచ్చినా స్కృతిపథంలో మెరుపు మెరిసినట్లు మరపు మేఘాల మధ్య భార్య కనిపించింది.

ఇంతకాలం గుర్తురాని భార్య, కొడుకు ఆ సమయంలో జ్ఞప్తికొస్తే చలమయ్య కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏ వూరునుంచో ఏ వూరుకో పోతున్న ఏ బాటసారో పడుకోవటానికి చోటు ఇవ్వమంటే ఇవ్వగలిగే యింటిలో, ఆడుక్కునే బిచ్చగాడికి ఇంత అన్నం పెట్టగలిగే ఇంటిలో తనకు చోటు దొరకక పోతుందా అని గంపెడాశతో వచ్చాడు చలమయ్య.

ఊళ్ళోవాళ్ళు పేరమ్మను ఎన్ని వరసలతో పిలుస్తారో అన్ని సంబోధనలతో వచ్చారు చలమయ్యను చూచిపోదామని. ఇరవై ఏళ్ళయినా లేనివాళ్ళు అంతమంది చలమయ్యను ఏం చూస్తారు? అంతా వేలం వెర్రిగా వుంది. పసివాళ్ళు గుంపులు గుంపులుగా పోగయ్యారు.

సిన్నోడు వూళ్ళోనుంచి పోతూ కనబడ్డ వాళ్ళకళ్ళా చలమయ్య వచ్చాడని చెప్పుకొంటూ వెళ్ళాడు. ‘ఎవురా సెలంవయ్య, ఏంవిటా కతాంవటాని’ ఎవరయినా అడిగితే వివరాలతో సహా అంతా పూసగుచ్చినట్లు ఆ చెవినీ ఈ చెవినీ వేస్తూ వెళుతున్నాడు.

కొందరికి వింతగా ఉంది. పిల్లలు మాత్రం చలమయ్య ను సర్కస్‌లో మృగాల్ని ఆడించేవాడి చేతిలోని కోతిని చూచినట్లు చూస్తున్నారు.

పసివాణ్ణి, అమాయకురాలిని, దిక్కులేని తల్లిదండ్రుల్ని వదిలి నీ సుఖం నువ్వు చూచుకొంటూ దేశాల వెంట పోవటానికి నీకు కాళ్ఫెట్టా ఆడాయనీ,ఎక్కడికి పోయావు. ఏం చూశావు, ఇంతకాలం ఎన్ని బాధలుపడ్డావోననీ, ఇప్పుడా యిల్లు గుర్తుకొచ్చింది, వీళ్ల కన్నీళ్లు నువ్వు చూళ్ళేదు గానీ, చూస్తే గుండె తరుక్కుపోయేదనీ ఎవరెవరో ఏమేమో పలికారు. అన్నీ విన్నాడు చలమయ్య. కొన్నింటికి జవాబు చెప్పాడు. కొన్నింటికి తలవంచుకున్నాడు, అన్నింటికీ దుఃఖపడ్డాడు. ఎవరెవరో వస్తున్నారు. ఏమేమో అంటున్నారు, వెళ్ళిపోతున్నారు.

జనం రాకపోకల రద్దీ తగ్గిం తర్వాత సీతమ్మ వచ్చి ‘నీళ్ళు తొరిపా. చెట్టు క్రింద బండదగ్గర పెట్టా ఇదుగో కండవా’ అంటూ టవల్‌ అందించింది. చలమయ్య స్నానం ముగించి వచ్చాడు. కొడుకుపంచె కట్టుకున్నాడు. పైజామా లాల్చీ ఇంట్లో భద్రంగా దాయమనీ, ఇందులో డబ్బుందనీ భార్యకు చెప్పాడు. అంతలో బసవయ్య స్నానం పూర్తిచేసుకొని వచ్చాడు. ఇద్దరికీ చుట్టింటిలో సీతమ్మ అన్నం వడ్డించింది. ఎవరితో ఎక్కువగా మాట్లాడలేదు.

పేరమ్మ పంచపాళీలో మంచం వేసింది. దుప్పటి పరిచింది. దిండు వేసింది.

చలమయ్య మంచం మీద కూర్చున్నాడు. బీడీ ముట్టించుకొన్నాడు.

పైపంచె భుజంమీద వేసుకొని ‘అటు బోయెత్తా’ నంటూ బసవయ్య వెళ్ళాడు. అతను ముభావంగా ఉన్నాడు.

బీడీ పారేశాడు చలమయ్య. పేరమ్మకు తనంటే తిరస్కారం లేదు. సీతమ్మకు ఎంతో సంతోషంగానే వుంది. బసవయ్య ధోరణి మాత్రం అంతు బట్టలేదు.

తెగని ఆలోచన త్రాళ్ళతో జీవితం బిగదీసుకొంటుంటే ఎప్పుడో నిద్ర వచ్చి కనురెప్పలపై వాలింది. కునుకు పట్టింది. త్రుళ్ళిపడి మేలుకొనేసరికి చుట్టింటిలోంచి మాటలు వినబడుతున్నాయి. ఆ కంఠస్వరాలు చలమయ్య గుర్తుబట్టాడు. పేరమ్మ. బసవయ్య! తల్లీ కొడుకు!

‘ఎవుడాడు? నిజం సెప్పు?”

‘మీ నాయనరా! మీ నాయన!

‘వూళ్ళో వాళ్ళంతా ఆడు సెలంవయ్య గాడాంవటంటున్నారే!’
“ఎవుళ్ళుతోనో ఏందీ? నేనెబుతుంటినిగా మీ నాయనని!’
‘నేన్నమ్మను!

“ధి! నోర్ముయిరా! ఏందా కూతలు!”

‘ఆడెవడో నిజం సెప్పు!

‘ఏవిటిరా నేన్నీకు నిజం సెప్పేది! సెబుతుంటే తెలియటంలా?

ఆశలన్నీ పోగ్రై పెరిగిన కొడుకు కన్నతల్లిని అనుమానిస్తే అంత కంటే ఘోరం మరేం వుంటుంది? పేరమ్మ తల్లడిల్లిపోయింది.

‘నిజం సెప్పు? ఎవుడమ్మాడు?

‘అయ్యో దేవుడా? నీకెట్టా సెప్పేదిరా? మీ నాయనరా! సత్తె పెమాణంగా మీ నాయనరా! ఎందుకురా నన్ను పీడిత్తా!’

“ఆబ్లెవుణ్లో దీసుకొచ్చి యింటోబెట్టా వాంవటాని అంటన్నారందరూ! తలెత్తుకోలేక సచ్చానంటే నమ్ము! అసలేందీ గోలంతా! నాకేం నచ్చలా యిది. నీ మంచి పేరంతా మంట గలిపే పేసుకున్నావ్‌! పేరమ్మంటే ఏంది.. నుప్పులాంటి మనిషన్నారంతా! ఇప్పుడేందిట్లా! నాకేంది, నీ యిట్టం!’

బసవయ్య చరచరా చుట్టింటిలోంచి వెలుపలికి వచ్చాడు. పంచపాళిలో రెండో మంచం మీద పడుకొన్నాడు. అంతలోనే గురకపెట్టాడు. చుట్టింటిలోంచి పేరమ్మ ఏడ్పు సన్నగా వినబడుతుంది.

చలమయ్య వళ్ళు చల్లబడింది. తన మూలంగా తల్లీ కొడుకుల మధ్య తగాదా రావటం సహించలేకపోయాడు. ఎవరో ఏమో అన్నారని, అది విని తల్లిని అలా బాధపెట్టే కొడుకును ఏమనాలో తెలియలేదు.

కంటికి రెప్పలాగా కొడుకును కాపాడుకొంది. ఆ కొడుకు ఇంత కఠినంగా అనరాని మాటలంటుంటే ఏ తల్లి సహింపగలదూ? తన మూలంగా ఈ వయస్సులో ఆమెకెందుకు కష్టం కలగాలి?

ఇంతకాలం లేని తను వచ్చి, ఎంతోకాలం నుంచి ఉన్న కొడుకుకు ఆమెను దూరం చేయటం ఏమంత న్యాయం?

వాళ్ళ అప్యాయతను తెంచివేసే అధికారం తనకు లేదు. వాళ్ళ సమిష్టి అనురాగంలో తనకింత ధర్మం చేయగలిగితే చాలు! అయితే అది వీలులేదు. తనకిక్కడ స్థానం లేదు. వెళ్ళిపోవాలి. వెంటనే వెళ్ళిపోవాలి.

ఎక్కడికి? ఏం చేయాలి వెళ్ళి? ఏం దిక్కుంది తనకు?

ఎక్కడికయినా సరే, వెళ్ళాలి! వీళ్ళకు కష్టం కలిగించకూడదు. ముఖ్యంగా పేరమ్మకు. ఆశలుడిగిన జీవితంలో ఆశలు పుట్టించటం తప్పు! చనిపోయిందాకా తనెక్కడో బ్రతికివుండడం కంటే ఏమీ చేయలేడు. తొలికోడి కూసింది. ఆలోచిస్తున్నాడు. మలికోడి కూసింది.

చలమయ్య మంచయీంచి లేచాడు. వెళ్ళాలి! వెళ్ళిపోవాలి! అనుకొన్నాడు. ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోవాలి. ఇంట్లోకి పోయాడు. సీతమ్మ చాపమీద అమాయకంగా నిద్రపోతూ వుంది. పైజామా, లాల్చీ వేసుకున్నాడు. జేబు బరువుగా ఉంది. పంచె దణ్లెం మీద పడేశాడు. కిరసనాయిలు దీపం పక్కకు పెట్టాడు.

చుట్టింటిలో కుక్కిమంచంలో నిద్రపోతూవుంది పేరమ్మ. కోడిగుడ్డు దీపం ఒత్తి పైకెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. కళ్ళనీళ్లు తిరిగాయి. వెనుదిరిగి రాబోయి ఆగిపోయాడు. జేబులో ఉన్న పర్సు తీసి, పేరమ్మ పైటకొంగుకు కట్టి, దీపం తగ్గించి వెలుపలికి వచ్చాడు. రాత్రంతా ఏడ్చి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయిన పేరమ్మ గద్దరించిన ముఖం చలమయ్య కళ్ళలో నిలిచిపోయింది. _ వీధిలోకి వచ్చిం తర్వాత ఎటుపోవాలో తెలియక తికమకపడ్డాడు.

ఎవరో తట్టినట్టు పేరమ్మకు మెలకువ వచ్చింది. పైటచెంగు బరువుగా తగిలింది. విప్పిచూస్తే పర్సు! కళ్లు నులుముకొని చూసింది. దీపం దగ్గరగా చూచింది. పర్సునిండా డబ్బు!

పర్సు అక్కడే వదిలేసింది. లేచివచ్చి మంచం చూచింది. గుండె ఆగినంత పనయింది. ఇంట్లోకి పోయింది. పైజామా, లాల్చీ లేవు. “అనుకొన్నంత పనయ్యింది తండ్రో!’ అంటూ ఏడ్చింది. లాంతరు చేతబుచ్చుకొంది. పంచపాళీ లోకి వచ్చి గురకపెడుతున్న కొడుకును లేపింది.

“నీ మూలంగానే ఎళ్ళిపోయేడు. పో! ఏడుండాడో ఎతికి దీసుకురా! పో! ఎటుబొయేడో ఏందో! లేరా! పో! బస్టేండుకుబో! ఆణ్జుంచి వెళ్ళిపొమ్మని తిట్టబాక! పో! పోరా!’

సెప్టెంబరు, అక్టోబరు 69 లో జయశ్రీ పత్రికలో తొలుత ప్రచురిమంచబడినది


5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles