17.8 C
New York
Monday, May 13, 2024

సరోజ

– కీ. శే. మునిపల్లె రాజు

జ్వరం

మూడు దినాలదో, మూడు వారాలతో.

దానికి శరీరం మీద సంపూర్జాధికారం సంక్రమించాక.

నీ మనసు బుద్ధి మెదడు నరాలు దాని బానిసలై పోయాక.

అది నీ చేతనను ఒక అవిశ్రాంత అంతరంగ తరంగ నీలవాహినిగా మార్చివేశాక.

కాల నిర్ణయం కష్టసాధ్యం.

తాప నిర్ణయమూ సాధ్యం కాదు.

నిజానికి మొదటి రోజున కళ్ళు మూతలు పడుతున్నా తూలిపోయి మంచం మీద పడి పోయినా, ధర్మామీటర్‌ కోసం చేతులు చాచి బల్లమీద వెతికాడు. వేళ్ళకు రంగుల ట్యూబులు, రంగులు కలిపే పాలెట్‌ పళ్ళెం మాత్రమే తగిలాయి. ధర్మామీటరు తన ఫిడేల్‌ పెట్టెలో దాగి ఉందని స్మృతికి రాలేదు. రాకపోగా ఏదో తరంగ బలం మళ్ళీ వరద నీటిలోకి తోసేసింది. బాగుంది. రాగాలు పలికించే ఫిడేలుతో, రోగ తీవ్రతను గుర్తించే జ్వర తాపమానం ధర్మామీటరు జోడీ.

సముద్ర తరంగాలకు ఒక లయ, ఘోష.

ఈ ప్రవాహంలో అవి మృగ్యం. అయినా జ్వరం తన ప్రేయసి, ప్రియురాలు. చిన్నతనంలో అరవైదినాల పారా టైఫాయిడ్‌ అనబడే సన్నిపాత రోగం ఆయుర్వేదాచార్య పోగుల లక్ష్మయ్య గరళంపోసి బతికించాడు.

యుద్ధంలో మలయా అడవుల్లో రక్తం పీల్చిన జలగలు. నెత్తురు తాగే దోమలు. మలేరియా ధర్మామీటరును బ్రద్దలు చేసే జ్వరం.

క్వినైన్‌.

క్వినైన్‌.

తను కొట్టుకు పోతున్నది ఏరా? సముద్రమా? వాటికి పేర్లు లేవు. అరాచకం. రష్యా వాళ్ళు నిహిలిజం అంటారు. తను సైన్యంలో చేరినప్పుడు ఇంకా జీవులు పుట్టలేదు. ఒన్‌ హండ్రెడ్‌ వెయిట్‌ ట్రక్కులు. ఏమిటో ఆ పేరు? బురదలో కూరుకుంటే అంతే సంగతి. జపాను వాడి విమానాల్ని శబ్దాన్నిబట్టి గ్రహించవలసిందే. తీరా సమీపించి బాంబులు వర్షించిన తరువాత రాడార్దూ పుట్టలేదు. పెన్సిలిన్‌ ఇంకా రాలేదు. పార్థసారథి కెప్టెన్‌ సారో న్యుమోనియాతో చచ్చి బతికాడు.

ఎట్లా?

కేవలం విష్ణు సహస్రనామ జపంతో. వాడిల్లు మద్రాసు తిరువళ్ళ్శిక్కేణి పార్థసారథి కోవెల సమీపంలోనే గదా. వాడికి పెన్సిలిన్‌ అంటే నమ్మకం లేదు.

మళ్ళీ ఇంకో లోకం. జ్వర భాషలో జపానీ మాటలు. మాటలు కావు. మృత్యుఘోషలు… జపాన్‌. సిపాయి బాయినెట్‌. కెప్టెన్‌ సారోకు తొంటిలో పోటు. తనూ, గూర్తా రెజిమెంట్‌ సిపాయి రణ బహదూర్‌ కెప్టెన్‌ సారోనుపట్టి మోసుకుంటూ, వంగుతూ, నక్కుతూ పోతుంటే తన తొడలో మర తుపాకీ గుండు. రణబహదూర్‌ ఇద్దర్నీ నడిపి స్తుంటే జై భవాని ఛత్రపతి శివాజీ మహారాజ్‌కీ జై యుద్ధ నినాదాలు. తమ వాళ్ళు. గుర్ధాలు, సిక్కులు, డోగ్రాలు మరాఠాలు. సింగపూర్‌లో ” ‘అరిభయంకరమైన” ఆంగ్లేయ నౌకాదళం హార్బర్‌ బయట రాక్షస కతేబరాలుగా పడిపోయి, చివరి స్టేమరులో తనూ, సారోపునర్దన్మ ఎత్తటం. తను జపాను వాడి గుండె మీద బలంగా తన్ని ఎసాల్జ్‌ రైఫిల్‌ను తుప్పల్లో విసిరివేసినందుకు మెన్సన్‌డ్‌ ఇన్‌ డిస్పాచెస్‌. యుద్ధ చరిత్రలో తన పేరు. కుంటి వాడైనందుకు డిమోబ్‌. సైన్యం నుండి విముక్తి. మాజీ కెప్టెన్‌ హాయగ్రీవ్‌. వార్‌ ఆరిస్ట్‌. యుద్ధ చిత్రకారుడు.

జ్వర భాష ఇంకో దేశం ప్రవేశించింది. (గ్రీవ్‌ అంటే చింత గదా). కెప్టెన్‌ సారో స్థిత ప్రజ్ఞడు. మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాడు. తన కుల దైవంతో పాటు లండన్‌ విజయ విన్యాసాల్లో పాల్గొన్నాడు. వి.జె.డే! విక్టరీ ఓవర్‌ జపాన్‌. చివరకు తను ద్వేషించే ఫాసిస్టు దేశపు ఇటాలియన్‌ కన్యను పెళ్ళాడాడు. అక్కడే స్టి సిరంగా ఉన్నాడు. కెప్టెన్‌ పార్థసారధి, ఆర్గ్‌. ఇ. (రాయల్‌ ఇంజనీర్స్‌) ఇప్పుడు ఇటాలీయన్‌ కన్సల్లింగ్‌ ఇంజనీర్‌”. ఏ జన్మలోనో తన తమ్ముడు. తన ట్రిప్లికేన్‌ మేడ పై భాగం మూడు గదులూ కెప్టెన్‌ గ్రీవ్‌కు ఇచ్చేశాడు. అద్దె లేదు. కింద భాగాల్లోని ( అలజడి లేదు. సీనియారిటీ ప్రకారం పంపు కింద నీళ్ళు పట్టుకొనే వంతులు లేవు. సిగరెట్టు కాలిస్తే శ్రీ రంగనాథుడికి అపచారం జరిగినంత ఆందోళన లేదు. స్నేహితులొస్తే తొంగి చూసే చికాకు లేదు. తనూ, తన రంగులూ, చిత్ర పటాలూ, కాన్వాసులు, ఈజెల్‌ స్టాండ్‌లూ, కుంచెలూ, కిటికీ గుండా సముద్ర దృశ్యం. మధ్యాహ్నం బంగాళాఖాతం గాలి.

గాలి విసురుగా వచ్చి కిటికీ రెక్కలు కొట్టుమిట్టాడుతున్నా హాయగ్రీవానికి తెలివి రాలేదు. కాని శరీరం మీద అప్పుడే పట్టిన స్వేదం ఆరిపోతున్నది. స్వేదంతో తడిసి మగ్గిన గుడ్డలు కుళ్ళు వాసన. రెండు పిల్లులు కొట్టాడుకొంటూ, ద్వంద్వ యుద్ధం చేస్తూ క్రటికీ గుండా లోనికి దూకి కొయ్య ప్రేముమీద ప పడ్డాయి గాబోలు ఈజెల్‌ స్టాండు ధన్‌ మని పడిపోయింది. మాగన్నుగా కళ్ళు తెరచి తన జ్వర గంధాన్ని త్‌నే భరించలేక తిరిగి నీలి వర్షపు నదీ ప్రవాహంలోకి పడిపోయాడు.

యుద్ధపు గాయం నయమై పోయి సంవత్సరాలైనా సలుపు పెట్టటం మానదు. కాలు కదిలించి కుడి పార్వాానికి తిరిగి పోయాడు. ఓరగా కళ్ళు తెరిచినపుడు చిందరవందరగా గది నిండా సిగరెట్టు పీకలు, పుస్తకాలు. మళ్ళీ వ్యక్తా వ్యక్త ఘటనల _ శృంఖలికలో మగత, ఈ పుస్తకాలన్నీ ఏమిటి? తనే ఒక బుక్‌ ఆఫ్‌ డౌట్‌ అండ్‌ సారో సంశయ విషాద కావ్యంలాగా బతుకు. నీడల రాజ్యం ఇది. రెండు గొంతులూ సంబోధించేవి తను గీచిన బొమ్మలు. ఇక్కడ దేవతల కన్నా దయ్యాలదే బలం.

ఈ చిత్ర లేఖనంలో తన భవిష్యత్‌ నిజమేనా?

తన రంగుల్లో, రంగుల మిశ్రమాల్లో సహజ గంభీరత ఉందా?

ఈ చిత్రాలు మౌన సంగీత రాగాల్ని వినిపిస్తున్నవా?

వాటి నిశ్శబ్దంలో ఆనందం, ఆవేదన గోచరించవేమి?

ఫిడేలు కమానులాగా, రంగుల కుంచెలు ఫిడేలు రాగాలు ప్రతిధ్వనించక పోయినా కనీసం వినిపిస్తున్నాయా?

తనను సందేహ వీచికలు చుట్టుముట్టినప్పుడు, తన మీది తన విశ్వాసం వివర్లమైనప్పుడు, తన కాలి కుంటితనం తన మనస్సును ఆక్రమిస్తున్నదని తోచినప్పుడు, తనను ఈ బతుకు ఒక శవపేటికలో కుక్కుతున్నదని నిర్వేదం కమ్మినప్పుడు, తన మిత్రులు పెదవి విరిచి తన బొమ్మల్ని రెండవసారి చూడనప్పుడు, తన పలుకులు సమాధి చీకటినుంచి వినిపిస్తున్నట్లు భమించినప్పుడు, తన దారిద్ర్యాన్ని చిత్రకారుడి వృత్తి ప్రవృత్తుల్నీ, తన భార్య నిరసించి అవమానపు మాటల్లో విడాకులు కోరి దూరమైనప్పుడు, యుద్ధం సర్వీసు బలంతో తనను గవేషిస్తూ వచ్చిన ఉన్నతోద్యోగంలో ఇమడలేక, సితిని కాలదన్ని పశ్చాత్తాపాగ్నిలో కాలుతూన్నప్పుడు కమాను పట్టి ఫిడేలు తంత్రులమీద తనను తను అన్వేషించుకొని, ఆ అన్వేషణ పొగ మంచి వెనుక స్పష్టాస్పష్టమైన విధి రూపం తనకు అర్థం కాక వినపించినప్పుడు జ్వరం ప్రియురాలి వలె తన్నాదరించేది.

అక్కతో. పాటు… చిన్నతనంలో తను. ఫిడేలును వరించాడు. తను కోరిన. వెప్పుడూ దొరకలేదు. తనకు దొరికిన వాటిని తనెప్పుడూ కోరలేదు ఈ ఫిడేలూ. ఈ కుంచెలూ తను కోరినవి. తనకు లభించినవి. గాఢ వేదన మనసును ముద్రాంకితం చేసిన క్షణాల్లో బాధాఘూర్లితమై హృదయం బరువెక్కిన సమయాల్లో తను శరణుజొచ్చేది జ్వరాన్ని జ్వరం తనను అంతర్ముఖుణ్లిగా మారుస్తుంది. ధూళి దూసర కలుషితమైన బాటల నుండి తనను మరలిస్తుంది. ఏకాంతాలయ నిశ్శబ్ద సంపుటాల్లో తనకు జోలపాడుతుంది.

జయ జయహో జ్వర దేవతా!

రా! రా! ఏ తెంచినావా?

నీ వినీల కుటిల కుంతలాలతో నన్ను కప్పి కరుణించు దేవీ!

నిజంగానే. ఈ శాంతాంధకారంలో గూడా ఎవరి వినీల కుటిల కుంతలాల మృదు మధుర సువాసనో, శీతల పానీయంతో తన ముఖం తుడుస్తున్నారు? తన శిరోజాలని సవరించి సర్జ్దుతున్నారు. తనను పొర్లించి వీపునంతా యుడికొలోన్‌ సుగంధ జలంతో శుభ్రం చేస్తున్నారు. తన చొక్కాను వదులు చేసి తీస్తున్నారు. తన రుద్రరమ్య నిశీథం అంతమవుతున్నది. తన ఫిడేలు మధుర హీత మాలలు లాగా మృదుల పాదాలతో గదినీ, మురికినీ ఎవరో శుచీ జలంతో కడుతుగున్నారు. ఉషోదయం అవుతున్నదా? హాయగ్రీవం కళ్ళు తెరిచాడు. నీరసంతోనే లేచి కూచున్నాడు.

ఎదురుగా సరోజ శాపగ్రస్తురాలైన అప్పరసలాగా దీనంగా ఆందోళనతో.

“లేవండి. పక్క శుభ్రం చేస్తాను. ఎన్నాళ్ళనుమ్బి జ్వరం? అయ్యో ఎంత శుష్కించి పోయారు?”

చంక కింద చేయి జొనిపి లేవదీసింది. కుర్చీలో పసివాణ్ణి దిగవిడిచినట్లు కూచోబెట్టింది. క్షణంలో పక్క గుడ్డలు ముద్దకట్టి ఆవలికి విసిరేసి చలవ దుప్పటి పరిచింది. కొళాయి. నీళ్ళు గ్లాసుతో తాగించింది.

సరోజ తన మోడల్‌. దిన వేతనానికి నగ్నంగానో, నిండుగానో తన చిత్ర లేఖనానికి ప్రతీకగా నిలిచే మట్టి బొమ్మ. మృత్పిండం. తన ఊహలకు, తాత్విక దర్శనానికి, రంగు కుంచెల సంగీతానికి ఒక మనుష్య రూపం. ఈ ప్రతిమకు ప్రాణదానం చేస్తేనే ఒక చిత్రపటం. పెయింటింగ్‌. పార్థసారథికి తను పంపిన మోడరన్‌ పెయింటింగ్స్‌ అనే పాశ్చాత్యాను కరణాల బొమ్మల ఫోటోలకు జవాబు వచ్చిన దినం అది. “ఇటువంటి చిత్రాలు గీచేవాళ్ళు ఇటలోలో వందల మంది ఫ్రెంచి దేశంలో వేలమంది ఉన్నారు. ఆకలితో ఉన్నారు. తమ నీడను తామే వెతుక్కొనే నిర్భాగ్యులు, నైపుణ్యం అరాచకమైతే, నీకు సంగీతం ఏదో, అనుభూతి ఏదో సుగోచరం కాకపోతే ఈ అబ్‌స్టాక్టు అవ్యక్త చిత్రాలు పుట్టుకొస్తాయి. నువ్వు పుట్టిన నేల, నీ వాళ్ళ ఆత్మ, నీ గురువుల పరంపరానుభూతి నుండి వేళ్ళూరిన ఆత్మ ప్రభోదం, నీవు చూచిన గుళ్ళు, గోపురాలు, పశు సంపద, దైన్యం ధీరత్వం ఎక్కడా కనబడవేం? నీలోకి, లోతులకు తరలిపో. నీ రంగుల మిశ్రమం అద్భుతంగా ఉండవచ్చునని ఇక్కడి నిపుణులు చెబుతున్నారు. కావలసింది నీ స్వత్యంత్ర వైయక్తిక ముద్ర. సిద్ధాంతాల భావజాలం కాదు. తాత్విక భూమిక” అని రాశాడు.

తన దివోస్వష్నాల ధీరత సడలి, దీనుడై, ఖిన్నుడై మిత్రులు భాస్కరం, శ్రీను వాళ్ళ స్టూడియోకి వెళ్ళి మౌనంగా కూర్చున్నాడు. శ్రీను పాత జమీందారుగారి వారసుడు. పారిసు స్టూడియోలా తన గదిని అమర్చుకో గలిగినవాడు. వాళ్ళు ఢిల్లీలో తమ చిత్రాల ప్రదర్శన హడావిడిలో ఉన్నారు. అక్కడ తన నూతనాందోళనల ప్రథమ ప్రతి శ్రుతిగా కనిపించింది సరోజ.

విరాటుడి కొలువులో సైరంధ్రి.
అశోక వృక్షం నీడలో సీతాదేవి.
వయసు తెలియజెప్పని ముఖం.
ఇరవై? పాతిక?
ముఫ్ఫై?

తనను రంగుల్ని విసర్జించి ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకొన్న తీవ నిరాశాపథం నుండి మళ్ళించింది ఆమె వదనమే. అంత దైన్యంలో బతుకు స్వష్నాలకు వేరేవో జీవధారలు నిశ్చితంగాఉన్నాయని ప్రబోధించిన ఆ చూపులు కుంటి వాడికికుంచె. కమాను ఆత్మీయులని తెలుసుకొన్న జ్ఞానోదయంతో, ఆమెను నిరాశ్రయను చేయకుండా తన చిరునామా ఇచ్చాడు. రెండు బొమ్మలు గీచాడు. దినం వేతనం పదిహేను రూపాయలు. సరెఓజ మొదయిసారిచ్చిన దినానా తనకు జ్వరమే. నగ్నరూపం చిత్రించబోయి, పార్వపు దిశగా కూర్చోమని చెప్పినప్పుడు ఆమె వీపు మీది వాతలు. ‘భర్త కొట్టిన దెబ్బల ని విలపిస్తూ చెప్పింది. తను అబ్కారీ జవాను కూతురు. ఇంకో అబ్కారీ వాడితో వివాహం. తాగుబోతై ఉద్యోగం పోగొట్టుకొని భార్య సంపాదన మీద బతుకుతున్నాడు.

“బిడ్డలు?”

సరోజ సమాధానం చెప్పలేదు.

దొడ్డ బుద్ధితో భాస్కరం, శ్రీను తన బొమ్మల్ని రెంటిని ఢిల్లీ ప్రదర్శనకు తీసుకుపోయి నెలరోజుల తర్వాత కొంత డబ్బు పంపారు. నిజంగా తన బొమ్మలు అమ్ముడు పోయాయో లేదో తెలీదు. ఆ డబ్బుతో తను యాత్రలకు పయనం. పార్థసారథి సూచించిన ఆత్మ సాక్షాత్మారాన్వేషణ. ఎక్కడ లభిస్తుందో అగమ్యం. పిచ్చివాడు విసిరిన రాయి ఈ బతుకు. ఈ యాత్రలోనే అక్కయ్య వాళ్ళ గ్రామానికి వెళ్ళాడు. తన చదువు ఖర్చుల గురించి బావ అక్కయ్యతో వివాదం పడగా తను విని, కాలేజి మానివేసి యుద్ధ పటాలాల్లో చేరకముందు ఎన్నేళ్ళక్రితమో ఈ అక్కను చూసింది. ఆమె కన్నీళ్ళ నిశ్శబ్దవాహినిని చూడలేక పాదాలను కళ్ళకద్దుకొని బయలుదేరి వస్తూంటే, నాన్న చదివే ‘వివేకానంద చరిత్ర’ పుస్తకం తనకిచ్చింది. అందులో ఉన్న డబ్బు కాగితం కవర్ను ఇంటికెళ్ళాకనే చూసింది.

పార్థసారథి తండ్రి తెలుగు జిల్లాల్లో జడ్డీ పని “చేస్తున్నప్పట్నించీ తనకూ వోడిక్షీ స్నేహం. వాడిది రాజకీయ అవగాహన. తనది అన్నోపార్డన అవసరం. ఇద్దరూ సైన్యంలో చేరారు. “వివేకానంద చరిత్ర చదివాక తనకు దృగ్గోచరమైన మార్గంలో మళ్ళీ బొమ్మలు – “దేవాలయ కల్యాణ మండపంలో దేవదాసి నృత్యం”, “చెరువు నుండి నీళ్ళు” తడిసిన బట్టల్లో, విరబోసిన కుంతలాలతో, నడుమున నిండు బిందెతో గ్రామీణ స్త్రీ గజగమనం – ఈ రెండు చిత్రాల్లోనూ సరోజే మోడల్‌. ఫ్రెంచి ఆర్ట్‌ మీది సాహిత్య చర్చల పుస్తకాలు మళ్ళీ ముట్టలేదు. మతి చలించి చెవికోసుకొన్న డచ్చి చిత్రకారుడు వాన్‌గో, కుళ్ళుబోయి, కుష్టు రోగంతో మరణించిన ఫ్రెంచి చిత్రకారుడు పాల్‌గాగిన్‌ – ఇద్దరికీ కృష్ణా తీరంలో తర్పణాలు వదిలాడు.

సరోజ నిలబడే ఉంది. తను కాలెండర్‌ వంక చూస్తున్నాడు. తేదీ తొమ్మిది. ఇవ్వాళనే సరోజను కొత్త బొమ్మ సిటింగ్‌ కోసం రమ్మన్నాడు. సాగిలపడి దిండుకింద పర్సులో పదిహేను రూపాయలు తీసి ఇచ్చాడు. “మీకు జ్వరంగా ఉంది కదా, మరొకసారి ఇవ్వవచ్చునండీ” అంది. తను బలవంతంగా ఇచ్చాడు. పోతూ పోతూ ఫ్లాస్క్‌ తీసుకున్నది. కాఫీ, ఇడ్లీల పార్పెలు తెచ్చింది. వంట గదిలో పాత్రల్ని మాగిపోయిన పదార్థాల కంపునూ శుభ్రం చేసింది. స్టాలో కిరసనాయిలు పోసింది. తన కూలీ డబ్బులకు తగిన శ్రమదానం చేసింది. మురికి గుడ్డల్ని లాండ్రీలో వేస్తానని తీసుకెళ్ళింది. కాఫీ తాగి మళ్ళీ తను నిద్రపోయాడు. జ్వరం పోయింది గాని అంతరంగ కల్లోల తరంగాలు ఆగలేదు.

డ్రాయింగ్‌ మాస్టరు భుజంగరావు. నిజంగా క్రుద్ధ భుజంగం ఆ స్వరూపం. నల్లగా ఆరడుగుల ఆజానుబాహుడు. చిరునవ్వు లేదు. పలుకరింపు లేదు. నేరుగా క్లాసులో _నల్లబల్లను సమీపించేవాడు. సిలబస్‌ ప్రకారం ఒక బొమ్మ. దాని కిందనే, ఆ బ్లాక్‌ బోర్డు మీదనే తనకు తోచిన ఇంకోబొమ్మ నిముషాల మీద వేసేవాడు. మొదటి బొమ్మకు సెక్షన్ల విభజన ఉండేది. చూచి నేర్చుకోవాల్సిందే. తన విశదీకరణ ఏమీ ఉండేది కాదు. ఎందుకో, ఆ చాక్‌ పీస్‌ తెల్ల బొమ్మలే తన నాకర్షించేవి.

తను ధైర్యం చేసి వివరణ అడిగితే తన పుస్తకం మీదే రెండు ముక్కలు వ్రాసేవాడు.

అనాటమీ, ఫిజియానమీ.

అంతే.

కండరాలు, బొమికెలు, కాళ్ళ వంపులు, జంతువులు మనుషుల కళ్ళవాలు, చూపు ప్రకృతికీ మానవ జాతికీ గల విచిత్రానుబంధం – అతి సహజంగా అతి కోమలంగా, అతి భయంకరంగా, అదే తన బతుకు ప్రాతిపదిక అయింది. తర్వాత స్వయం కృషి. అతుకు బొతుకులుగా అంతేవాసిత్వం, కొన్నాళ్ళు రాజస్తానం, గుజరాత్‌ సరిహద్దుల్లో, కొన్నాళ్ళు గుండ్లకమ్మ తీరాన. చిత్ర లేఖనంలో ఇది తన చరిత్ర.

కమానుతో ఫిడేలు తీగెలను స్పర్శించి ఎన్ని వారాలయిందో! కలల్ని కట్టిపెట్టి కమాను పట్టాడు. ఏ రాగమో తెలియదు, పార్థసారథి తలపులోకి వచ్చాడు ఎఫ్‌. ఎ కాగానే వాణ్ణి జర్మనీలో ఇంజనీరింగ్‌ కోర్సుకు వాళ్ళ నాన్నగారు పంపారు. తను బ్రిటీక్స్‌ ప్రభుత్వంలో ఉద్యోగి అయినా ద్వేషంతోనే ఆ కొలువు చేసినవాడు క్రిష్టయ్యంగార్‌. కొడుకు ఇంగ్లండ్‌లో చదవకూడదు. కాని పార్టుడు జర్మనీలో నాజీ పార్టీ విజ్ఞంభణ దశను చూచినవాడు. స్పెయిన్‌ అంతర్యుద్ధంలో నరకాసుర నాజీల నవీనాయుధాల విధ్వంసకాండ గూర్చి విన్నాడు. ప్రతి నిత్యమూ యూదులు పడే అవస్థలు చూశాడు.

నాజీలు నరహంతకులు. యుద్ధం ప్రారంభం కాకముందే జర్మనీ నుంచి బయటపడ్డాడు. లండన్‌ చేరాడు. సైన్య బలమొక్కటే ఫాసిస్టు రాక్షస బలాన్ని రూపు మాపగలది అని నిర్ణయానికి వచ్చి అక్కడే రాయల్‌ ఇంజనీర్స్‌ కోర్‌లో కమిషన్డ్‌ ఆఫీసరుగా . నమోదైనొడు…. ఫాసిజం నిజస్వరూపం గురించి వ్రాసిన జాబుల్లోనే పార్గుడు తనకు కొంత స్ఫూర్తినిచ్చాడు. తన పలుకుబడితోనే పార్థుడు తననూ నడిపించాడు. కమాను కదలక నిలిచింది.

బయట తలుపు చప్పుడు.

పార్టుడి కేబిల్‌ గ్గాం. ఇటలోలో మిలన్‌ నగరం నుంచి. “మనిషి వస్తున్నాడు. కొత్త త్త బొమ్మలు ప పంపు”. తన ఘోషను, భౌతిక కల్లోలాల్నీ ఆధ్యాత్మిక కలవరింతల్నీ తనకు గాక ఇంకెవరికి వ్రాయగలడు. వివేకానందుడి ఉద్దాటన – పాశ్చాత్యుడి టెక్నాలజీ, భారతీయుడి ఆత్మ విమర్శ మిళితం చేసి వేసిన కొత్త బొమ్మలు. “రమణాశ్రమంలో వృక్షరాశి,” ఛాయా సాష్టాంగ నమస్కృతి,” “నాగపూజ” సరోజతో మొన్న మొన్నటి బొమ్మలు అన్నీ కలిపి ఎరువుల కర్మాగారం నిర్మాణంలో సలహాలివ్వవచ్చిన ఇటాలియన్‌ ఇంజనీర్‌ ద్వారా పంపేశాడు.

మళ్ళీ ఆందోళన. ఆర్థికపరమైన చిక్కులు. భాస్కరం, శ్రీనూ బొంబాయి వెళ్ళిపోయారు. సరోజ కూలి పది రూపాయలకు తగ్గించాడు.

ఈ ఆరు నెలలూ ఆరు యుగాలు.

ఆరు కుశంకలు.

ఎందుకీ బొమ్మలు గీయటం?

హరికథల భాగవతార్లకు ఫిడేలు వాయిస్తే కుక్షి నిండదా?

అయినా ఈ వృధా భరిత ప్రస్థానానికి అర్థం లేదు గదా! రాత్రంతా సముద్ర పొడ్డునే గడిపాడు.

ఆ రాత్రే హాయగ్రీవం అక్కకు జాబు వ్రాశాడు. “నీతో తల్లి రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు నీకేసాయమూ, సంతోషమూ చేయలేని, ఇవ్వలేని అసమర్హుడు. నన్ను క్షమించు.”

తండ్రి రూపం స్కృతికి తెచ్చుకొని “నువ్వు నాకేసంపదా ఇవ్వలేదని నిందించిన వాడిని. ప్రాణం ఇచ్చావని తెలియని అజ్ఞానిని. “క్షమించవా నాన్నా” అని ప్రార్థించాడు.

తనే థద్ధతో వేసిన అమ్మ చిత్రాన్ని గోడకు అమర్చి ఏమని వేడాలో తెలియక నిర్విణ్లుడైపోయాడు.

కలల కాలం, కన్నీళ్ళ కాలం గడచిపోయింది.

ఒక్కటే ప్రశ్న…. తన బొమ్మలు, చిత్ర వర్షాలు తనకైనా తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చాయా? అవును కాదు ఏదో ఒక సమాధానం లభిస్తే చివరి నిర్ణయం తీసుకోవచ్చు.

అంతర్వాణి పలుకరింపు కోసం వేచి ఉన్నాడు.

పక్కనే నిద్రమాత్రల నిండు సీసా.

న్యాయాధికారి.

ఫైనల్‌ జడ్జిమెంట్‌.

తుది తీర్పు. నిరీక్షణ.
ఎదురుగా సరోజ. ఎప్పుడొచ్చిందో.

“భాస్కరంగారూ, శ్రీనుగారు వెళ్ళిపోయిన తరువాత మీరే ఆధారంగా నిలిచారు. ఇంట్లో జరగటం లేదండీ”.

“ఏం లాభం? ఈ బొమ్మ లెవర్ని ఉద్ధరించను?” అన్నాడు తను. అలసిపోయినట్లుగా, చెప్పకుండానే తను మామూలుగా కూర్చునే చోట కుర్చీలో కూలబడి ముఖం తుడుచుకొన్నది.

“అట్లా అంటారేమిటండి. వాళ్ళిద్దరి కన్నా మీ బొమ్మలు ఎంత బాగుంటాయండి. ఎంతో చెప్పలేను. ప్రాణం పోస్తారు”.

ఆమెను నిర్వికారంగా చూచాడు. ఆ కళ్ళల్లో నిండుగా నిజాయితీ,నిబద్ధత. “నిజంగానా?”

“అయ్యో, అబద్దం చెబుతానాండీ” అన్నది.

“అయితే అట్లాగే కూచో” హాయగ్రీవం తన ఫిడేలును ఆమెకిచ్చాడు. కమానూ చేతి కందించాడు. గడ్డంతో ఫిడేలు అంచు నొక్కి పట్టమన్నాడు. గబగబా ఈజెల్‌ మీద కొత్త కాన్వాసు పరిచి క్లిప్పులు పెట్టాడు. రంగుల పళ్ళెం తీసుకొని కుంచెతో సన్నని గీతలు గీశాడు.

బయట తలుపు చప్పుడు.

“ఓవర్సీస్‌ కే బిల్‌ గ్రాం” అరుపు.

“గివ్‌, గ్రీవ్‌. నీ జెండా ఆకాశతలంలో ఎగురుతున్నది. నీ చిత్రాలన్నీ కొనేశారు. త్రీ థైజెండ్‌ పౌంద్స్‌. మూడువేల స్టెర్లింగ్‌. “బ్యాంక్‌ ద్వారా పంపాను సారో”.

హాయగ్రీవం ఎగిరి గంతేశాడు.

“సరోజా! సరోజా!”

ఆమె నుండీ సమాధానం లేదు.

సరోజ చేతిలో ఫిడేలు జారి నేల మీద పడ్డది.
కమానింకా చేతిలోనే ఉన్నది.

శరీరం ఒరిగి కుర్చీ నుంచి సోఫా మీద వాలిపోతున్నది.

“సరోజా! సరోజా!

నీళ్ళు తెచ్చి ముఖాన చిలుకరించాడు.

వీపుమీద తేలిన వాతలు పమిటె తొలిగి కన్పిస్తున్నాయి.

“నీ బొమ్మలన్నీ అమ్ముడుపోయాయ్‌ సరోజా! నువ్వు అబద్ధం చెప్పలేదు సరోజా! నీళ్ళు – నీళ్ళు తాగు.”

సరోజ కళ్ళుతెరిచి చూస్తూ, చిరునవ్వు అధరాల చివర్లన అలముకుంటూంటే మెల్లిగా అన్నది.

“అన్నం తిని మూడురోజులైంది.:”

సరోజను బతికించాలి.

హాయగ్రీవం మెట్లు దూకుతూ కిందికి పోయాడు.

కాఫీకో, కొబ్బరి నీళ్ళకో.

బతుకంటే అర్థం చెప్పిన మానవికి.

ఇదా చిత్ర లేఖనం అంటే?

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 3 జూన్ 1992 లో తొలుత ప్రచురించబడింది



5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles