13.5 C
New York
Tuesday, May 14, 2024

“నెమలి కన్నులు” ఆత్మకథ – నా ఆలోచనలు

“నెమలి కన్నులు” ఆత్మకథ – నా ఆలోచనలు

డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ,
ప్రధాన సంపాదకులు, ప్రకాశిక

“నెమలి కన్నులు” పేరుతో ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు గారు ఆవిష్కరించిన ఆయన ఆత్మకథ మొదటి భాగం చదివాక నా అంతరంగం చెప్పిన కొన్ని ఆలోచనలు అందరితోటీ పంచుకోవాలనుకుంటున్నాను. మొదటగా- ఆత్మకథ రాయాలంటే ధైర్యం, ఆత్మ స్థైర్యం, ఆత్మ నిబ్బరం, ఆత్మ విశ్వాసం ఉండాలి. నిజానికి, నాకు ఈ గుణాలు లేకపోవడం వల్ల నా ఆత్మ కథ “తుమ్మరిల్లు” గత పలు సంవత్సరాలుగా ఒక పీజీకి మించి రాయలేదు!

చాలా మంచి విషయాలు ప్రస్తావిస్తూ చాలామంది ఎన్నో వ్యాసాలు, పుస్తక పరిచయాలు చేశారు. నేను క్లుప్తంగా నా అనుభూతిని పంచుకుంటాను.

ఆత్మకథలు ఆత్మస్తుతులుగా వస్తున్న ఈ రోజుల్లో, ఆత్మని ఆవిష్కరించిన దార్ల గారు సూపర్ హీరో. తల్లి దండ్రులు ఉద్యోగాలు చేస్తూ, చదివించిన పిల్లలు pg లు, Ph.D. లు చేస్తే అంత గొప్ప విషయం కాదు. చేతనైన పనులు చేసి, పిల్లలకి కాసింత తిండి పెట్టి, మిగిలితే కడుపులో నాలుగు మెతుకులు వేసుకునే తలిదండ్రుల సంతానం మంచి సంస్కారం గల ఆచార్యునిగా ఎదిగితే, అది వ్యక్తిత్వ పరిణతి. దార్ల గారు ఆ వర్గానికి చెందిన ప్రతినిధి. దొరికిన ప్రతీ గడ్డి పోచనీ పట్టుకుని, ఇచ్చిన ప్రతి చేయినీ పట్టుకుని, ఎదలో రగిలే ప్రతిభా జ్వాలని ఆరకుండా కాపాడుకుంటూ, ప్రతీ మెట్టు ఎక్కుతూ పదవీ శిఖరాలని చేరుకున్న దార్ల గారు సామాన్యులు కారు. తాను అనుభవించిన అవమానాలను ఆశయ శిఖరాన్ని చేరడానికి మెట్లుగా మలచుకున్న దార్ల గారి సంస్కారయుత యుక్తి అభినందనీయం. తాను పెరిగిన సమాజంలోని లోపాలను నిరసిస్తూ, నిందిస్తూ కృశించకుండా తన అభివృధ్ధి మీద దృష్టి కేంద్రీకరించి జీవితంలో మంచి ఉన్నత స్థాయిని చేరిన దార్ల గారు అభినందనీయులు.

తాను శిఖరాన్ని చేరాక తనవారిని మరిచిపోకుండా అవసరమైన వారికి ఆసరా కల్పించే ప్రయత్నం చేస్తున్న మిత్రుడు దార్ల అభినందనీయుడు.

మనలో చాలామంది చిన్నప్పుడు నెమలి పించాలని (నెమలి కన్నులని) అపురూపంగా చూసుకునే వాళ్ళం. పుస్తకాలలో పెట్టుకుని ప్రతీరోజూ చూస్తూ మురిసిపోయే వాళ్ళం. నెమలి కన్నులు పుస్తకాలలో పెట్టుకుంటే చదువు బాగా వస్తుందనే పెద్దలు కల్పించిన అమాయకపు నమ్మకం మూఢనమ్మకం అయినా మనలని భవిష్యత్తుకి కార్యోన్ముఖులని చేసిన నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఉన్నత శిఖరాలని చేరిన వారెందరో మహానుభావులు; అందరికీ వందనములు. దార్ల గారు వంటి మార్గదర్శకులు ఆదర్శనీయులు. అమాయకపు బాల్య జీవితాన్ని పరిపక్వ మనస్థితితో “నెమలి కన్నులు” రూపంలో ఆవిష్కరించి, మనకి అందించిన ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు గారికి అభినందనలు.

~ డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ,
ప్రధాన సంపాదకులు, ప్రకాశిక

5/5 - (2 votes)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles