20.1 C
New York
Monday, April 29, 2024

మ్యారేజి లో మొబైల్

మద్దూరి నరసింహమూర్తి, బెంగళూరు

కుందనపు బొమ్మలాంటి పెళ్లికూతురు – మధురిమ – ని బుట్టలో కూర్చోబెట్టి ఇద్దరు మేనమామలూ పెళ్లిపీట దగ్గరకి తీసుకొని వస్తున్నారు. ‘శశిరేఖాపరిణయం’ సినిమాలోని ‘నిన్నే నిన్నే అల్లుకొని’ అన్న పాటతో రింగ్ టోన్ వినిపించగానే – మొబైల్ తెరమీద కనిపిస్తున్న పేరు చూసిన మధురిమ ఒక్కసారిగా “నన్ను కిందకి దింపండి మామయ్యా” అని కేక పెట్టింది. ఆ కేక విన్న ఇద్దరు మేనమామలూ ఏమిటయ్యిందో అని ఆత్రంగా బుట్టని కిందకి దింపేరు. ఆ బుట్టలోంచి చెంగుమని ఒక గెంతు గెంతిన మధురిమ, పెళ్లిమండపం మీంచి క్రిందకి ఒక దూకు దూకి, చెవిలో ఉన్న బ్లూటూత్ సరిచేసుకుంటూ హాలు బయటకు పరిగెట్టింది. “పెళ్లికూతురు లేచిపోతోంది” – పెళ్లి పందిట్లో ఏనోట విన్నా ఇదే మాట. ఒకరి చెవులు మరొకరు కొరుకుతూ “మరో రెండుగంటల్లో ముహూర్తం పెట్టుకొని, ఇప్పుడు పెళ్లికూతురు లేచిపోవడమేమిటండీ” అన్న గుసగుసలే. పెళ్ళికొడుకు ముఖంలో కత్తి వేటుకి నెత్తురు చుక్కలేనట్టుంది.

మేనమామలు చేష్టలుడిగి ఆ బుట్ట దగ్గరే నిలబడి మీనమేషాలు లెక్కపెడుతున్నారు. విచారంగా ఉన్న పెళ్లికూతురి తల్లికి దూరంగా జరిగిన మహిళా బంధుజనం బుగ్గలు నొక్కుకుంటున్నారు.   పెళ్లికూతురి తండ్రి ఐదు నిమిషాల తరువాత పెళ్ళికొడుకు తల్లితండ్రుల వైపు భారంగా అడుగులు వేస్తూంటే –   ఎంత పరుగుతో వెళ్లిందో – అంతే పరుగుతో తిరిగి వచ్చి బుట్టలో కూర్చున్న మధురిమ ‘పదండి’ అన్నట్టుగా ఇద్దరు మేనమామలవైపు నవ్వుతూ చూసేసరికి – “ఎక్కడికెళ్ళావమ్మా, అలా వెళ్లవచ్చా, తప్పు కదూ” అని పెద్దమామ మందలించేడు. “సారీ పెద్దమామయ్యా, మా బాస్ ఫోన్. మాట్లాడకపోతే బాగుండదు కదా” వెంటనే చిన్నమామ “అదేదో ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదమ్మా” “మంగళవాయిద్యాలు బ్యాండుగోలలో ఎలా మాట్లాడేది” అని తన నిస్సహాయతని వెలిబుచ్చిన పెళ్లికూతురిని చూసి – మామయ్యలకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు.

పెళ్లిపీటమీద కూర్చున్న పెళ్లికూతురు తెర క్రిందనించి కొంచెం మీదకెత్తి, పెళ్ళికొడుకు చేయి పట్టుకొని “సారీ స్వీట్ హార్ట్,  మా బాస్ విష్ చేయడానికి ఫోన్ చేసేరు, మాట్లాడవలసి వచ్చింది. హోప్ యు డిడ్ నాట్ మిస్ అండర్ స్టాండ్” అనేసరికి –   పెళ్లికొడుకు ఒక్కసారిగా చల్లబడిపోయి “నో స్వీటీ, నాటెటాల్. కూల్ డౌన్.  ఐ అండర్ స్టాండ్ యు” అని తన చేయి పట్టుకున్న పెళ్లికూతురు చేయి ఊపేడు.   “మా బాస్ మన హనీమూన్ కి పది రోజులు ఆఫీసియల్ గా అమెరికా టూర్ శాంక్షన్ చేసేరు” “సో నైస్ అఫ్ యువర్ బాస్” అని మధురిమ చేయి పట్టుకొని సంతోషంగా ఊపేడు రఘు.

‘వీడప్పుడే పెళ్ళం కొంగుపట్టుకొని తిరగడానికి సిద్ధపడిపోయేడు’ అనుకున్నారు పెళ్లికొడుకు తల్లితండ్రులు గుసగుసగా.   కన్యాదానం చేయడానికి పెళ్లికూతురి తల్లితండ్రులు సిద్ధపడి, పళ్లెంలో పెళ్ళికొడుకు కాళ్ళు పెట్టగానే – మంత్రాలు చదవబోయిన శాస్త్రిగారి మొబైల్ లో  ‘శ్రీరామ నీనామమెంతో రుచిరా’ అని రింగ్ టోన్ వినిపించింది. మొబైల్ అందుకున్న శాస్త్రిగారు పెళ్లికూతురి  తండ్రితో “రెండు నిమిషాల్లో వస్తున్నాను” అని చెప్పి, కొంచెం పక్కగా అటు వెళ్లి  – “ఏమిటి శర్మగారూ” “……………………………………………………………………………” “సరిగ్గా వినిపించడం లేదు. లైన్లో ఉండండి,  నేను బయటకు వచ్చి మాట్లాడుతాను” శాస్త్రిగారు పెళ్లిమండపం దిగి గబగబా నడుచుకుంటూ హాలు బయటకు వెళ్ళిపోయేరు.   “ఇదేమిటి, పెళ్లి చేయించవలసిన శాస్త్రులుగారే బయటకు వెళ్లిపోతున్నారు” అని పెళ్లి చూడడానికి వచ్చినవారు ఆశ్చర్యంగా ఆయన వెళ్లిన వేపే చూడసాగేరు. “ఇప్పుడు చెప్పండి శర్మగారూ” “………………………………………………………………………………….” “అలాగా, ఏం చేస్తాం. చేయి కాలు తన స్వాధీనంలో ఉండగానే ఎవరిచేత చేయించుకోకుండా వెళ్ళిపోయింది పెద్దావిడ, అదృష్టవంతురాలు. విచారించకండి” “……………………………………………………………………………………”

“రేపు నేను రావడం కుదరదు. ఇక్కడ ఆడపెళ్ళివారికి మగపెళ్ళివారికి నేనే పౌరోహితుడిని. ఈరోజు ఇక్కడ పెళ్లి చేయించిన తరువాత, రేపు మగపెళ్లివారింట్లో కొత్తకోడలు గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, కామేశ్వరీ వ్రతం మరియు గురునాధస్వామి పూజ చేయించాలి. పైగా, రేపు రాత్రి శోభనం ముహూర్తం కి పూజ చేయించాలి కూడా” “…………………………………………………………………………….” “చావు చెప్పా పెట్టకుండా వస్తుంది కానీ, పెళ్లి తదితర కార్యక్రమాలు ముందుగా నిర్ణయించిన సమయానికే చేయించాలి కదండీ” “…………………………………………………………………………….” “ఓ పని చెయ్యండి. ఆవిడ పార్థివ దేహాన్ని ఐస్ పెట్టెలో పెట్టి ఉంచండి. ఎల్లుండి ఉదయం 8 కాకుండా వచ్చి జరపవలసిన కార్యక్రమం యధావిధిగా శాస్త్రోక్తంగా జరిపించే పూచీ నాది, సరేనా” “…………………………………………………………………………….” అర నిమిషం ఆలోచించిన శాస్త్రిగారు  — “అంతవరకూ ఆవిడని అలా ఉంచడానికి మీ చుట్టుపక్కల జనంతో సమస్య అయితే, మీ వీలు చూసుకొని ఆవిడ పార్థివదేహాన్ని స్మశానంకి తీసుకొనిపోయి అక్కడ అరుగు మీద ఉంచి, ఎల్లుండి నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి. అంతకంటే, నా దగ్గర మరో దారి లేదు. కాదు కూడదు అంటే, నా సహాయకుడు స్వామిని పంపిస్తాను. అయితే, వాడు యధావిధిగా శాస్త్రోక్తంగా కార్యక్రమం చేయిస్తాడన్న హామీ నేనివ్వలేను” “……………………………………………………………………………..” “పెళ్లి ఇంట్లో ఇంతసేపు చావు కబుర్లు మాట్లాడడమే తప్పు, ఏ సంగతి మీరు నిర్ణయించుకొని నాకు ఫోన్ చేయకుండా మెసేజ్ పెట్టండి చాలు” హాలు లోపలికి వచ్చిన శాస్త్రిగారు గబగబా నడుచుకుంటూ పెళ్లిమండపం చేరుకున్నారు.

“ఏమిటి శాస్త్రిగారూ ఏం జరిగింది” పెళ్లికూతురు తండ్రి ఆత్రుత. “ఏం లేదు,   గాభరా పడకండి” అని ఆయనకి చెప్పి –   పెళ్లికొడుకుతో – “అబ్బాయి, కాళ్ళు రెండూ పళ్లెంలో పెట్టు” అని  చెప్పి, “అమ్మా, వరుడి కాళ్ళ మీద మీరు నీళ్లు పోయండి” అని పెళ్లికూతురు తల్లికి చెప్పి, “అయ్యా, ఆ నీళ్లతో వరుడి కాళ్ళు మీరు శుభ్రంగా కడగండి” అని పెళ్లికూతురు తండ్రికి —   చిన్నరకం అవధాన ప్రక్రియ లాగ – ఒకేసారి చెప్పిన శాస్త్రిగారు మంత్రాలు వల్లించసాగేరు.

జీలకర్ర బెల్లం రెండు ముద్దలు రెండు తమలపాకుల మీద వేరు వేరుగా పెట్టి, శాస్త్రిగారు వధూవరులకు చెరొకటి ఇచ్చి – వారితో – “నాలుగు నిమిషాలు పొతే, నేను చెప్పగానే మీరిద్దరూ  ఈ జీలకర్ర బెల్లం ముద్దని ఒకరి తల మీద ఒకరు పెట్టి, మీ చేయి అలాగే ఉంచి, ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవాలి, తెలిసిందా” అని అడగగానే –  వారిద్దరూ ‘తెలిసింది’ అన్నట్టు తలలూపేరు.   ఈ కార్యక్రమం ఎటువంటి అడ్డంకిలేకుండా ముహూర్తానికి శుభంగా గడిచింది. మండపం మీద ఉన్న పెద్దలంతా వధూవరుల మీద అక్షింతలు వేసిన తరువాత – వధూవరులిద్దరూ ఒకరి మొబైల్ లో మరొకరిని బంధించుకొని ఆనందపడిపోయేరు.

మంగళసూత్రధారణ సమయానికి శాస్త్రిగారు,  పెళ్లికొడుకుతో — “అబ్బాయి లేచి నిలబడు, ఈ మంగళసూత్రం అందుకో, వధువు మెడలో దీంతో మూడుముళ్ళు వేసి ఆ ముళ్ళు వేసిన చోట పసుపు పూయి” అని బోధపరచి, “మంగళ వాయిద్యాలు బ్యాండు మేళం వాయించండహో” అని కేక వేసి, “వధువు జట ఎత్తి పట్టుకోండమ్మా” అని అక్కడున్న మహిళామణులకు చెప్పేరు. మంగళవాయిద్యాల వారు బ్యాండు వారు కూడబలుక్కున్నారా అన్నట్టుగా ఒకేసారి — “సీతారాముల కళ్యాణము చూతము రారండీ” అని నవ్య నూతనంగా వినిపించే పాత పెళ్లి పాట వాయించసాగేరు.   సంతోషంతో తల వంచిన మధురిమ మెళ్ళో  మంగళసూత్రధారణ చేయడానికి ఆనందంతో నిలబడిన రఘు  –  ‘ఈ మౌనం ఈ బిడియం ఇదేనా’ అన్న రింగ్ టోన్ వినిపించగానే – తన మొబైల్ తెరమీద కనిపిస్తున్న పేరు చూసి, చేతిలో ఉన్న మంగళసూత్రంతో సహా మొబైల్ పట్టుకొని పెళ్లిమండపం మీంచి క్రిందకి దూకి, చెవిలో ఉన్న బ్లూటూత్ సరిచేసుకుంటూ – హాలు బయటకు తొందరగా పరిగెత్తేడు.   “పెళ్ళికొడుకు పారిపోతున్నాడోహో” అని పెళ్లికొచ్చిన జనం వింతగా చూడసాగేరు. వంచిన తల ఎత్తలేక పెళ్లికూతురు బిగుసుకుపోయి అలాగే కూర్చుంది.   ‘ఇలా పరిగెట్టేడేమిటి పెళ్ళికొడుకు’ అన్నట్టు ఇరుపెళ్లివారు ఎక్కడున్నవారక్కడే చేష్టలుడిగి నిలబడిపోయేరు.

ఎంత పరుగుతో వెళ్లేడో – అంతే పరుగుతో ఐదు నిమిషాలలో తిరిగి వచ్చిన రఘు – మధురిమతో — “సారీ స్వీటీ, మా బాస్ విష్ చేయడానికి ఫోన్ చేసేరు, తప్పదుకదా. హోప్ యు డిడ్ నాట్ మైండ్” “నో, డోంట్ వర్రీ” అని అభయమిచ్చింది మధురిమ. “యు నో, మా బాస్ కూడా మన హనీమూన్ కి పది రోజులు ఆఫీసియల్ గా పారిస్ టూర్ శాంక్షన్ చేసేరు” “ఫెంటాస్టిక్.  సో నైస్ అఫ్ యువర్ బాస్” అని రఘు చేయి పట్టుకొని సంతోషంగా ఊపింది మధురిమ. మరునిమిషంలో అందరూ ఆనందించేటట్టుగా మంగళసూత్రధారణ జరిగిపోయింది.  శాస్త్రిగారు లేచి నిలబడి ఆహుతులనుద్దేశించి – “అందరూ నూతన దంపతులని అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి ఇక మండపం మీదకి రావొచ్చు” అని సూచించేరు. పెళ్లి మండపం మీద ఇక మొబైల్ దే సందడి. నూతన దంపతులను ఆశీర్వదించడానికి వచ్చిన వారిలో కొంతమంది నూతన దంపతులని తమ మొబైల్ కెమెరాలో బంధిస్తున్నారు. మరికొంతమంది నూతన దంపతులతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్నారు. మొబైల్ మహిమతో, నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన వారిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.   

4.5/5 - (2 votes)
Prakasika
Author: Prakasika

Related Articles

Stay Connected

Latest Articles