21 C
New York
Sunday, April 28, 2024

సంస్కృతాంధ్ర భాషల్లో ఆదర్శనీయుడు: ఆచార్య రవ్వాశ్రీహరి

– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

“ఆరోజుల్లో సంస్కృతాన్ని ఆ ప్రత్యేకించి – శాస్త్రాలను ఒక వర్గం వారే చదివేవారు. ఇతరులకు శాస్త్రాలు చెప్పేవారు కాదు కూడా. కాని, మా గురువుగారు శ్రీమాన్‌ శఠగోప రామానుజాచార్యులవారు ఆ రోజుల్లో అంటే సుమారు 50 ఏండ్ల క్రితం నాకు మహాభాష్యం బోధించినారంటే వారి విశాల హృదయం, ఔదార్యం ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు” – ఇవి, తెలుగు భాషా, సాహిత్య రంగాల్లో తొలితరం పరిశోధకులతో పరిచయం ఉండి, ఆ వారసత్వాన్ని కొనసాగించిన ద్వితీయ తరం పరిశోధకుల్లో అద్వితీయమైన ప్రతిభాశాలి ఆచార్య రవ్వాశ్రీహరిగారి మాటలు. ‘నా సాహితీ జీవన యానం’ పేరుతో 2014లో ఆచార్య రవ్యాశ్రీహరిగారు రాసుకున్న స్వీయ కథనంలోనివి. దీనిలో ఆనాటి సామాజిక స్థితిగతులను చెప్తూనే, తన గురువుగారి గొప్పతనాన్ని ప్రకటిస్తూనే, తన వ్యక్తిత్వాన్ని ప్రతిబించించేలా చేసుకున్నారు.

ఒక పేద, చేనేత వృత్తి కుటుంబంలో జన్మించి, తన తెలివితేటలతో, క్రమశిక్షణతో, అత్యున్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించి, అత్యున్నత పదవులను అధిరోహించి మహాపండితుల సరసన చేరిన ఒక ఆదర్శనీయ జీవితానికి నిదర్శంగా నిలవడానికి గల నేపథ్యాన్ని తెలిపే మాటలు. జీవితంలో ప్రతి విషయాన్ని వ్యతిరేక దిశలో ఆలోచించేవాళ్ళు కొంతమందైతే, ప్రతి విషయాన్ని అనుకూలంగా మార్చుకునే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఆచార్య రవ్వా శ్రీహరిగారు సామాజిక వాస్తవికత తెలిసినవారు. చట్టం, న్యాయం కూడా మార్చలేని సంప్రదాయ పరంపరను గుర్తెరిగినవారు. ఇటువంటి సంప్రదాయాలను తిరస్కరిస్తూ, ప్రత్యామ్నాయం కోసం తమ జీవితాల్నే త్యాగం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరికొంతమంది సంప్రదాయాల్ని అవగాహన చేసుకుంటూనే ఆ సంప్రదాయవాదుల్ని సంస్కరణల వైపు ఆలోచించేలా చేసేవాళ్ళుంటారు. ఈ రెండవ మార్గానికి చెందినవారు. ఆచార్య రవ్వాశ్రీహరిగారు.

శ్రీహరిగారు తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్హా, ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండలం, వెల్వర్తికి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబంలో 1943, సెప్టెంబరు 12వ తేదీన పుట్టి పెరిగి, చదువుకి పేదరికం అడ్డుకాదని నిరూపించిన ఆదర్శనీయ వ్యక్తిత్వంగల ఆయన 2023, ఏప్రిల్‌ 21 శుక్రవారం రాత్రి మరణించారు. సుమారు 79 సంవత్సారాలు జీవించిన ఆచార్య రవ్వాశ్రీహరిగారు నిరంతర పరిశోధకులు. ఆయనకు 75వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆచార్య కొంకా యాదగిరిగారి ప్రధాన సంపాదకత్వం, డా.అప్పం పాండయ్య, ఆచార్య పిల్లలమర్రి రాములు, డా.కె. రాందాస్‌ సంపాదకులుగా “శ్రీహరి విజయం’ పేరుతో వెయ్యిపుటలకు పైగా ఉన్న ఒక అభినందన సంచిక వెలువడింది. దానిలో శ్రీహరిగారి జీవితం, వ్యక్తిత్వం, పరిశోధన, విమర్శ, బోధన, పరిపాలనాదక్షత, కుటుంబ వివరాలు ఎన్నో వివరంగా ఉన్నాయి. ప్రముఖకవి డా.తిరుమల శ్రీనివాసాచారిగారు ‘రుబాయి పరిమళాలు’ లో శ్రీహరిగారి వ్యక్తిత్వాన్నీ, సాహితీమూర్తిమత్వాన్ని అభివర్ణిస్తూ ఇలా అన్నారు. ‘నీవసలే ముట్టలేదు దూది పత్తి చేతులతో/ఏనాడూ పట్టలేదు ఏకుకండె చేతులతో /శ్రీహరి! నీజీవితమే కలం గళం కాగితాలు/క్షణమైనా విడువలేదు మైత్రి పదజ్యోతులతో” సాధారణంగా జ్యోతి వెలగాలంటే దూది ఉండాలి. ఆ దూదికి నూనె ఉండాలి. ఒక చేనేత కుటుంబానికి చెందిన శ్రీహరిగారు తాను ఏనాడూ తన కులవృత్తి చేయకుండా భాషాసాహిత్యాల్లో పదాలనే జ్యోతులను తన కలం, గళం అనే నూనెతో ముంచి శాశ్వతంగా వెలిగించేలా చేశారనే వర్షన ఎంతో బౌచిత్యంగా వ్యక్తమైంది. అంతేకాదు ఇంకా శ్రీహరిగారి గురించి వర్షిస్తూ కవి ‘

‘దేవవాణి ఒక నయనం
తెలుగువాణి ఒక నయనం” అంటూనే-
‘శిఖరంలా నిలిచావు
ముకురంలా వెలిగినావు
వాగ్దేవీమకుటంలో
వజ్రంలా అలరినావు”

అని ఆయనను మహోన్నతమైన శిఖరంపై మూర్తికట్టేలా నిలిపారు. ఇది నిజం.

అయితే, ఆయన తాను కావాలని సంస్కృతభాషను నేర్చుకోవాలనుకోలేదంటూనే, నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత దాన్ని మధ్యలో మాత్రం ఆపేయలేదని శ్రీహరి గారు చెప్పారు. ఆచార్య పిల్లలమర్రి రాములుగారు చేసిన ఒక ఇంటర్వ్యూలో ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఆ అభిప్రాయాన్ని ఇలా చెప్పుకున్నారు. “నేను కావాలని సంస్కృతాన్ని అధ్యయనం చేయలేదు. కేవలం యాదృచ్చికం. నాకు ప్రతీనెల డబ్బు పంపించి చదివించే స్తోమత మా నాన్న గారికి లేకుండె. అందువల్ల నేనేం చేయాలి. నాకేమో ఏదో చదువుకోవాలని ఉంది. యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం వాళ్లు సంస్కృత విద్యాపీఠంలో చేరినటువంటి విద్యార్థులకు ఫీజు లేకుండా భోజనం పెట్టి, ఉచితంగా వసతి సౌకర్యం అందిస్తారు. మన యోగక్షేమాలన్నీ చూసుకుంటారు. కనుక ఏ చదువైతేనేమిటి? అని వెళ్లి అక్కడ చేరినాను. ఇదీ నా సంస్కృత అధ్యయనానికి ఒక ప్రాతిపదిక.” అలా చదువుకోగలిగారు. కనుకనే ఆయన శ్రీహరి నిఘంటువు, అన్నమయ్య పదకోశం, సంకేత పదకోశం, వ్యాకరణ పదకోశము (బొడ్డుపల్లి పురుషోత్తంతో కలిసి), నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం పేర్లతో వివిధ నిఘంటువులు, పదకోశాలను రూపొందించారు. ఉభయభారతి, అన్నమయ్యసూక్తి వైభవం, అన్నమయ్యభాషా వైభవం, తెలుగులో అలబ్ధవాఙ్మయం, సాహితీ నీరాజనం, తెలుగు కవుల సంస్కృతానుకరణలు, వాడుక తెలుగులో అపప్రయోగాలు, తెలంగాణా మాండలికాలు-కావ్యప్రయోగాలు, నల్లగొండజిల్లా ప్రజలభాష మొదలైన విమర్శగ్రంథాలు వెలువరించారు. సిద్ధాన్త కౌముది, అష్టాధ్యాయి వ్యాఖ్యానం, అలబ్ధ కావ్య పద్య ముక్తావళి మొదలైన గ్రంథాలు రచించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్‌-ఇన్‌- ఛార్జ్‌గా కూడా పనిచేశారు. తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారిచే మహామహోపాధ్యాయ. బిరుదు పొందారు. అలాగే, సి పి బ్రౌన్‌ పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం వారి విశిష్ట పురస్కారం, తానా వారి గిడుగు రామ్మూర్తి పురస్కారం వంటివెన్నో ఆయన అందుకున్నారు. ఈ చిన్న వ్యాసంలో వారి ప్రతిభను అంతటినీ ప్రదర్శించే అవకాశం లేదు.

ఆచార్య కె.కె.రంగనాథాచార్యులు, ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య, ఆచార్య పరిమి రామనరసింహం, ఆచార్య ఆనందారామం, ఆచార్య యస్‌.శరత్‌ జ్యోత్న్నారాణి, ఆచార్య ఎన్‌. ఎస్‌.రాజు వంటి మహాపండితుల దగ్గర నేను ప్రత్యక్షంగా చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎం.ఏ., తెలుగులో మాకు ఆచార్య రవ్వాశ్రీహరిగారు సంస్కృతం పాఠం చెప్పేవారు. ఆయన సంస్కృతంలోని శబ్దాలు, ధాతువులను చాలా సులభంగా గుర్తించుకునేలా చెప్పేవారు. మాయాబజారు (1957)లో ఒక పాత్రధారుడు ‘సు, ఔ, జస్‌…’ అంటూ మంత్రాలు చదివినట్లు చదువుతాడు. అవి సంస్కృత భాషను నేర్చుకోవడానికి ప్రాథమికంగా ఉపయోగపడే శబ్బాలు, ధాతువులు, ప్రత్యయాలకు సంబంధించిన అంశాలని మాష్టారు మాకు పాఠం చెప్పేవరకు తెలియదు. ఆ సినిమా చూసినప్పుడల్లా మాకు శ్రీహరిగారు గుర్తుకొస్తారు. మాకు పాఠాల్ని చెప్పేటప్పుడు తప్పులు చేసినా ఒక క్రమం ఉండాలని పదేపదే. చెప్పేవారు. విద్యార్థులు కొన్ని పదాల్ని రాసేటప్పుడు అక్షరదోషాలతో రాయడం సహజం. ఆ పదాల్ని అదే పద్ధతిలో అన్ని చోట్లా ఒకేలా రాస్తే, ఆ విద్యార్థికి తెలియదని అర్ధం చేసుకొని క్షమించే అవకాశం ఉంటుందనీ, అలా కాకుండా ఒకచోట ఒకలా, మరొకచోట మరొకలా రాయడం వల్ల ఆ విద్యార్థి చేసే తప్పునిజాయితీగా ఒప్పుకోవడంలేదనీ, ఒక గందరగోళంలో ఉన్నాడనీ తెలుస్తుందనేవారు. అలాగే, ఆయన కాళిదాసు అభిజ్ఞానశాకుంతలమ్‌, మాళవికాగ్నిమిత్రమ్‌ పాఠ్యాంశాలుగా చెప్పేవారు. కాళిదాసుకి ప్రకృతిపట్ల ఉన్న అనుబంధాన్ని మట్టివాసన గురించి చెప్పేటప్పుడు ఎంతో ఆనుభవపూర్వకంగా చెప్తున్నట్లు వివరించేవారు. బాగా ఎండలు ఉండీ, తర్వాత వర్షం కురిస్తే వచ్చే మట్టిపరిమళాల గురించి ఎంతో తాదాత్మ్యంతో చెప్పేవారు. వర్షం వచ్చినప్పుడు మట్టివాసన వచ్చినప్పుడల్లా నాకు ఆయన పాఠమే గుర్తొస్తుంది. అంత గాఢమైన ముద్రతో పాఠం చెప్పేవారు. ఆయన ఎం.ఏ. తెలుగు, సంస్కృతాన్ని ప్రయివేటుగా చదువుకోవడం వల్లనో, పేదరికంతో అందరూ బడిలోనే చదువుకోవడం సాధ్యం కాదనే జీవితానుభవం వల్లనోగానీ ప్రయివేటుగా చదువుకున్నవాళ్ళకు కూడా సమప్రాధాన్యాన్నే ఇవ్వాలనేవారు. అలాగే, పరిశోధన కోసం వచ్చే వారిలో ప్రయివేటుగా చదివినా ప్రతిభావంతులైతే వారికి అవకాశాన్ని ఇచ్చేవారు. ఆయనకు సంస్కృతంలో అధ్యాపకుడు కావాలని కోరిక ఉన్నా, తెలుగు అధ్యాపకుడుగానే స్థిరపడాల్సివచ్చింది. కానీ, తాను నేర్చుకున్న సంస్కృతాన్ని, తాను నేర్చుకున్న వ్యాకరణాన్ని తెలుగు భాషాసాహిత్యాలకు మెరుగులు దిద్దడానికి బాగా ఉపయోగించారు.

మొత్తం మీద ఆచార్య రవ్వా శ్రీహరిగార్ని ముఖ్యంగా మూడు విషయాల్లో ఆదర్శంగా తీసుకోవాలనుకుంటాను. మొదటిది: చదువుకి పేదరికం అడ్డుకాదని నిరూపించి, అత్యున్నత చదువులు చదవగలిగారు. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలి. రెండవది: తమ కులానికి, తమ వర్గాలకి అత్యంత దూరంగా ఉండే సంస్కృత భాషను నేర్చుకోవడంతోపాటు దానిలో గొప్ప పాండిత్యాన్ని సాధించగలిగారు. ఇక్కడ ఆ సంస్కృతాన్నే నేర్చుకోవాలనుకోవడం వెనుకున్న లక్ష్యాన్ని గమనించాలి. మూడవది: ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఆయన నడిచిన మార్గాన్ని అధ్యయనం చేయాలి. ఒకవైపు ప్రామాణిక భాషగా కొనసాగుతున్న తెలుగు భాషను అనుసరిస్తూనే తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని భాష పట్ల తన అస్తిత్వాన్ని, విశిష్టతను నిరూపించే ప్రయత్నం చేశారు. ఆయనకు సంస్కృతాంధ్ర భాషల్లో గొప్ప పండితుడుగా పేరున్నా, స్థానిక తెలుగు భాషకు, దాన్ని చాలామంది మాండలికం అని అంటున్నా, దానికి ప్రామాణిక స్థాయి ఉందని నిరూపించడానికి చేసిన శాస్త్రీయ నిరూపణలు పరిశీలించాలి. ఆచార్య రవ్వా శ్రీహరి గారు అనగానే ఈ మూడు విషయాలూ ఆయన వ్యక్తిత్వాన్నీ, ప్రతిభనూ, అస్తిత్వాన్నీ ప్రతిబింబించే అంశాలు.

బ్రాహ్మణుల మధ్య తానొక్కరే బ్రాహ్మణేతరుడై ఉండి చదువుకున్నా, తన జీవితంలో పెద్ద సంఘర్షణ ఎదురుకాలేదని చెప్తూ “భోజనాల సమయంలో మాత్రం మమ్మల్ని విడిగా కూర్చోబెట్టేవారు. అక్కడ బ్రాహ్మణులకు ఒకటి, అలాగే వైష్ణవులకు ఒకటి తినే స్థలాలు వేరుగా ఉండేవి. ఈ స్మార్తులను కూర్చోబెట్టిన దగ్గర వారు తిన్న తరువాత మమ్మల్ని కూర్చోబెట్టి భోజనానికి లేపేవారు. నాకది పెద్దగా బాధ అనిపించకపోయేది. ఎందుకంటే వాళ్లు నన్ను ఎంతో ప్రేమతో చూస్తున్నారు. బాగా చదువుతున్నానని ప్రోత్సహిస్తున్నారు. దీంతో వివక్ష అనే భావనకు తావు లేదనిపించింది. అదొక ఆచారం. ఆ ఆచారపద్ధతి ప్రకారం మేం నడుస్తున్నామని మాకు అనిపించిందంతే.” అని చెప్పుకున్నంత సులభం కాదు, దాన్ని అనుభవించడం. కానీ, దాన్ని ఆ సమాజపరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగలిగే తెలివితేటలు, సంయమనం ఒక సామాన్యుడికి సాధ్యమయ్యే పనికాదు. అందుకే ఆయన అసామాన్యుడయ్యాడు.

ఒక కవి/రచయిత/విమర్శకుడు/పరిశోధకుడు _ చేసిన కృషి ఎటువంటిదైనా పాఠకుడు/ప్రేక్షకుడు తనకది ఎలా ఆత్మీయమవుతుందని ఆలోచించడం సహజం. తెలంగాణ ప్రజలు తగిన గౌరవానికి నోచుకోని పదాలకు గౌరవాన్ని కలిగించడంలో భాషాపరంగా ఆయన అనేకమందికి ఆత్మీయులయ్యారు. ఎంత పండితుడైనా శాస్త్రాల్ని పాఠం చెప్పేటప్పుడు వాటిని దగ్గరపెట్టుకొని సాధికారికంగా చెప్తున్న ప్రమాణాల్ని చూపిస్తూ పాఠాలు చెప్పేవారిక, పరిశోధనలు చేసేవారికీ ఆత్మీయులయ్యారు.. గుర్రం జాషువా గారి ఫిరథౌసి గబ్బిలం కావ్యాల్ని సంస్కృతంలోకి అనువదించారు. గబ్బిలం కావ్యాన్ని ‘తైలపాయికా’ పేరుతో సంస్కృతంలో అనువదించడంలో ఒక విశిష్టత ఉంది. జాషువా ప్రయోగించిన ఛందస్సులలోనే శ్రీహరిగారు సంస్కృతంలో కూడా ఆటవెలది, తేటగీతి, ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్జూలాది వృత్తాలలోనే వర్ణించడం ఒక ప్రయోగం. ఆ విధంగా శ్రీహరిగారు సమకాలీన అస్తిత్వ ఉద్యమాలను గమనిస్తున్నవారికి ఆత్మీయులయ్యారు. అన్నమయ్య సాహిత్యాన్ని పరిశోధన చేసి సుమారు 240 నవ్వుల్ని గుర్తించి, అన్నమయ్య తెలుగు భాష ద్వారా అందించిన సాంస్కృతిక వారసత్వాన్ని, బొన్నత్యాన్ని ప్రపంచానికి చాటి తెలుగువాళ్లందరికీ ఆత్మీయులయ్యారు. సంస్కృతభాష భారతీయ సాంస్కృతిక పునాదిగా, వారసత్వ సంపదగా, సకల విజ్ఞానమార్గదర్శిగా భావించి, దానికోసమే తన జీవితాన్ని అంతటినీ అంకితం చేసి భారతీయులందరికీ ఆత్మీయులయ్యారు. ప్రముఖ కవి డా.తిరుమల శ్రీనివాసాచార్యగారు ఆచార్య రవ్యాశ్రీహరిగార్ని ప్రశంసించిన కవితతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

“నీ వంటే తెలంగాణకెంతో గర్వం
నీ వుంటే తెలంగాన భాషా సర్వం
ఎంతెత్తో అంతలోతు నీ వ్యక్తిత్వం
తెలంగాణలో నీదొక సువర్ల పర్వం”

5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles